Children's Day 2021 Special: నక్క సాయెబు – నక్క బీబీ.. కథ!

Mohammed Khadeer Babu Puppujaan Telugu Katha In Funday Magazine - Sakshi

ఒక నక్క సాయెబుగారూ నక్క బీబీ అడవిలో కాపురం చేసుకుంటూ వున్నారు. 
నక్క సాయెబుగారికి ఏ పనీ రాకపోయినా జాతిబుద్ధి సోకి వాళ్లను ముంచి, వీళ్లని ముంచి మొత్తం మీద బీబీగారు ఏమడిగితే అది తెచ్చిపెడుతూ, ఆమె కళ్లలో కాటుక తడవకుండా చూసుకుంటూ వస్తున్నారు. 

బీబీగారు చిన్నమనిషి కాదు. నా మొగుడు సిపాయి, నా మొగుడు పైల్వాను అనుకుంటూ వుండేవారు. 
సరే వాళ్లున్న యింటి మీదుగా రోజూ ఒక ఏనుగు దాని మానాన అది కాలువకు స్నానానికి పోతూ వుండేది. స్నానానికి పోతూ వుంటే అప్పుడే స్నానానికి సిద్ధమవుతున్న నక్కబీబీగారు దాన్ని చూశారు. ఆ టైములో నక్కబీబీగారి ఒంటి మీద నూలుపోగు లేదు. అందువల్ల ఆవిడ సిగ్గుతో చచ్చిపోయి, గబగబా చీర చుట్టుకొని యింట్లోకి పరుగు తీశారు. ఆ తర్వాత, అలిగి మంచంమీద పడుకున్నారు. 
నక్కసాయెబుగారు కంగారుపడిపోయారు. 

‘బీబీగారూ. ఏం జరిగింది? చెప్పంyì . చెప్పండి?’ అని సముదాయించారు. 
‘చూడండి. నాకూ మానం మర్యాదా గోషా పరదా వున్నాయి. పొద్దున లేస్తే మీ పని మీద మీరు వెళ్లిపోతారు. యింట్లో నేనొక్కదాన్నే వుండాలి. ఎవరైనా కన్నేసి ఏదైనా చేస్తే నేనేం కావాలి? యివాళ నీళ్లు పోసుకుంటూ ఉంటే ఏనుగు చూసింది. యిప్పుడు యీ పని చేస్తుంటే చూసింది రేపు ఒంటికి పోతా వుంటే రెండుకు పోతా వుంటే చూస్తుంది. అది రోజూ ఈ దోవన పోతుంటే నాకు చచ్చేంత సిగ్గుగా వుంటోంది. మీరు నా మానం మర్యాదలు కాపాడేవాళ్లయితే దాన్ని చంపి దాని రక్తంతో మన యింటి ముందు కళ్లాపి చల్లండి’ అంది నక్క బీబీ. 

బీబీగారు అంత మాట అన్నాక నక్కసాయెబుగారు వెనక్కి తగ్గితే ఏం బాగుంటుంది? 
‘నీ కోరిక నెరవేరుస్తా బీబీ’ అని చెప్పి మాట యిచ్చి అడవికి వెళ్లారు. 
వెళ్లి ఎక్కడెక్కడి నుంచో నారను సేకరించారు. తాడు పేనారు. పేని ఏనుగు వచ్చే దారిలో అక్కడొక ఉచ్చు, ఇక్కడొక ఉచ్చు అమర్చుకుంటూ వచ్చి తాడు కొసను తన నడుముకు కట్టుకున్నారు. ఏనుగుని ఉచ్చులో బంధించి ఆ తర్వాత చంపాలని ఆయన పథకం.
ఎప్పటిలాగే ఏనుగు స్నానానికి బయలుదేరింది. దారిలో వస్తూ వస్తూ నక్క సాయెబుగారి ఉచ్చులో కాలు పెట్టింది. ఆ ఉచ్చు దానికో లెక్కా? చీమతో సమానం. అందుకని తాడును లాక్కుంటూనే అది తన దారిన తాను పోతూ వుంది. తాడు చివరను సాయెబుగారు నడుముకు కట్టుకున్నారు గదా. అందువల్ల ఆయన్ను కూడా లాక్కుపోతూ వుంది ఏనుగు. 

ఇది సాయెబుగారు ఊహించలేదు. తాడు చివరను నడుముకు కట్టుకుంటే చాలదా, నా బలానికి ఏనుగు ఆగిపోదా అనుకున్నాడు ఆయన. యిప్పుడు కథ తిరగబడేసరికి బిత్తరపోయి ‘ఓలమ్మో ఓరి నాయనో’ అని గోల మొదలుపెట్టారు. ఆ ఆరుపులకీ కేకలకీ ధర్మపత్ని అయిన నక్కబీబీగారు యింట్లో నుంచి బయటికొచ్చి చూశారు. 
సాయెబుగారిని ముళ్లల్లో పొదల్లో రాళ్లల్లో రప్పల్లో లాక్కుని పోతూ వుంది ఏనుగు. తమాషా ఏమిరా అంటే అసలా ఏనుగుకి ఆ దోవలో ఒక నక్కబీబీగారు ఒక నక్కసాయెబుగారు కాపురం వుంటున్నారని గానీ, నక్కబీబీగారు తనని చూసి సిగ్గుపడుతున్నారనిగానీ, తనని చంపడానికి వాళ్లు పథకం వేశారనిగానీ, ఉచ్చు పన్నారనిగానీ ఏమీ తెలియదు. మహారాజులకి అల్పసంగతులు పడతాయా? పట్టవు. అందుకే అది పోతూ పోతూ వుంటే వెనుక కుయ్యోమొర్రో అంటున్నారు సాయెబుగారు. ఆయన వెంట బీబీగారు లబోదిబోమంటున్నారు. 

‘ఓరయ్యో నా మానం పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా మర్యాద పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా గోషా పోతేపోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా సిగ్గు పోతే పోయింది మీరు దక్కితే చాలు’అని శోకండాలు తీస్తున్నారు బీబీగారు. 
ఎన్ని శోకండాలు తీసినా నక్కసాయెబుగారు వెనక్కి వస్తారా? ఏనుగుతోపాటు కాలువలో మూడు మునకలు మునిగి చావుతప్పి కన్ను లొట్టపోయి ఎట్టో బతికి బయటపడి చెంపలు వేసుకున్నారు పాపం. 

- మహమ్మద్‌ ఖదీర్‌బాబు (పుప్పుజాన్‌ కతలు నుంచి)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top