‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్‌! | Sakshi
Sakshi News home page

‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్‌!

Published Fri, Apr 15 2022 11:18 AM

Obesity:Hidden Secrets of Malabar Tamarind to lose weight - Sakshi

ఊబకాయం.. ఒబెసిటీ ఇదో పెద్ద సమస్య, కొండలా పేరుకుపోయిన Extra Fat ను కరిగించుకోవడం అంత తేలిక కాదు. మన దేశంలో చిన్నా పెద్దా   తేడా లేకుండా చాలామంది అధికబరువుతో పోరాడుతున్నారు. మరి అనేక సమస్యలకు మూలకారణంగా మారుతున్న అధికబరువును  తగ్గించుకోవడానికి సాంప్రదాయమైన చక్కటి పెరటి ఔషధం ఉంది తెలుసా? చూడ్డానికి మన గుమ్మడి పండులా కనిపించే ఈ పుల్లటి పండు కొన్ని  పొట్ట సమస్యలకు  చెక్‌  చెప్పడమే కాదు, బరువును నియంత్రించడంలో బేషుగ్గా పనిచేస్తుందట.   మరి పులి లాంటి ఆ పండు ఎక్కడ దొరుకుతుంది? 


అధిక  బరువును తగ్గించుకునేందుకు చాలమంది పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొద్దో గొప్పో వ్యాయామం చేస్తూ నోరు కట్టేసుకున్నా కూడా ఎలాంటి ఫలితం కనిపించక ఇబ్బందులు పడుతూ ఉంటారు.  అయితే  సాంప్రదాయమైన మన దేశంలో దొరికే మలాబార్  చింతపండు ద్వారా బరువు తగ్గ వచ్చిన తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కేరళలో విరివిగా లభించే దీన్ని  మలయాళం, తమిళంలో కడంపులి లేదా పులి అని పిలుస్తారు. తెలుగువారి గుమ్మడికాయగా కనిపించే  ఈ పులి  పండు కేరళలో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ పండిస్తారు. 

ఈ కుడంపులి వంటలకు పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో పాపులర్‌ అయింది. దీని శాస్త్రీయ నామం గార్సీనియా కాంబొజియా. అనేక వ్యాధుల నివారణకు పూర్వ కాలంనుంచి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. ముఖ్యంగా పొట్టలో పురుగులు, మలబద్ధకం, క్యాన్సర్, పైల్స్, రుమాటిజం, ఎడెమా, లేట్‌ పీరియడ్స్‌, లాంటి ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగించేవారట.  ఒక విధంగా చెప్పాలంటే ఈ పండు మాత్రమే కాదు రూట్‌లో ఉండే గార్‌బోగియోల్ అనే క్సాంతోన్,  బెరడులో గార్సినోల్,  ఐసోగార్సినోల్ వంటి బెంజోఫెనోన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ పండుపైన ఉండే తొక్కల్ని ఎండబెట్టి  కడుపు వ్యాధులకు నివారణగా తీసుకుంటారు.  కేరళ, శ్రీలంకలో చేపల కూరకు మంచిరుచి, చిక్కదనం , సువాసనకోసం దీన్ని వాడతారట. అలాగే చేపలను ఎండబెడ్డే క్రమంలో  దీన్ని విరివిగా వాడతారు. ఎల్‌డీఎల్‌ లేదా బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌,  ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను గణనీయంగా తగ్గించే లక్షణం కూడా దీనికి ఉంది.  

అయితే, ఈ పుల్లని పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి.  40 మంది వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు పరీక్షలు  నిర్వహించారు.  ఒకరికి మలబార్ చింతపండుతో  వాడిన ఆహారం అందించగా, మరొకరికి  మలబార్‌  చింతపండు లేని ఆహారం అందించి పరిశీలించగా ఈ చింతపండును తిన్న  గ్రూపులో ఉదర కొవ్వు , విసెరల్ కొవ్వులో తగ్గుదల కనపించిందంట. షుగర్‌ స్థాయిలను తగ్గిస్తుందని 2015లో ఎలుకలపై నిర్వహించిన స్టడీలో తేలింది. 

వివిధ కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు,  హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ లేదా హెచ్‌సీఏ వంటి పోషకాలతో నిండి ఉంది. మలబార్ చింతపండు. హెచ్‌సీఏ బరువు తగ్గడానికి సాయడటమే కాదు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఆకలిని కూడా  తగ్గిస్తుంది. ఇందులోని సిట్రేట్ లైజ్ అనే ఎంజైమ్ చక్కెరను కొవ్వులుగా మారకుండా  అడ్డుకుంటుంది. సెరోటోనిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వీటితోపాటు పశువులలో నోటికి సంబంధించిన వ్యాధుల నివారణలో వెటర్నరీ మెడిసిన్‌లో కూడా ఈ చింతపండును వాడటం విశేషం.

 కుడం పులి టీ: అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రతి భోజనానికి 30 నిమిషాల ముందు కుడంపులి టీతాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన రెండు పెద్ద కుడంపులి ముక్కలను సుకుని రాత్రంతా నానబెట్టాలి.  దీన్ని సన్నటి మంటమీద మరగించి, జీలకర్ర పొడి , తాటి బెల్లం కలిపితే కుడంపులి టీ రడీ.

సైడ్‌  ఎఫెక్ట్స్‌: మలబార్‌ చింతపండు   ప్రభావంతో కొంతమందిలో తలనొప్పి,  వికారం, చర్మంపై దద్దుర్లు, చలి, జీర్ణ సమస్యలు లో సుగర్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా తింటే లివర్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. 

Advertisement
Advertisement