
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, వ్యాపారవేత్త సుధారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా’లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 108 దేశాలకు చెందిన అందాల తారలు సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని విలాసవంతమైన నివాసం ’మోన్ అమూర్ ప్యాలెస్’లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ’మిడ్‌నైట్ పరŠల్స్’ థీమ్‌తో తెలంగాణ సంస్కృతి, అతిథి సత్కారం, మానవతా సేవలకు నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఇచ్చిన విందులో భారతీయ వంటకాలతో పాటు ఏషియన్, ఇటాలియన్, అంతర్జాతీయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెండర్ కోకోనట్ కార్పాచ్చియో, పనీర్ మిల్లే–ఫ్యూల్, సాఫ్రన్ ఖిచడి వంటి ఆధునిక భారతీయ వంటకాలు, ఉడాన్ నూడుల్స్‌తో కూడిన ట్రఫిల్ సోస్, లాబ్‌స్టర్ థెరి్మడార్ రిసోటో వంటి ఇతర వంటకాలను అతిథులు ఆస్వాదించారు. రస్‌మలై ట్రెస్లెచెస్, చాకొలేట్ డుల్సే డి లెచే మూస్స్, బాస్క్ చీజ్‌కేక్ లాంటి భారతీయ, పాశ్చాత్య స్వీట్స్ అండ్ డిజర్ట్స్ సమ్మేళనం ఆకట్టుకున్నాయి.

కళాత్మక అలంకరణలో శ్వేత–బంగారు రంగులతో కూడిన డెకార్, పుష్ప గుచ్ఛాలు, పెరల్స్ అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శాస్త్రీయ సంగీత బృందం ’తబలా, సన్స్’ సంగీత ప్రదర్శన, డెలిగేట్ల ఫ్లాష్ మాబ్ డాన్స్ కార్యక్రమానికి జోష్‌ని తీసుకొచ్చాయి. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమంలో కొన్ని ఉత్తమమైన మానవతా కార్యక్రమాలను డెలిగేట్లు ప్రదర్శించారు. ఈ గాలా వేడుక కు రాజ కుటుంబ సభ్యులు మహారాణి రాధికా గాయక్వాడ్ (బరోడా), ప్రిన్సెస్ కృష్ణకుమారి (జోధ్‌పూర్), డాక్టర్ మధు చోప్రా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ గాలా ద్వారా భారత సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగినందుకు గర్వంగా ఉంది..’అని అన్నారు. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే ఈ వేడుకను ‘సౌందర్యంతో పాటు సమాజసేవకు వేదిక’గా అభివర్ణించారు.