నోటి దురుసుతో అనర్ధాలు

Muhammed Usman Khan Article In Sakshi Sannidhi

ఇస్లాం వెలుగు

నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. 

మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు అనంతం. వాటిని లెక్కించడం గాని, ఊహించడం గాని, వర్ణించడం గాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో ‘నోరు’ కూడా ఒకటి. కేవలం తినడానికి, తాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, సంవాదానికి, మానవుల మధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే  అమృతపు జల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తేమాత్రం విద్వేషం చిలకరిస్తుంది. సమాజంలో అగ్గి రాజేస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. దైవం దృష్టిలో నోటిదురుసు, దుర్భాష, అశ్లీలం  తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇతరుల మనోభావాలు గాయపరిచేవారిని, అశ్లీలపు మాటలు పలికే వారిని, దుర్భాషలాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కొంతమంది పైకి ఎంతో చదువుకున్నవారిలా, ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలా విన్నవించుకున్నాడు. ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్‌ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్‌ ఉపవాసాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె  గొప్పదాతగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.’ అని  నివేదించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది.’ అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి ‘‘దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్‌ నమాజులు ఫర్జ్‌ రోజాలు (అంటే, విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్‌ నమాజులు నఫిల్‌ రోజాలు (ఐఛ్ఛికం) పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్నుముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తుమాట అనదు. వారి మనసు నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు’ అని విన్నవించు కున్నాడు.
ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె స్వర్గవాసి’ అని సెలవిచ్చారు. కనుక నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతి మాటకూ, పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మనందరికీ ఆచితూచి మంచి మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top