March-3: జపాన్‌ ‘హినామత్సురి’ వేడుక ప్రత్యేకత ఏంటో తెలుసా! | March-3: In Japan There Is A Festival Called Hinamatsuri | Sakshi
Sakshi News home page

March-3: జపాన్‌ ‘హినామత్సురి’ వేడుక ప్రత్యేకత ఏంటో తెలుసా!

Mar 3 2024 1:44 PM | Updated on Mar 3 2024 1:47 PM

March-3: In Japan There Is A Festival Called Hinamatsuri - Sakshi

మన దేశంలో కొన్నిచోట్ల ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెట్టడం, వాటిని చూడటానికి బంధుమిత్రులను ఆహ్వానించడం ఆచారంగా ఉంది. జపాన్‌లో కూడా ఇలాంటి ఆచారమే ఉండటం విశేషం. జపాన్‌లో ఏటా మార్చి 3న ‘హినామత్సురి’ పేరుతో బొమ్మల కొలువుల వేడుకను జరుపుకొంటారు. జపాన్‌లోని షింటో మతస్థులు ఏటా జరుపుకొనే ఐదు రాచవేడుకల్లో ఇదొకటి. ఇదివరకు చైనీస్‌ కేలండర్‌ లెక్కల ప్రకారం ప్రతిఏటా మూడో నెలలోని మూడో రోజున ఈ వేడుకను జరుపుకొనేవారు. ఇంగ్లిష్‌ కేలండర్‌ వాడుక అలవాటైన తర్వాత ఈ వేడుకను  మార్చి 3న జరుపుకోవడం మొదలు పెట్టారు.

‘హినామత్సురి’ వేడుకను ‘డాల్స్‌ ఫెస్టివల్‌’ అని, ‘గర్ల్స్‌ ఫెస్టివల్‌’ అని కూడా అంటారు. ఈ వేడుకలో ఇళ్లల్లో బొమ్మల కొలువు పెట్టడానికి అంచెలంచెలుగా వేదికను ఏర్పాటు చేసి, దానిపై ఎర్రని తివాచీ పరిచి, చక్కగా అలంకరించిన బొమ్మలను కొలువులో పెడతారు. ఈ బొమ్మల కొలువులో జపాన్‌ చక్రవర్తి, మహారాణి బొమ్మలతో పాటు రాచప్రాసాదంలో సంగీత వాద్యాలను వాయించేవారు, నృత్యం చేసేవారు సహా రకరకాల పనులు చేసేవారి బొమ్మలను సంప్రదాయబద్ధంగా పెడతారు. వీటితో పాటు ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మలను కూడా కొలువులో పెడతారు.

ఈ కొలువుల్లో బొమ్మలను అమర్చడంలో ఒక క్రమాన్ని, పద్ధతిని పాటిస్తారు. ఈ బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడంలో సందడంతా అమ్మాయిలదే! ఐదు అంచెల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడానికి దాదాపు 1500–2500 డాలర్ల (రూ.1.24 లక్షల నుంచి రూ. 2.07 లక్షలు) వరకు ఖర్చు చేస్తారు. ఇళ్లల్లో బోషాణాల్లోను, బీరువాల్లోను దాచిపెట్టిన బొమ్మలను ఈ వేడుక కోసం బయటకు తీసి, వాటిని శ్రద్ధగా అలంకరిస్తారు. వేడుక మరుసటి రోజునే ఈ బొమ్మలను కొలువు నుంచి తీసేసి యథాప్రకారం దాచేస్తారు.

వేడుక ముగిసినా బొమ్మలను తీసి దాచేయకుంటే, ఇళ్లలోని అమ్మాయిలకు ఆలస్యంగా పెళ్లి జరుగుతుందని షింటో మతస్థుల నమ్మకం. సంప్రదాయ ప్రకారం ఈ బొమ్మల కొలువులను కనీసం ఐదు అంచెల్లో ఏర్పాటు చేస్తారు. సంపన్నులైతే, ఏడు అంచెల్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు. ఈ ఆచారం పదిహేడో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. అప్పటి జపాన్‌ యువరాణి మీషో పీచ్‌ ఫెస్టివల్‌ సమయంలో తొలిసారిగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసింది. బొమ్మల కొలువులను ఏర్పాటు చేసిన వారు ఇళ్లకు అతిథులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు.

ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్‌'.. రిఫ్రిజిరేటర్‌ కంటే వేగంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement