
మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనతో ఈ చారిత్రక కట్టడాలకు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం లభించనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సందర్శనను తెలంగాణ పర్యాటక ప్రాచుర్యంలో భాగంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంప్రదాయ శిల్పకళ, చరిత్ర, చారిత్రక వైభవం నేటి యువతకు అంతర్జాతీయ వేదికలకు పరిచయం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడి
మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు – రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిని సందర్శించనున్నారు. ఈ సందర్శనతో తెలంగాణ సంస్కృతి, శిల్పకళకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.
రామప్ప దేవాలయం.. శిల్పకళకు నిలయం..
వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన గొప్ప కట్టడం. కాకతీయ రాజవంశానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ దేవాలయం, మృదువైన రాతితో రూపొందించిన శిల్పాలతో విశేషంగా ప్రసిద్ధి చెందింది. గత 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, చిరకాలం నిలిచే తేలికపాటి ఇటుకలతో నిర్మితమై, శిల్పకళ, శాస్త్రీయ నిర్మాణ కౌశలానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
వేయి స్థంభాల గుడి – శిలాశిల్పాల సమ్మేళనం
హనుమకొండలోని వేయి స్థంభాల గుడి అనేది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన మరొక అద్భుత శిల్పకళా చరిత్ర. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినది. వేలాది రాతి స్తంభాలతో కట్టబడి, ప్రతీ స్తంభం ప్రత్యేక శిల్పంతో కళాత్మకంగా రూపొందింది. ముఖ్యంగా అక్కడి ఉత్కృష్టమైన నృత్యశిల్పాలు, సంగీతాన్ని ప్రతిబింబించే శిలాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి.
వరంగల్ కోటలోసందడి పేరిణి నృత్యాన్ని ఆస్వాదించనున్న అందాల రాణులు
తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మరో ఘట్టానికి బుధవారం తెర లేవనుంది వరంగల్. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక వరంగల్ కోటను సందర్శించి, అక్కడి ప్రాచీన కళారూపమైన పేరిణి శివతాండవ నృత్యంను తిలకిస్తారు. ఈ సందర్శనలో పోటీదారులు కాకతీయుల ఘన వారసత్వానికి, తెలంగాణ సంప్రదాయాలను తెలుసుకోనున్నారు.

వరంగల్ కోట – కాకతీయ వైభవానికి ప్రతీక
వరంగల్ కోట.. ఎకోశిలా తోరణంలతో ప్రసిద్ధిగాంచిన ఈ కోట, 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. రుద్రమదేవి, వంటి శక్తిమంతుల పాలనకు సాక్షిగా నిలిచిన ఈ కోట శిల్పకళ, ప్రాకారాల నిర్మాణ శైలి, ద్వారతోరణాల తో విశిష్టత అందుకుంది. కోట ప్రాంగణంలోని రాతి శిల్పాలు కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
పేరిణి నాట్యం – శక్తి, శివభక్తి సమ్మేళనం
పేరిణి శివతాండవం అనేది పురాతన పురుషుల నృత్యరూపం. ఇది యుద్ధానికి ముందు వీరులు శక్తిని ప్రేరేపించుకునేందుకు చేసే తాండవ నృత్యంగా పేరు గాంచింది. శివుని ఆరాధనగా చేసే ఈ నృత్యం, ఉగ్రత, శక్తి, శ్రద్ధల సమన్వయంతో భక్తుల మనస్సులను హత్తుకుంటుంది.
పేరిణి నృత్యాన్ని అంతరించి పోతున్న కళారూపంగా భావించి, ప్రముఖ నృత్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ నాట్యాచార్య నటరాజ రామకృష్ణ తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా పరిగణించబడుతోంది.
ప్రపంచ వేదికపై తెలంగాణ కళల వెలుగు
ఈ సందర్శనలో మిస్ వరల్డ్ పోటీదారులు కోటలోని తూర్పు గోపురాన్ని, రాతిశిలల కట్టడాలను, తూర్పు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించనున్నారు మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, సంప్రదాయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక రంగానికి ఊతమిచ్చే గొప్ప అవకాశం.