నెమళ్లు పురివిప్పి నాట్యమాడితే కనులపండుగగా ఉంటుంది. ఆరుబయట నెమళ్లు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వందకు పైగా నెమళ్లు ఒక ఊళ్లోకి చేరి, యథేచ్ఛగా వీథుల్లో తిరుగుతూ, ఇళ్లలోకి చొరబడుతూ, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఉంటే మాత్రం ఊరి జనాలకు బెడదగానే ఉంటుంది. ఇటలీలోని పుంటా మెరీనా అనే చిన్న పట్టణలలో జనాలకు నెమళ్లతో చెప్పరాని తంటాగా ఉంటోంది.
సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉండే ఈ ఊళ్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో ఏకంగా వందకు పైగా నెమళ్లు వచ్చిపడ్డాయి. ‘కోవిడ్’ కాలంలో చుట్టుపక్కల అడవి నుంచి ఊళ్లోకి దాదాపు వందకు పైగా నెమళ్లు వచ్చాయి. కొత్తలో జనాలకు బాగానే ఉండేది. ఇప్పుడు వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
ఇవి యథేచ్ఛగా రోడ్ల మీద సంచరిస్తుంటే, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఇళ్లల్లోకి కూడా చొరబడుతున్నాయి. పిట్టగోడలు ఎక్కి, ఇళ్లల్లో రెట్టలు వేయడం, ఇళ్లలోకి దూరి తిండి కోసం గిన్నెలు తిరగవేయడం వంటి చేష్టలు కూడా చేస్తుండటంతో జనాలు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వీటిని సురక్షితమైన చోటుకు తరలించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు.


