Navaratri Special : నవరాత్రులు ౼ నవోన్మేషాలు

Navaratri Nava Avatars Special Story In Telugu - Sakshi

ఆ ప్రాంత‌మంతా అంత‌వ‌ర‌కు నిశ్శబ్దంగా ఉంది. అక్కడ‌కు ఎవ‌రో రాబోతున్నార‌ని అంత‌కుముందే స‌మాచారం వ‌చ్చింది. దాంతో అక్కడ‌కు. నేల ఈనినట్లుగా జ‌న‌సందోహం చేరుకుంది. అంద‌రూ ఒళ్ళంతా ఇంతింత క‌ళ్లు చేసుకుని చూస్తున్నారు. చెవులను కూడా ఇంతింత చేసుకుని రాబోయే స‌వ్వడి కోసం నిరీక్షిస్తున్నారు. వారి మ‌న‌సు ఆనందంతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. ఎప్పుడెప్పుడు ఆ సుమ‌ధుర స‌మ‌యం ఆస‌న్నమ‌వుతుందా అని ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. 

ఆ శుభ ఘ‌డియ స‌మీపించింది అనడానికి నిదర్శనంగా పారిజాత పరిమళాలతో కూడిన ఓ సువాసన నాసికా రంధ్రాల ద్వారా మనస్సులోకి ప్రవేశించి, కన్నులు అరమోడ్పులయాయి. దూరంగా మువ్వల సవ్వడులు స‌న్నగా వినిపిస్తూ, అంత‌లోనే గుండెల‌ను తాకేంత ద‌గ్గర‌కు చేరుకుంది ఆ శ‌బ్దం. శ‌బ్దంతో పాటు సువాస‌న గుబాళింపులు కూడా ద‌గ్గర‌వుతున్నాయి. గాజుల గ‌ల‌గ‌లలు, కంఠాభ‌ర‌ణాల క్వణ‌నిక్వణాలు, క‌ర్ణాభ‌ర‌ణాల చిరు స‌వ్వడులు, రకరకాల పూల పరిమళాలు.. నెమ్మదినెమ్మదిగా ద‌గ్గర కాసాగాయి.

అంద‌రూ దూరం నుంచి భ‌క్తితో గ‌మ‌నిస్తున్నారు. ఈ సవ్వడుల‌తో పోటీ ప‌డుతూ వారి చిరుమంద‌హాస‌పు ధ్వనులు వీనుల విందు చేస్తున్నాయి. ఆ దృశ్యం చూసేస‌రికి అంద‌రికీ ఏదో మైకం క‌లిగింది. ఒక్కసారిగా ఎద‌లు పుల‌కించాయి. మాట మూగ‌బోయింది. అప్రయ‌త్నంగా రెండు చేతులు ఒక్కట‌య్యాయి. కనులు రెప్ప వేయడం మరచిపోయాయి. మ‌న‌సులో భ‌క్తి ప‌రుగులు తీసింది. అక్కడ‌కు తొమ్మిదిమంది అమ్మవార్లు వారి వారి అలంకారాల‌లో విహారానికి వ‌చ్చారు. ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకుంటున్నారు.  "ఏవ‌మ్మా! బాలా! నీతోనేగా న‌వ‌రాత్రులు ప్రారంభ‌మ‌వుతాయి" అంటున్నారు మిగిలిన ఎన‌మండుగురు..

బాల స్వచ్ఛమైన ప‌సి మొగ్గలాంటి చిరున‌వ్వుతో... "నేను బాల‌నే.. ఎన్నటికీ బాల‌నే.. మీ అంద‌రికీ చెల్లెలినే... " అంటూ ముద్దుముద్దుగా ప‌లికింది. అందుకు రాజ‌రాజేశ్వరి.. "నువ్వు ఆదిశక్తివి. అందుకే నిన్ను ఆదిశక్తిప‌రాయీ" అని స్తుతించారు. అంతేనా బాలేన్దు మౌళివి. అందులోనూ బాల ప‌దంతోనే కీర్తించ‌బ‌డ్డావు చూడు" అని అంటుంటే, బాల ప‌క‌ప‌క న‌వ్వింది. "మీకు తెలియ‌నిది కాదు.. మాన‌వ జ‌న్మ బాల్యంతోనే ప్రారంభ‌మ‌వుతుంది క‌దా. అప్పుడు వారు ఆదిశ‌క్తిలాగే ఉంటారు క‌దా.." అంటూ లౌకికార్థం ప‌లికింది బాల‌.

అంద‌రి దృష్టి గాయ‌త్రీమాత వైపుగా మ‌ర‌లింది. "మ‌న తొమ్మిది మందిలోనూ గాయ‌త్రిని నిత్యం స్మరిస్తూ ఉంటారు క‌దా" అన్నారు. "అవును గాయ‌త్రీమంత్రాన్ని కొంద‌రు ల‌క్షసార్లు ల‌క్ష గాయ‌త్రి పేరుతో చేస్తారు. మ‌నంద‌రికంటె గాయ‌త్రీ మాతే గొప్ప‌ది.." అన్నారు. గాయ‌త్రికి అర‌న‌వ్వు వ‌చ్చింది. "ఎనిమిది సంవ‌త్స‌రాలు నిండితే అంద‌రూ విద్యాభ్యాసం చేస్తారు క‌దా. అలా 14 సంవ‌త్స‌రాలు వాళ్లు చ‌దువుకుంటారు క‌దా. మ‌రి నిత్యం గాయ‌త్రీ మంత్రాన్ని స్మ‌రించ‌ట‌మంటే అదే క‌దా. మాన‌వుల‌కు చ‌దువు ఎంత అవ‌సర‌మో మ‌న‌కు తెలియ‌దా. విద్య లేని వాడు వింత ప‌శువు అనే మాట వాడ‌కంలో ఉండ‌నే ఉంది క‌దా" మిగిలిన ఎన‌మండుగురు భక్తిగా గాయ‌త్రీ మాత‌కు న‌మ‌స్క‌రించారు.

ఇప్పుడు అంద‌రూ త‌మ క‌డుపులు చూసుకుంటూ అన్నపూర్ణ వైపుగా చూశారు. అప్ప‌టికే అన్నపూర్ణ త‌న చేతిని గుండిగ‌లోకి పంపింది. "మీరేమంటారో నాకు అర్థ‌మ‌యిందిలే. సాక్షాత్తు ప‌ర‌మ‌శివుడు కూడా న‌న్ను భిక్ష అడిగాడ‌నేగా. అందులో అంత‌రార్థం మీకు తెలియ‌నిది కాదు. ఆక‌లి వేస్తే ఎవ‌రైనా అమ్మ‌నే క‌దా అడిగేది. భోజ్యేషు మాతా అని తెలియ‌దా. అందుకే నేను పూర్ణాహారం అంటే సంపూర్ణంగా.. అదే క‌డుపునిండుగా సంతృప్తిగా వ‌డ్డిస్తాను క‌దా. అందుకే న‌న్ను అన్న‌పూర్ణగా కొలుస్తున్నారు. మాన‌వ మ‌నుగ‌డ‌కు అన్న‌పూర్ణ అవ‌స‌రం ఉంది క‌న‌క‌నే నేను అవ‌త‌రించాను.." అంటూ అంద‌రికీ తృప్తిగా వ‌డ్డ‌న చేసింది అన్న‌పూర్ణాదేవి. అవును అందుకే "నిన్ను నిత్యానంద‌క‌రీ వ‌రాభ‌య‌క‌రీ... చంద్రార్కాన‌ల భాస‌మాన ల‌హ‌రీ.. భిక్షాందేహి కృపావ‌లంబ‌న‌క‌రీ మాతాన్న పూర్ణేశ్వ‌రీ... " అంటూ ప్ర‌స్తుతించారు.. అన్నారు ఎన‌మండుగురు తోబుట్టువులు.

కడుపులు నిండ‌గానే అంద‌రూ ల‌లితా త్రిపుర సుంద‌రిని ప్ర‌స‌న్న వ‌ద‌నాల‌తో తిల‌కించారు. "నీ పేరులోనే ల‌లితం ఉంది. నువ్వు  నిత్యం ప్ర‌స‌న్నంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం" అన్నారు అష్ట‌మాత‌లు. "ఇన్ని సంవ‌త్సరాలు చ‌దువుకుని, ఇంత ఆరోగ్యక‌ర‌మైన ఆహారం భుజించాక ప్రస‌న్నత వ‌చ్చితీరుతుంది. సాత్త్వికాహారం, స‌ద్గురువుల ద‌గ్గర విద్యాభ్యాసం.. ఇవే క‌దా మ‌న మ‌న‌సును ప్రభావితం చేసేది" అంటూ ప్రస‌న్నంగా ప‌లికింది ల‌లితాత్రిపుర సుంద‌రి.

"నిజ‌మే! నిన్ను నిత్యం స‌హ‌స్రనామాల‌తో కొలుస్తారు ఇందుకేనేమో. నీకు పెట్టే నైవేద్యాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి క‌దా. నిన్ను హ‌రిద్రాన్నైక ర‌సికా, ముద్గౌద‌నాచిత్తా, హ‌రిద్రాన్నైక ర‌సికా.. " అంటూ ఆనందంగా ల‌లితాదేవిని స‌హ‌స్రనామాల‌లోని మంత్రాల‌తో స్తుతించారు, ఎన‌మండుగురు త‌ల్లులు. "మ‌రోమాట కూడా చెప్పాలి నీ గురించి... నీ పూజ ప్రారంభించేస‌మ‌యంలో గంధం ప‌రిక‌ల్పయామి, ధూపం ప‌రిక‌ల్పయామి... అంటూ ఈ సృష్టి పంచ‌భూతాత్మకం, మాన‌వ శ‌రీరం కూడా పంచ‌భూతాల‌తోనే నిర్మిత‌మైన‌ద‌ని అంత‌ర్లీనంగా ఎంతో చ‌క్కగా తెలియ‌చేశావు" అంటూ ల‌లితాదేవిని ప్రశంసించారు.

ఇప్పుడు అంద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుంటూ మ‌హాల‌క్ష్మి వైపు చూస్తూ..."ఇంట్లో ఆడ‌పిల్ల పుడితే చాలా మ‌హాల‌క్ష్మి పుట్టింది అనేస్తుంటారు. ఇంత‌మందిమి ఉండ‌గా నీకే ఆ ఘ‌న‌త ద‌క్కింది.." అన్నారు. మ‌హాల‌క్ష్మి... సిరుల‌చిరున‌వ్వులు కురిపిస్తూ..."ఒక్కసారి సావ‌ధానంగా ఆలోచించండి. బాల‌గా అవ‌త‌రించి, గాయ‌త్రిగా చ‌దువుకుని, అన్నపూర్ణగా అంద‌రి క‌డుపులు నింపి, ల‌లిత‌గా పూజ‌లు అందుకున్న త‌ర‌వాతేగా నేను అవ‌త‌రించాను. అప్పుడు న‌న్ను అంద‌రూ ఆ ఇంటి దైవంగా కొల‌వ‌కుండా ఎలా ఉంటారు. ఇన్నిస‌త్కర్మలు త‌ర‌వాతే క‌దా నేను మ‌హాల‌క్ష్మిగా ప్రభ‌వించాను.". అంటూ నిరాడంబ‌రంగా ప‌లికింది మ‌హాల‌క్ష్మి. "నిజ‌మేలే...అందుకేగా నిన్ను స‌ర్వపాప‌హ‌రే దేవీ, స‌ర్వదుఃఖ హ‌రే దేవీ అంటూ  కొనియాడుతున్నారు "అన్నారు అంతా ముక్తకంఠంతో.

పక్కనే ధ‌వ‌ళ వ‌ర్ణ శోభితంగా ఉన్న స‌ర‌స్వతి వీణ వాయిస్తోంది. "ఇప్పటిదాకా మా ప‌క్కనే ఉన్నావు, అంత‌లోనే వీణ అందుకున్నావా.. అందుకేగా నిన్ను యా వీణా వ‌ర దండ మండిత క‌రా, యా శ్వేత ప‌ద్మాస‌నా అంటూ పిలుస్తున్నారు. నిత్యం తెల్లటి వ‌లువ‌ల‌తో, తెల్లని హంస మీద కూర్చుని ద‌ర్శన‌మిస్తావు. స‌ర‌స్వతీ న‌మ‌స్తుభ్యం ... విద్యారంభం క‌రిష్యామి.. అంటూ నీ ప్ర‌శంస‌తోనే విద్యాభ్యాసం ప్రారంభిస్తారు క‌దా...నీ మెడలో స్పటిక మాల కాంతులు వర్ణించలేము" అంటూ ప‌లికారు.

తెల్లటి కాంతులు వెద‌జ‌ల్లే చిరున‌వ్వుతో స‌ర‌స్వతీ దేవి.." ఇందాక మ‌హాల‌క్ష్మి చెప్పిన‌ట్లుగా ఇంత మంచి చేసుకుంటూ రావ‌టంతో పాటు, నాకు మ‌రికాస్త జీవితానుభ‌వం వ‌చ్చిన‌ట్లే క‌దా. చ‌దువు చెప్పేవారికి చ‌దువుతో పాటు జీవితానుభ‌వం, వ‌య‌స్సు కూడా ఉండాలి. నాకు అవి వచ్చాయి క‌దా. బాల‌గా ప్రారంభ‌మై... మ‌హాల‌క్ష్మి దాకా ఎంతో మంచి జ‌రిగిన తరువాత కదా నేను ప్ర‌భ‌వించాను. ఆ జీవితానుభ‌వ‌మే న‌న్ను చ‌దువుల త‌ల్లిగా నిల‌బెట్టింది. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. పారదర్శకంగా ఉండడానికి స్పటిక మాల" అంది వీణ మీద స‌ర‌స్వ‌తీ రాగాన్ని మీటుతూ ఆ శార‌దామాత‌.

ఇప్పుడు అంద‌రికీ దుర్గమ్మ వైపు చూడాలంటే భ‌యంగా ఉంది. దుర్గమాసురుడిని సంహ‌రించి దుర్గామాత‌గా అంద‌రి పూజ‌లు అందుకుంటూ.. దుర్గాష్టమిగా న‌వ‌రాత్రుల‌లో ఎనిమిదో రాత్రిని త‌న పేరు మీదుగా తెచ్చుకుంది. ఇంత‌వ‌ర‌కు వారితోనే క‌ల‌సిమెల‌సి తిరిగిన దుర్గమ్మకు.. వారిలోని భ‌యాన్ని చూస్తే న‌వ్వు వ‌చ్చింది. "ఎందుకు మీరంతా భ‌య‌ప‌డ‌తారు. స్త్రీ శ‌క్తి స్వ‌రూపిణి. దుష్ట సంహారం చేయ‌గ‌ల‌ద‌ని క‌దా నేను నిరూపించిన‌ది. నాకు ఈ శ‌క్తి ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో మ‌ళ్లీ నేను చెబితే చర్విత‌చ‌ర్వణ‌మే అవుతుంది. బాల‌గా అవ‌త‌రించి, ఇంత చ‌క్క‌గా చ‌దువుకుని, శ‌క్తిమంత‌మైన ఆహారం తిని, అంద‌రి స్తుతులు అందుకుని, సంప‌ద‌లు పొంది, విద్యాధి దేవ‌త‌ను అయ్యాక... నాకు వ‌చ్చే మ‌నోబ‌లం, బుద్ధిబ‌లం, శ‌రీర బ‌లంతో దుష్ట సంహారం చేయ‌టం పెద్ద కష్ట‌మైన విష‌యం కాదు కదా.." అంటూ అదంతా త‌న గొప్ప‌త‌నం కాద‌న్న‌ట్లుగా ప‌లికింది దుర్గ‌మ్మ‌. అంద‌రూ దుర్గ‌మ్మ‌ను చేరి, గుండెల‌కు హ‌త్తుకుని ముద్దాడారు. 

అక్కడితో భ‌యం పోయిందా అనుకుంటే పోలేదు.. ఇప్పుడు భ‌యం రెట్టింప‌య్యింది.. త‌మ‌లోనే ఉన్న మ‌హిషాసుర‌మ‌ర్దినిని చూస్తూ భీతిల్లిపోతున్నారు అంద‌రూ దుర్గ‌మ్మ‌ను చూసి. "న‌న్ను చూసి భ‌య‌ప‌డ‌కండి. దుష్ట సంహారం చేసే శ‌క్తి ఏ విధంగా వ‌చ్చిందో ఇంత‌కుముందే దుర్గ‌మ్మ విపులీక‌రించింది క‌దా. నేనూ అదే మాట చెప్తాను.."  అంటూ అతి విన‌యంగా ప‌లికింది, అంత‌టి మ‌హిషుడిని సంహ‌రించిన త‌ల్లి. అంద‌రూ త‌మ భయాన్ని విడిచిపెట్టి... "నిజ‌మే.. నీ గొప్ప‌ద‌నాన్ని చూసే క‌దా ఆది శంక‌రాచార్యుడు నీ మీద అద్భుత‌మైన స్తోత్రం ర‌చించాడు. అయిగిరి నందిని నందిత మేదిని... అంటూ... ఆ స్తోత్రం చ‌దువుతుంటే చాలు అంద‌రిలోనూ త‌న్మ‌య‌త్వం కలుగుతుంది. ఆదిశంక‌రుడికి క‌లిగిన త‌న్మ‌య‌మే ఈ స్తోత్ర రూపంలో అప్ర‌య‌త్నంగా వెలువ‌డి ఉంటుంది " అన్నారు అంద‌రూ.   

ఇప్పుడు చివ‌ర‌గా అంద‌రి చూపులు ఆ రాజ‌రాజేశ్వ‌రి మీద‌కు మ‌ళ్లాయి.. "ఇన్ని రోజులుగా మ‌మ్మ‌ల్ని అంద‌రూ ఒక్కోరోజు ఒక్కో ర‌కంగా పూజించారు. చిట్ట‌చివ‌ర‌గా అంద‌రూ నిన్ను శ్రీ‌రాజ‌రాజేశ్వ‌రిగా కొలుస్తారు. ఈ రోజును విజ‌య‌ద‌శ‌మిగా కూడా పిలుస్తారు" అంటూ ప్ర‌శ్నార్థ‌కంగా అంటుంటే.." తొమ్మిది రోజుల పాటు నెమ్మ‌దిగా శ‌క్తి స‌మ‌కూర్చుకుంటూ ఎదిగాక‌.. ఇక చివ‌ర‌గా విజ‌యం ల‌భించిన‌ట్లే క‌దా. ఈ విజ‌య‌ద‌శ‌మి నా ఒక్క‌దానిదే కాదు క‌దా. తొమ్మిదిరోజుల పాటు విజ‌య‌వంతంగా స‌క‌ల శుభాలు స‌మ‌కూర్చినందుకే ప్ర‌తీక‌గానే క‌దా నేను రాజ‌రాజేశ్వ‌రిని అవుతున్నాను. విజ‌య‌ద‌శ‌మి పండుగ‌కు దేవ‌త‌న‌వుతున్నాను.మ‌న‌మంద‌రం అరిష‌డ్వ‌ర్గాల‌కు అతీతంగా ఉన్నాం. ఐక‌మ‌త్యంగా ఉన్నాం. విజ‌యం సాధించాం. భిన్న‌త్వంలో ఏక‌త్వం అంటే మ‌న‌మే క‌దా. అందుకే విజ‌య‌ద‌శ‌మి అనే పేరు వ‌చ్చింది క‌దా. మ‌న మంచిత‌న‌మే విజ‌యానికి కార‌ణం అని మాన‌వుల‌కు తెలియ‌చేయ‌డానికే క‌దా ఈ పండుగ‌ను వారికి ప్ర‌సాదించాం... " అంది రాజ‌రాజేశ్వరి.  

దూరం నుంచి ఈ త‌ల్లుల అమ‌ర సంభాష‌ణ‌ను గ‌మ‌నిస్తున్న వారి మ‌న‌సులు భ‌క్తితో నిండిపోయాయి. గుండెలు ఆర్ద్రమ‌య్యాయి. ఓహో ఇందుకేనా ఒక బిడ్డను న‌వ‌మాసాలు గ‌ర్భంలో మోసి, ఆ త‌ర‌వాత ప్రస‌వించేది అనుకున్నారు. ఈ న‌వ‌రాత్రుల అంత‌రార్థం ఇదా అనుకున్నారు. అందులోనే ఒక పండితుడు మ‌రో విష‌యం వివ‌రించాడు.. "గ్రామ ప్రజ‌లారా... ఒక్క విష‌యం అర్థం చేసుకోండి... ఈ సృష్టికి కార‌ణం ప్ర‌కృతి పురుషుడు అని అంద‌రికీ తెలుసు. వారు తొమ్మిది మంది ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మనిచ్చారు. ఆ ఆడ‌పిల్ల‌ల పేరు మీదే వేల సంవ‌త్సరాలుగా న‌వ‌రాత్రులు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం. మ‌నం కూడా ఆడ‌పిల్ల‌ను గౌర‌వంగా పెంచుదాం. వారికి మ‌న గుండెల్లో గుడి క‌డ‌దాం. ఆడ‌పిల్ల‌ను చుల‌కన చేయ‌కూడ‌ద‌ని మ‌నకి తెలుస్తోంది క‌దా. బాలగా మన ఇంట అడుగుపెట్టిన ఆడపిల్ల, మనకు చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిగా ఆదరిస్తూ, మరో ఇంటికి వెళ్లి అందరినీ కనిపెట్టుకొని ఉండి, తాను తల్లిగా మారి జనని అవుతోంది.  ఈ తొమ్మిది మంది జగన్మాతలు వేరు వేరు రూపాలతో, వేరు వేరు నామాలతో మనని ఆదరిస్తున్నారు.  ఏ పేరుతో పిలిచినా తల్లి తల్లే అని గ్రహించండి. అమ్మా...అని పిలిస్తే పలికే చల్లని తల్లి ఆ జగన్మాత.  అమ్మని పూజిద్దాం, ఆడపిల్లను అమ్మగా ఆదరిద్దాం" అంటూ ఆవేశంగా త‌న మాట‌లు ముగిస్తూ అంద‌రికీ న‌మ‌స్క‌రించాడు. అంద‌రూ ఆ పెద్దాయన మాట‌ల‌లోని అంత‌రార్థాన్ని ఆలోచించ‌టం ప్రారంభించారు. - వైజ‌యంతి పురాణ‌పండ‌(సృజ‌న ర‌చ‌న‌)
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top