
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్.
సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు.
గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం.
‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది.
చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల!