మాఘమాసం ఎప్పుడొస్తుందో..! | Marriage Season Begins February Wedding Muhurthams | Sakshi
Sakshi News home page

మాఘమాసం ఎప్పుడొస్తుందో..!

Jan 26 2026 4:06 PM | Updated on Jan 26 2026 4:24 PM

Marriage Season Begins February Wedding Muhurthams

హిందూ ధర్మంలోని పదహారు సంస్కారాల్లో వివాహం ప్రధానమైనది. అందుకే వివాహాలు చేసే   సమయాల్లో మంచి ముహూర్తాలు చూస్తుంటారు. తిథులు, నక్షత్రాలు, రాశులు, ఫలాలు..ఇలా అన్నీ కలిసివచ్చే ముహూర్తం కోసం ఎదురుచూస్తారు. ఇలాంటివన్నీ కలిసివచ్చే రోజులు మాఘమాసం నుంచి ప్రారంభమవుతాయి. గడిచిన మూడునెలల గ్యాప్‌ తరువాత పెళ్లిళ్లకు మంచి రోజులు వస్తుండడంతో ఒక్కటవ్వాలనుకునే జంటలు సిద్ధమవుతున్నాయి. ముందుగా పెళ్లి చూపులకు అనువైన రోజులు చూస్తున్నారు.  

వరుసగా ఆరు నెలలు
ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. జూలైవరకూ అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయని పంచాంగాలు సూచిస్తున్నాయి.  ఫిబ్రవరి నెలలో 5, 6, 8,10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో మంచి ఘడియలు ఉండగా, మార్చి నెలలో 1, 2, 3, 4, 7, 8, 9,  11,12 తేదీల వరకూ పెళ్లి ముహూర్తాలే. ఏప్రిల్‌ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు వివాహాలు చేసుకునేందుకు అనుకూల రోజులు ఉన్నాయి. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు మంచి రోజులు కనిపిస్తున్నాయి. జూన్‌ నెలలో 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకూ «శుభముహూర్తాలే ఉన్నాయి. జూలై 1, 6, 7, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పలువురు పురోహితులు వెల్లడిస్తున్నారు. 

25 రంగాలకు ఊరట
ఓ వైపు సంక్షేమ పథకాలు లేక, మరో వైపు రాయితీ పెట్టుబడి రుణాలు లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాల్లో చిన్న, సన్నకారు వేతనదారులకు, సంస్థల నిర్వాహకులకు ఈ మంచి రోజులు కలిసిరానున్నాయి. వేలాది జంటలు ఒక్కటవుతున్నవేళ ఈ రంగాలకు పనిదొరకనుంది.  25 రంగాలకు చెందిన వందలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ ఆరు నెలల్లో సగానికి పైగా రోజుల్లో వివాహాలకు ముందస్తుగా కల్యాణ మంటపాలు బక్‌ అయ్యాయి. వేలాది వివాహాలు జరుగనున్న నేపథ్యంలో పురోహితులు, ఈవెంట్‌ ఆర్గనైజర్లకు డిమాండ్‌ ఉంటుంది. క్యాటరింగ్, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు కళకళలాడనున్నాయి. అలంకరణæ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఎంతో డిమాండ్‌ ఉంటుంది.

మంచి ఘడియలు
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కావడం వల్ల మాఘాది పంచకం అంటారు. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మంచి రోజులు కావడంతో ఎక్కువ పెళ్లిళ్లు  జరుగుతాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో వేలమందికి ఉపాధి లభిస్తుంది. 

అంపోలు ఉమారుద్రకోటేశ్వరశర్మ(కోటిబాబు),
పురోహితుడు, ఖండ్యాం, రేగిడి మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement