అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే...

Mysterious Monolith Metal In Utah Desert At USA - Sakshi

అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్‌లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే...
ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్‌ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే  ఫేస్‌బుక్‌ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్‌ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే!

స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి!
శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్‌ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్‌ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్‌లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ షెన్‌ యాజింగ్‌ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది.

గమనాన్నీ నియంత్రించొచ్చు..
అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్‌ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్‌పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్‌ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్‌ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్‌ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్‌ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్‌ను కూడా ఈ కోటింగ్‌ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top