సూపర్‌ మష్రూమ్స్‌.. అద్భుతః!

Mushroom Farming Special Story In Sakshi Sagubadi

సన్నటి పోగుల్లాంటి పుట్టగొడుగులు..కార్డిసెప్స్‌ మిలిటారిస్‌

అద్భుత పోషకాలతోపాటు ఔషధ గుణాలకు నిలయం

వ్యాధుల నివారణ, రోగనిరోధక శక్తి  పెంపుదలలో కీలకపాత్ర

60–70 రోజుల్లో పంట చేతికి.. చిన్నబాక్సుల్లో ప్రయోగశాలల్లో పెంచవచ్చు 

ఎండబెట్టిన సూపర్‌ మష్రూమ్స్‌ కిలో టోకు ధర రూ. లక్ష పైమాటే 

అసోంలోని బోడో విశ్వవిద్యాలయంలో విస్తృత పరిశోధనలు

రైతులు, పారిశ్రామికవేత్తలకు శిక్షణ 

పుట్టగొడుగులు పోషకాల గనులని మనకు తెలిసిందే. పుట్టగొడుగుల్లో వందలాది రకాలు ఉన్నా కొన్ని మాత్రమే తినదగినవి. ఆయిస్టర్, బటన్, మిల్కీ మష్రూమ్స్‌ రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. అయితే, కొన్ని అరుదైన రకాల పుట్టగొడుగుల్లో విశిష్ట పోషక విలువలతో పాటు అత్యద్భుతమైన ఔషధ విలువలు కూడా ఉంటాయి. అటువంటివే ‘కార్డిసెప్స్‌ మిలిటారిస్‌’ రకానికి చెందిన పుట్టగొడుగులు. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగుల మాదిరిగా ఉంటాయి. సాధారణ పుట్టగొడుగుల మాదిరిగా షెడ్లలో కాకుండా.. నియంత్రిత వాతావరణంలో అతిశీతల ప్రయోగశాలల్లోనే వీటిని సాగు చేయాల్సి ఉంటుంది. విశిష్టమైన పోషక, ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల వీటిని ‘సూపర్‌ మష్రూమ్స్‌’ అని పిలుస్తున్నారు. 

కార్డిసెప్స్‌తో కనక వర్షం
దేశ, విదేశీ మార్కెట్లలో వీటి ధర కూడా ఎక్కువే. కార్డిసెప్స్‌ రకానికి చెందిన ఎండబెట్టిన పుట్టగొడుగుల కిలో (టోకు) ధర రూ. లక్షకు మాటే. రైతులు వీటì  సాగుపై సాంకేతిక శిక్షణ తీసుకొని సాగు చేయడంతోపాటు ఉత్పత్తులుగా మార్చి అమ్ముకుంటే లక్షలు కళ్ల జూడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కార్డిసెప్స్‌ రకం పుట్టగొడుగులతో పొడులు, క్యాప్సుల్స్‌ వంటి ఉత్పత్తులను తయారు చేసి రిటైల్‌గా మార్కెట్‌ చేసుకోగలిగితే కిలోకు రూ. 3–5 లక్షల వరకు ఆదాయం పొందడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని డాక్టర్‌ సందీప్‌ దాస్‌ ‘సాక్షి’తో చెప్పారు.

అసోంలోని బోడో విశ్వవిద్యాలయంలో ఆయన గత 8 ఏళ్లుగా వివిధ రకాల పుట్టగొడుగులపైనే పరిశోధనలు చేస్తున్నారు. ఔషధ గుణాలున్న అద్భుత ఆహారంగా అనేక దేశాలు గుర్తించినప్పటికీ పుట్టగొడుగులపై మన దేశంలో పరిశోధనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని డా. సందీప్‌ దాస్‌ అన్నారు. చైనా, వియత్నాం, తైవాన్, కొరియా తదితర దేశాలు పూర్వకాలం నుంచే పుట్టగొడుగులపై ప్రత్యేక దృష్టి ఉంది. వ్యాధుల నివారణ, చికిత్సలలో కార్డిసెప్స్‌ రకం పుట్టగొడుగుల వాడకంపై కూడా గత 40 ఏళ్లుగా ఆయా దేశాలు శ్రద్ధ చూపుతున్నాయన్నారు. 

పరిశోధనలకు ప్రభుత్వ ప్రోత్సాహం
డా. సందీప్‌ దాస్‌ బోడో విశ్వవిద్యాలయంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం డీన్‌గా ఉన్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు యువ పరిశోధకులు అనేక రకాల పుట్టగొడుగులపై లోతైన పరిశోధనలు చేస్తూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. 
ఆయిస్టర్‌ పుట్టగొడుగుల పెంపకంతోపాటు వాటిని కూరగా వండుకోవటం మాత్రమే కాకుండా..  బిస్కెట్లు, రసగుల్లాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేసి విక్రయించుకోవటం.. పుట్టగొడుగుల విత్తనం ఉత్పత్తిలో కూడా స్థానిక రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు.

కార్డిసెప్స్‌లో విశిష్ట ఔషధ గుణాలు
కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంటు రూ. 6 కోట్లను అందుకున్న డా. సందీప్‌ బృందం కార్డిసెప్స్‌ మిలిటారిస్‌ రకం పుట్టగొడుగుల సాగుపై పరిశోధన చేసి విశేష ప్రగతిని సాధించింది. చనిపోయిన గొంగళిపురుగులు, ఇతరత్రా పురుగుల కళేబరాలపై ఈ పుట్టగొడుగులు పోగుల మాదిరిగా పెరుగుతూ ఉండటాన్ని డా. సందీప్‌ బృందం అడవుల్లో సంచరించే సమయంలో గుర్తించింది. వీటికి మార్కెట్‌లో గిరాకీ ఉండటం మూలాన ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిపోయాయి.

వీటిని ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో సాగు చేయడంపై డా. సందీప్‌ దృష్టి కేంద్రీకరించి విజయం సాధించారు. ముడి వరి బియ్యంపై ప్రయోగశాలల్లో చిన్న, చిన్న బాక్సుల్లో సాగు చేయవచ్చని గుర్తించారు. అంతేకాదు, ప్రత్యేక యంత్రం ద్వారా అతి శీతల వాతావరణం (–86 డిగ్రీల ఉష్ణోగ్రత)లో వీటిని ఎండబెట్టడం ద్వారా వాటిలోని పోషక, విశిష్ట ఔషధ గుణాలకు నష్టం వాటిల్లకుండా ఉండే పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా పెంచిన కార్డిసెప్స్‌ పుట్టగొడుగుల పొడితో క్యాప్సుల్స్‌ను తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. 

150–200 ఎం.జి కాప్సుల్‌ను నేరుగా గాని, నీటిలో కలిపి గానీ ఉదయం అల్పాహారం తర్వాత తీసుకోవాలన్నారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడించడమే కాకుండా ఎన్నో జబ్బుల నివారణ సాధ్యమవుతోందని అధ్యయనం ద్వారా గుర్తించినట్లు డా. దాస్‌ తెలిపారు.  
వైరస్, బాక్టీరియా జబ్బులను తట్టుకునే శక్తి ఉంది. కేన్సర్, మధుమేహం, బీపీ, వాపు(ఇన్‌ఫ్లమేషన్‌), కణుతులు రాకుండా అడ్డుకునే గుణం ఉంది. కుంగుబాటును నిరోధించడంతోపాటు వత్తిడిని పారదోలే గుణం ఉంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉందని.. ఇంకా ఎన్నో ఔషధ గుణాలు కార్డిసెప్స్‌ మిలిటారిస్‌ పుట్టగొడుగుల్లో నిక్షిప్తమై ఉన్నట్లు అధ్యయనాల్లో నిరూపితమైందని డా. సందీప్‌ దాస్‌ తెలిపారు. 

60–70 రోజుల పంట
కార్డిసెప్స్‌ మిలిటారిస్‌ పుట్టగొడుగులను పెంచాలనుకునే వారికి తాము అస్సాం కోక్రఝర్‌లోని తమ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తామని డా. సందీప్‌ తెలిపారు. 60–70 రోజుల్లో పుట్టగొడుగుల పంట చేతికి వస్తుంది. ఫుడ్‌గ్రేడ్‌ ప్లాస్టిక్‌ బాక్సుల్లో ముడి వరి బియ్యంపై ఈ పుట్టగొడుగుల విత్తనంతో కూడిన పోషక ద్రవాన్ని చిలకరించి ప్రయోగశాలలో శీతల వాతావరణంలో ఉంచుతారు. ఒక పూట కృత్రిమ వెలుగు, ఒక పూట చీకటిలో ఉంచుతారు. కొద్ది రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తి వేలెడంత పొడవున పోగుల మాదిరిగా ఎదుగుతాయి. వాటిని కత్తిరించి ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. 

రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం
కార్డిసెప్స్‌ పుట్టగొడుగుల పెంపకంలో, వివిధ ఉత్పత్తుల తయారీలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధమని డా. సందీప్‌ దాస్‌ తెలిపారు. నేర్చుకునే వారి సామర్ధ్యాన్ని బట్టి కనిష్టంగా 2 రెండు రోజులు, గరిష్టంగా 2 నెలల వరకు శిక్షణ అవసరం ఉంటుందన్నారు. వీటి పెంపకానికి చిన్నపాటి ప్రయోగశాల ఏర్పాటుకు 600 చదరపు గజాల గదితోపాటు 300–400 చ.అ.ల విస్తీర్ణం గల మరో 3 గదులు అవసరం అవుతాయన్నారు. రూ. 20 లక్షల వరకు మౌలిక సదుపాయాలపై వెచ్చించాల్సి ఉంటుంది. రూ.5 – 10 లక్షల రివాల్వింగ్‌ ఫండ్‌ అవసరం ఉంటుంది. ఈ యూనిట్‌లో ఏడాదికి 140 ఎండబెట్టిన కార్డిసెప్స్‌ పుట్టగొడుగులను ఉత్పత్తి చేయవచ్చన్నారు. 

ఈ పుట్టగొడుగులలో కార్డిసెప్‌ మూలకం సాంద్రత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, దీన్ని బట్టి ధర లభిస్తుందన్నారు. గ్రాము పుట్టగొడుగుల్లో 10 ఎం.జి. కన్నా ఎక్కువ కార్డిసెప్‌ ఉంటే మంచి ధర వస్తుందన్నారు. ఎండు పుట్టగొడుగులు కిలోకు టోకున రూ. లక్ష వరకు రావచ్చు. క్యాప్సుల్స్, కార్డి వాటర్, కార్డి టీ తదితర ఉత్పత్తులుగా మార్చి అమ్మితే రూ. 3–5 లక్షల వరకు ఆదాయం రావడానికి ఆస్కారం ఉందని డా. సందీప్‌ దాస్‌ తెలిపారు. శిక్షణ పొందాలనుకునే వారు బోడో యూనివర్సిటీలోని పుట్టగొడుగుల విభాగం హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. మొబైల్‌ : 91019 52358 ఈమెయిల్‌ : bu.bthub@dbt.nic.in

రెండున్నరేళ్లుగా సాగు చేస్తున్నా..!
సికింద్రాబాద్‌ ఆల్వాల్‌కు చెందిన అటిక్‌ పటేల్‌ అనే యువ ఇంజినీర్‌ రెండున్నరేళ్ల క్రితం నుంచి కార్డిసెప్స్‌ మిలిటారిస్‌ రకం సూపర్‌ మష్రూమ్స్‌ను సాగు చేస్తున్నారు. 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. కోట్ల పెట్టుబడి పెట్టి ‘క్లోన్‌ డీల్స్‌’ ప్రయోగశాలను నెలకొల్పారు. వియత్నాం, కొరియా, చైనా తదితర దేశాల్లో 30 ఏళ్ల నుంచే కార్డిసెప్స్‌ పుట్టగొడుగుల సాగు చేపట్టారని, తాను ఈ దేశాల్లో స్వయంగా పర్యటించి అధ్యయనం చేసి అవగాహన పెంచుకున్నానని అన్నారు.

ఈ ఉత్పత్తులను అమ్మేందుకు అక్కడ ప్రత్యేక దుకాణాలు ఉండటం విశేషమని అటిక్‌ పటేల్‌ ‘సాక్షి’తో చెప్పారు. మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఉత్పత్తులను తాము తయారు చేశామని, అన్ని అనుమతుల తర్వాత త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నామన్నారు. సూపర్‌ మష్రూమ్స్‌ సాగు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద లాబ్‌ను నెలకొల్పటం, సొంత పరిశోధనల అనంతరం విలక్షణ ఉత్పత్తులను తయారు చేయటం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నదని అటిక్‌ పటేల్‌ (86907 07076) సంతోషంగా చెప్పారు.

‘చిన్న’ ఆవిష్కరణల వ్యాప్తిపై గ్రామీణ మహిళలకు శిక్షణ
చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఏడు రకాల యంత్ర పరికరాలు, ఆవిష్కరణలను వెలువరిస్తున్న సంస్థ ‘రుకార్ట్‌’. యువ ఐఐటీ ఇంజినీర్లు నెలకొల్పిన స్టార్టప్‌ సంస్థ ఇది. ఈ సంస్థ తయారు చేసిన యంత్రాలు, ఇతర పరికరాలను చిన్న, సన్నకారు రైతులకు అందించే క్రమంలో గ్రామీణ మహిళలకే శిక్షణ ఇవ్వదలచింది. విద్యుత్తు అవసరం లేని కూరగాయల (సబ్జీ) కూలర్‌ (వివరాలు 2020 ఆగస్టు 4న ‘సాక్షి సాగుబడి’ లో ప్రచురితం), విద్యుత్తు లేకుండా బావిలోని నీటిని తోడే ట్రెడల్‌ పంపు, అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడే యంత్రాలు, వినూత్నమైన డ్రిప్‌తో కూడిన మల్చింగ్‌ షీట్, నీటికుంటల్లో వాడటానికి ఉపయోగపడే జల్‌కుండ్‌ షీట్, 5 నుంచి 20 కిలోల వరకు సామర్థ్యం కలిగిన సోలార్‌ డ్రయ్యర్లు.. ఇవీ రుకార్ట్‌ చిన్న రైతుల కోసం తయారు చేసి అందుబాటులోకి తెస్తున్న ఉత్పత్తులు.

వీటిని తమ గ్రామంలో రైతులకు చేర్చే క్రమంలో అందుకు తోడ్పడే మహిళలకు వాటి ఖరీదులో కొంత శాతం మొత్తాన్ని అందిస్తామని వికిస్‌ ఝా చెప్పారు. ఆసక్తి గల గ్రామీణ మహిళలకు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇస్తామన్నారు. చిన్న సన్నకారు రైతులకు ఈ యంత్ర పరికరాలను విక్రయించడం లేదా అద్దెకు ఇచ్చుకోవటం ద్వారా  మహిళలకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేస్తామని ‘రుకార్ట్‌’ వ్యవస్థాపకులు వికాస్‌ ఝా (88790 49787) తెలిపారు. వివరాలకు.. namaste@rukart.org 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top