Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్‌ అనే రసాయనం వల్ల!

Health Tips In Telugu: Gorintaku On Hands Benefits In Ashada Masam - Sakshi

ఆషాఢమంట.. గోరింట ఎందుకంట?

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే...

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.

ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.

ఆనవాయితీ
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్లే!
ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది.

కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. 

చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే..
                               

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top