ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..! | legal Advice: Womens careers were destroyed by domestic abuse | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!

May 28 2025 9:05 AM | Updated on May 28 2025 9:22 AM

legal Advice: Womens careers were destroyed by domestic abuse

ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? 
– పవన్‌ కుమార్, రాజమండ్రి

మీరు వెంటనే డైవర్స్‌ పిటిషన్‌ ఫైల్‌ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. 

ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్‌ కన్సెంట్‌ డివోర్స్‌ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.

నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? 
– ఎస్‌డీ. జహంగీర్, హైద్రాబాద్‌

మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్‌ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. 

అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్‌ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

(చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్‌..! బతకదు అనుకున్న భార్యను..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement