
‘హెల్త్’మేట్స్
డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ మాటల్లోనే...
అదో అందమైన చలికాలపు ఉదయపు వేళ. కానీ ఆ ఆహ్లాదకరమైన ప్రాంతఃకాలం... శేఖర్ పాలిట రాబోయే రాత్రికి కాబోయే కాళరాత్రికి నాందీ సమయం. కారణం... ఆరోజు శేఖర్ చేసిన రెండు తప్పులు.
మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడమైతే... రెండోది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఏమాత్రం స్లో చేయకపోవడం. దాంతో బండి మీది నుంచి పడి తలకు గాయంతో ఐసీయూలో బెడ్‌పై అచేతనంగా పడి ఉన్నాడు.
శేఖర్ గురించి అతడి అన్న శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. బహుశా శ్రీధర్‌కు 35 ఏళ్లూ, అతడి తమ్ముడు శేఖర్‌కు 30 ఏళ్లు ఉంటాయేమో. ప్రతిరోజూ కళ్ల నిండా నీళ్లతో, జోడించిన చేతులతో నా దగ్గరికి వచ్చి తమ్ముడి పరిస్థితి వాకబు చేస్తూ ఉండేవాడు. ‘‘ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. నా తమ్ముడు బాగైతే చాలు’’ అనేవాడు. అంతటి దయ, గుండెనిండా ఆర్ద్రత ఉన్న ఆ అన్నను చూస్తే ఓ పక్క ఆనందం... మరో పక్క అతడి పరిస్థితికి బాధా ఉండేవి. ‘‘మీవాడుగానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ ఉండేవాణ్ణి.
ఒకరోజు పొద్దున్నే నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పక్క సందులోంచి ఒక వ్యక్తి తన బైక్‌ను చాలా రాష్‌గా డ్రైవ్ చేస్తూ ప్రధాన రోడ్డు మీదికి వస్తున్నాడు. ఎక్కడా స్లో చేయడమన్న మాటే లేదు. మెయిన్ రోడ్డులో వస్తున్న నేను వెంటనే నా కార్‌ను స్లో చేస్తూ... అతడు నన్ను గుద్దుకోకుండా నా కార్‌ను చాలా పక్కకు తీశా. ఒకవేళ నేనలా చేయకపోతే నన్నతడు తప్పక ఢీకొని ఉండేవాడు. తీరా చూస్తే అతడి బైక్ హ్యాండిల్ మీద హెల్మెట్ కూడా ఉంది. పరిశీలనగా చూస్తే అతడు మరెవరో కాదు... మా హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుకుని ఉన్న పేషెంట్ వాళ్ల అన్నే. కాస్తయితే ‘‘అదే బెడ్ పక్కన ఇతడూ తమ్ముడికి కంపెనీ ఇస్తూ పడుకునేవాడు కదా’’ అనిపించింది. మరో మాట అనిపించింది. తన సొంత తమ్ముడు చేసిన రెండు తప్పుల నుంచి ఏమీ గ్రహించకుండా శేఖర్ వాళ్ల అన్న శ్రీధర్ చేసింది మూడో తప్పు.
అలాంటి యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి తాలూకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న మర్నాడే ఈ ఘటన జరగడంతో నాకీ విషయం స్ఫురణకు వచ్చింది. నన్ను మనసులో తొలిచేస్తున్న విషయమేమిటో తెలుసా... ‘‘ఇన్ని సంఘటనలు జరిగాక... జరుగుతున్న సంఘటనలను చూశాక... తమ ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్న తర్వాత కూడా వీళ్లు మారరా’’ అంటూ బాధేసింది. నా అనుభవంలో చూసిన ఘటనలూ, ఆ టైమ్‌లో వచ్చే ఆలోచనలే నన్ను ఈ నాలుగు మాటలు రాసేలా పురిగొల్పాయి.
డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ సీనియర్ కన్సల్టెంట్
న్యూరో – స్పైన్ సర్జన్,ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్
-యాసిన్