
యంగ్ టాలెంట్
జీవిత కాలం నడిసంద్రంలో వేట కొనసాగిస్తూ కడుపు నింపుకునే వాడబలిజెల (బెస్తవాళ్లు) కుటుంబంలో ఒక ఆణిముత్యం మెరిసింది.ఆ ఆణిముత్యం పేరు ప్రసాద్ సూరి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి(25) మత్స్యకార యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. రాయడం, బొమ్మలు గీయడంలో ప్రతిభ చూపుతున్న ప్రసాద్ సూరి తన సృజనాత్మక ప్రయాణం గురించి ‘సాక్షి’తో చెప్పిన విషయాలు...
వలస బతుకు
మాది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని వాడ నర్సాపురం. యాభై ఏళ్ల క్రితం మా కుటుంబీకులు చేపల వేట వృత్తి, కుటుంబ పోషణ కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ బుగ్గవాగు రిజర్వాయర్‌కు వలస వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం పల్నాడు జిల్లాగా మారింది. ఆర్థికంగా బలహీనులైన మా కుటుంబానికి పొట్ట నింపుకోవడం కష్టం కావడంతో నా ఎలిమెంటరీ విద్యాభ్యాసం అక్కడక్కడా, చివరకు అమ్మగారి ఊరు రాంబిల్లి మండలం వాడ రాంబిల్లిలో పూర్తి అయింది. యలమంచిలిలో ఇంటర్ పూర్తి చేశాక జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మహారాజా సరోజరావు యూనివర్సిటీ (బరోడా) లో ఆర్కియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను.
బతుకు పోరాటం
అణగారిన వర్గంలో పుట్టాను. ఆర్థిక వెతలు, చుట్టూ మద్యం తాగే అలవాటు ఉన్నవారు, గొడవలు, చెప్పలేని సాంఘిక రుగ్మతలను దగ్గర నుంచి పరిశీలించాను. అనుభవించాను. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం ప్రారంభించాను. వందలాది పుస్తకాల పఠనం నన్ను మార్చింది, ప్రభావితం చేసింది. ఖాళీగా ఉండకుండా బొమ్మలు గీయడం, పెయింట్లు వేయడం నా హాబీగా మారింది. నా పాత్రే చిరంజీవి అనే నామకరణంతో ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’ అనే నవలా రాశాను. మా కుటుంబం, మా బెస్తవారి స్థితిగతులు, భాష, యాస, సవాళ్లు, అవమానాలతో అల్లుకున్న నవల మై నేమ్ ఈజ్ చిరంజీవి.
తర్వాత రాసిన రెండవ నవల ‘మైరావణ’ ఉత్తర కోస్తా తీరంలోని మత్స్యకార జీవితాలను స్పృశిస్తూ మా ఆచార వ్యవహారాలు, వలసలు, బతుకుపోరాటం, అవమానాలను కళ్లకు కట్టినట్లు జానపద శైలిలో రాశాను. ‘మై రావణ’కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇప్పుడు మరో పుస్తకాన్ని రాస్తున్నాను. సినీ దర్శకునిగా ఎదగాలన్నది నా ఆకాంక్ష.
భవిష్యత్‌ను మార్చే చదువు
మా బెస్తవారిని వాడ బలిజెలు అనీ, వాడోళ్లు అనీ అంటారు. నేను చదువు కుంటూ, నవలలు రాస్తూనే నాన్న గారితో చేపలు పట్టడానికి వెళ్లే వాడిని. మా మత్స్యకార యువత చదువుకోవాలి. మా తల్లితండ్రులు చేపల వేట మీద దృష్టి పెట్టి పిల్లల భవిష్యత్ లక్ష్యాల గురించి ఆలోచించడం లేదు. చదువే మార్చుతుంది. చదువే మనల్ని మార్చుకుంటుంది. విపరీతంగా చదివే అలవాటే నన్ను రచయితను చేసింది. సూరాడ ప్రసాద్‌ను ప్రసాద్ సూరిగా మార్చింది. నా పెన్ నేమ్ ప్రసాద్ సూరి.
– ఇంటర్వ్యూ: దాడి వెంకటరావు, అచ్యుతాపురం, సాక్షి