Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!

Open library under trees to attract new generations into reading in Assam - Sakshi

చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు.
డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి...
అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే...

అస్సాంలోని జోర్హాట్‌ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

స్కూల్‌ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్‌పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు.
సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు.

ఈ ఇంటర్నెట్‌ యుగంలో చాలామంది పిల్లలు సెల్‌ఫోన్‌ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది.
‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం.
అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది.
ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్‌హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్‌లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్‌లు, పుస్తకాలు పెట్టారు.
స్పందన చూశారు.
అద్భుతం.

చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం!
‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్‌.

విశేషం ఏమిటంటే...
జోర్హాట్‌ జిల్లా  చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో  కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా

ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్‌పూర్‌ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని.
ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్‌ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు.
‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది.

మూడు నెలలు వెనక్కి వెళితే...
పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌ యూరోపియన్‌ క్లబ్‌ గ్రౌండ్‌లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్‌ ఎయిర్‌ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top