
అహానా కృష్ణ, రీమా కళింగల్, అనార్కలి మరక్కర్
కేరళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గత రెండు రోజులుగా తమ కాళ్లు కనిపించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘ఎస్ వుయ్ హావ్ లెగ్స్’ అని పెడుతున్నారు. ఇప్పుడక్కడ అది ఉద్యమం. అక్కడి వర్ధమాన నటి అనస్వర రాజన్ ‘షార్ట్స్’ ధరించి పెట్టిన ఫొటోను చూసి కేరళలోని పురుషులు ‘అమ్మాయిలు ఇలా చేయొచ్చా’ అని ట్రోల్ చేయడమే ఇందుకు కారణం. అనస్వర రాజన్‌కు మద్దతుగా దేశ విదేశాలలోని మహిళా నెటిజన్స్ కూడా తమ కాళ్ల ఫొటోలు పెట్టి మగవారిని హెచ్చరిస్తున్నారు. తమ శరీరం తమ ఇష్టం అని తేల్చి చెబుతున్నారు.
ఇటీవల తెలుగులో ‘అల వైకుంఠపురములో’ సినిమా ‘లవ్ ట్రాక్’ అచ్చు హీరోయిన్ కాళ్ల చుట్టే తిరిగింది. అందులో హీరో అయిన అల్లు అర్జున్ హీరోయిన్ అయిన పూజాహెగ్డే కాళ్లను చూసే ప్రేమిస్తాడు. ‘సిరివెన్నెల’ను అరువు తెచ్చుకుని పాట కూడా పాడతాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది కూడా. సినిమా మొత్తం ఆ హీరోయిన్ కాళ్లు కనిపించేలానే దుస్తులు ధరించి ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. కాళ్లు కనిపించడాన్ని అభ్యంతరం పెట్టే రోజులు దాటేశామని స్త్రీలు భావిస్తున్నారు కూడా. కాని కాదు.
వివాదం రేపిన అనశ్వర రాజన్ ఫొటో, భర్త ఫాహద్ ఫాజిల్‌తో నజ్రియా నజీమ్
సెప్టెంబర్ 12– శనివారం కేరళలో జరిగిన ఒక సంఘటనే ఇందుకు తార్కాణం. అక్కడి వర్ధమాన నటి అనుస్వర రాజన్ తన తాజా ఫొటోను ఆ రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఆమె ‘షార్ట్స్’లో ఉంది. అలాంటి ఫొటోలు సర్వసాధారణమైనవే. అయినప్పటికీ కేరళలో పురుషులు ఆమె మీద దాడి మొదలెట్టారు. ఆమె ఫొటో కింద కామెంట్స్‌లో ‘పద్దెనిమిదేళ్ల అమ్మాయివి. ఇలా చేయొచ్చా’ అని ఒకరు, ‘మంచి అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించరు’ అని మరొకరు వందల మంది కామెంట్లు చేశారు. దాదాపు 13 వేల కామెంట్లు నడిచాయి. మొత్తం మీద ఆ కామెంట్స్ సారాంశం ‘దుస్తులను బట్టి మర్యాద’. ‘స్త్రీ తన శరీరాన్ని దాచుకోవాలి’. ‘స్త్రీ అనవసరంగా తన అవయవాలను బహిర్గతం చేయకూడదు’, ‘ఇలా చేయడం కామ ప్రకటన చేయడం’... గట్రా గట్రా అనే. ఇంకా చెప్పాలంటే స్త్రీ శరీరానికి మాత్రమే ‘లైంగికత’ ఉంటుంది. స్త్రీ శరీరం మాత్రమే ‘సంస్కృతికి ప్రతీక’. ‘ఆమె శరీరాన్ని చూపించడం అంటే సంస్కృతిని నాశనం చేయడమే’.
పార్వతి తిరువోతు
అనశ్వర రాజన్ ప్రతిభ కలిగిన అమ్మాయి. ఆమె నటించిన ‘ఉదాహరణం సుజాత’, ‘తన్నీర్ మథన్ దినన్‌గళ్’ సినిమాలు హిట్ అయ్యాయి. తనమీద వచ్చిన కామెంట్స్‌కు ఆమె రియాక్ట్ అయ్యింది. ‘నేనేం చేస్తున్నాననే దాని గురించి ఆందోళన చెందకండి. నేను చేస్తున్నదాని గురించి మీరెందుకు ఆందోళన చెందుతున్నారో దానిగురించి ఆందోళన చెందండి’ అని కామెంట్ పెట్టింది. అయితే మరో మలయాళ నటి రీమా కళింగల్ తాను బికినిలో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘హ్యాష్‌టాగ్ ఎస్ వుయ్ హావ్ లెగ్స్’ ఉద్యమాన్ని మొదలెట్టింది. ‘స్త్రీలకు మెదడు ఉంది. భుజాలున్నాయి. హక్కులున్నాయి. కలలున్నాయి. తెలివితేటలు ఉన్నాయి. కాళ్లు కూడా ఉన్నాయి. ఆమె తనను ఎలా వ్యక్తపరుచుకోవాలనుకుంటున్నదనేది ఆమె ఇష్టం. దీనికి వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రతిష్టను ముడిపెట్టాల్సిన అవసరం లేదు’ అని ఈ ఉద్యమ ప్రకటనలో భావాన్ని మరికొంత మంది నెటిజన్లు పోస్టర్లుగా విడుదల చేశారు.
దీనికి వెంటనే మలయాళ ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు స్పందించారు. ప్రసిద్ధ హీరో ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ కూడా తన భర్తతో పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘లెగ్‌డే’ అని క్యాప్షన్ రాసింది. ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ఫేమ్ మలయాళ నటి పార్వతి తిరువోతు, అహనా కృష్ణ లాంటి హీరోయిన్లు అందరూ తమ కాళ్ల ఫొటోలు పెడుతున్నారు. ‘మగవాళ్ల శరీరాలు ఆడవాళ్ల శరీరాలు ఒకటే. మగవాళ్లు పొట్టి దుస్తులు ధరిస్తే రాని కామెంట్లు ఆడవాళ్లు ధరించగానే వచ్చేస్తాయి. మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం. మీ ఇష్టం కాదు’ అని అహనా కృష్ణ రాసింది. ఇది మగస్వామ్యపు వ్యవస్థ అనేది వాస్తవం. ఇక్కడ స్త్రీలకు బంధనాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాళ్లు కనిపించినా కూడా సమస్య చేసేంతగా వారికి బంధనాలు వేస్తుంటే వారింక ఏ విధంగా అడుగు ముందుకేస్తారనేది కూడా ప్రశ్నే.
తెలుగునాట కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. గతంలో పార్లమెంట్‌లో నటుడు మురళీమోహన్ స్త్రీల దుస్తుల గురించి ‘జాగ్రత్తలు’ చెప్పి తీవ్రమైన నిరసనను ఎదుర్కొన్నారు. ఇటీవల యాంకర్ అనసూయ ఒక టీవీ షోలో ధరించిన బట్టలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఈ సాంఘిక భద్రత, సంఘ మర్యాదల బరువును తమ శరీరాల మీద వేయడం గురించి స్త్రీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ‘స్త్రీలు శరీరాలను చూపడం వల్లే అత్యాచారాలు’ అనే మూస అభిప్రాయానికి ‘మరి చిన్న పిల్లల మీద పండు ముదుసలుల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?’ అని నిలదీస్తూనే ఉన్నారు. స్త్రీని భోగవస్తువుగా చూసే దృష్టి, ఆమె శరీరాన్ని లైంగిక కారకంగా చూసే దృష్టి పోనంత కాలం ఇలాంటి హాష్‌టాగ్ ఉద్యమాలు మరిన్ని జరుగుతూనే ఉంటాయి.
– సాక్షి ఫ్యామిలీ