
కొన్ని ఘటనలు మానవత్వం ఇంకా ఉందా అనే సందేహానికి తావిస్తే, మరికొన్ని.. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఆ సంఘటన అందరిని మానవత్వంపై ఆలోచింప చేయడమే గాక, తోటివారికి చేతనైనా సాయం చేయాలి అనే స్పుహని కలిగించేలా చేసింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే ఒంటరిగా సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైయ్యారు. దాంతో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. అంతేగాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడ్డారు.
ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయటన పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం తదితరాల వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
స్పందించిన అప్పార్ట్‌మెంట్ వాసులు..
అనూప్ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్‌మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్.ఈఏఎల్ (Social & Evangelical Association for Love) కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్‌ను అపార్ట్‌మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ప్రస్తుతం అనూప్‌కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, కష్టాల్లో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ఒకరి బాధను గమనించి, చేయగలిగినంతలో చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది.
మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే, అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి, సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం బలమైన సమాజాన్ని నిర్మించగలం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది ఈ ఘటన.
(చదవండి: కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..)