పంచారామాలకు, శబరిమలైకు ప్రత్యేక బస్సులు | Sakshi
Sakshi News home page

పంచారామాలకు, శబరిమలైకు ప్రత్యేక బస్సులు

Published Sat, Nov 9 2013 2:33 AM

special buses for Pancharam, sabarimala

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా పంచారామాలకు, శబరిమలైకు ప్రత్యేక బస్సులను నడుపుతోందని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్ ఎం.సన్యాసిరావు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచారామాలైన అమరావతి(అమరలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీరరామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట (కొమరరామలింగేశ్వర స్వామి) ఐదు శైవ క్షేత్రాలను ఒకేరోజులో భక్తులు దర్శించుకునే విధంగా నడుపుతామన్నారు. ఈ నెల 10, 17, 24, డిసెంబర్ ఒకటో తేదీల్లో (ఆదివారాల్లో) మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళంలోని కాంప్లెక్స్‌లో బయలుదేరి సోమవారం ఐదు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించి మంగళవారం ఉదయం శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు బస్సు చేరుకుంటుందన్నారు.

టిక్కెట్ ధరను డీలక్స్ బస్సుకు పెద్దలకు రూ. 3120, పిల్లలకు  990 రూపాయలుగా నిర్ణయించామన్నారు. వివరాలకు 08942 224492, 7382922015 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. అలాగే శబరిమలైకు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. వీటితోపాటు పిక్నిక్ స్పాట్‌లైన కళింగపట్నం, మొగదాలపాడు, విశాఖపట్నంలోని కైలాసగిరి, బీచ్ తదితర ప్రాంతాలకు కూడా బస్సులను నడుపుతామని.. ఈ అవకాశాన్ని జిల్లావాసలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్‌పీ రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement