
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు చాలా మండలాల్లో దసరా తర్వాత మహిళలు సద్దుల బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఓ వైపు భైంసాలో మహాలయ అమావాస్య మరుసటి రోజు సద్దుల బతుకమ్మ ఆడడం ప్రత్యేకత కాగా.. నిర్మల్ ప్రాంతంలో పండుగ తర్వాత సద్దుల సందడి కొనసాగుతూ ఉండడం ఇక్కడి స్పెషల్. పూలను పూ జించే ఈ పండుగలో ఇక్కడ కాగితంతో బతుకమ్మలను చేయడం మరో ప్రత్యేకత. దసరా సెలవులు పూర్తవుతున్నా.. చాలామంది యువతులు, విద్యార్థినులు సద్దుల బతుకమ్మ కోసం ఆగడం విశేషం.
పౌర్ణమి దాకా ఆటపాటలే...
తెలంగాణ వ్యాప్తంగా దసరాకు ముందే బతుకమ్మ పండుగ ముగుస్తుంది. కానీ.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లా మాత్రం ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంటోంది. ఒక్కో గ్రామంలో ఒక్కోరోజు పండుగలా సద్దులబతుకమ్మను తీసుకెళ్తుంటారు. నిర్మల్ ప్రాంతంలో దసరా తర్వాత మొదలయ్యే సద్దుల బతుకమ్మల సందడి ఒక్కో ఊళ్లో ఒక్కోరోజు ఉంటుంది. ఈ రోజు(శనివారం) నుంచి ఇలా పౌర్ణమి వరకు రోజూ బతుకమ్మల ఆటపాటలు సాగుతూనే ఉంటాయి. ప్రతీసాయంత్రం గ్రామాలతో పాటు జిల్లాకేంద్రంలోనూ పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది.
కాగితంతో బతుకమ్మ..
జిల్లాలో బతుకమ్మకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రంగురంగుల కాగితాలతో బతుకమ్మలను తయారు చేస్తారు. పూలను పూజించే ప్రకృతి పండుగలతో ఇలా కాగితాలతో బతుకమ్మలను చేసి ఆడడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. గతంలో కరువు పరిస్థితులు ఉన్నప్పుడు నిమజ్జనానికి నీళ్లు లేకపోవడం, అలాగే పువ్వులు లభించకపోవడం తదితర కారణాలతో కాగితపు బతుకమ్మలతో ఆడడం ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.
మనదిక్కు పండుగైనంకనే..
‘ఓ.. నా చిన్నప్పటి సంది సూస్తున్న. కరీంనగర్, వరంగల్ దిక్కు దసరా పండుక్కు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతరు. మనక్కడ మాత్రం పండుగైనంకనే ఆడుతం. ముందటి సంది బొడ్డెమ్మ పండుగ అట్లనే అస్తున్నది..’ అని నిర్మల్‌కు చెందిన 80ఏళ్ల రాం ముత్తమ్మ చెబుతోంది.
మానాయి ఉన్నందునే...
కరీంనగర్, వరంగల్ వైపు దసరాకు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతారు. కానీ.. మాదిక్కు మానాయి(మహర్నవమి) పెద్దపండుగగా చేసుకుంటాం. ఆ రోజు ఇంట్లో నుంచి పసుపుకుంకుమలు, మంగళహారతి సహా ఏ వస్తువునూ బయటకు తీసుకెళ్లం. అందుకే సద్దుల బతుకమ్మను దసరా తర్వాతనే చేసుకుంటాం.
–ఏనుగుల విమల, నిర్మల్
బతుకమ్మ కోసమే...
దసరా పండుగంటే చాలా ఇష్టం. అందులోనూ బతుకమ్మ అంటే ఇంకా ఇష్టం. రోజూ అమ్మవాళ్లతో కలిసి పాడుతూ ఆడుతూ నేర్చుకుంటాం. ఇక దసరా తర్వాత సద్దుల బతుకమ్మ కోసమే హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్‌లోనే ఉంటా.
– అనన్య, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, నిర్మల్