
భార్య అందం తగ్గిందని వదిలేసే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో.. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా..? అని విస్తుపోతారు. ఎందుకంటే..భార్య మంచానికే పరిమితమైతే..వదిలేసే భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో. అంతేగాదు తన అవసరాలన్నీ తీరిస్తేనే..భార్య. లేదంటే అనవసరం అనే మగవాళ్లనే చూశాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..తాను చేయగలిగంతా చేసి కాపాడుకునే యత్నం చేశాడు. అయినా విధి కన్నెర్రజేసి భార్య కోమాలోకి వెళ్లిపోయేలా చేసినా..ఆశను వదులుకోలేదు. బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్లుకునేలా నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు.
అతడే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య యే మెయిడీ ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతున్నా..ఆమె చేయిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా కాచుకున్నాడు. అయితే ఆ కేన్సర్..డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృభించి భార్యను కోమాలోకి వెళ్లిపోయిలా చేసింది. డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా.. తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది.

ఇక డెంగ్, మెయిడీల ప్రేమ కథ 2016లో ఓ స్నేహితుడిలో వివాహంలో ప్రారంభమైంది. ఇక్కడ మెయిడీ తీవ్ర బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆ విషయం తెలిసినప్పటికీ..ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడుడెంగ్. మెయిడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మెయిడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశ్యంతో అతడి ప్రేమను అంగీకరించలేదు.
కానీ డెంగ్ తనని ఎట్టి పరిస్థితిలో వదిలేయనని, అన్ని విధాల చేదోడువాదోడుగా ఉంటూ చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ 2019లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి 2021లో హన్హాన్ అనే కుమార్తె జన్మించింది. ఆ ఒక్క ఏడాది తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించటం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది.
ఆ సమయంలో మెయిడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని..లాభం లేదని భర్త డెంగ్‌కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రూ. 2 కోట్లుపైనే ఖర్చేపెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకుపూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది మెయిడీ. అయితే డెంగ్ ఆశను వదులుకోవడానికి ఇష్టపడలేదు. మెయిడీని ఇంటికి తీసుకువచ్చి..కుటుంబసభ్యులతో వీడ్కోలు మాదిరిగా పలుకుతూ..తన కుమార్తెతో కలి మెయిడీ బుగ్గపై ప్రేమగా ముద్దుపెట్టారు.
అంతేగాదు ఆ అపురూపమైన భావోద్వేగా దృశ్యాన్ని క్లిక్‌మనిపించి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే నెట్టింట డెంగ్‌కి భావోద్వేగ మద్ధతు తోపాటు భారీగా విరాళలు వచ్చాయి. ఆ సాయంతో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ మూడు నెలల్లో మెయిడీ కోలుకోవడం..మళ్లీ యథావిధిగా మాట్లాడటం ప్రారంభించింది. అంతేగాదు ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆమెకు పూర్తికాల సంరక్షకుడిగా కంటికి రెప్పలా కాచుకున్నాడు.
అంతేగాదు స్ప్రుహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ..డ్యాన్స్ చేస్తూ..ఉత్సాహాం నింపేవాడు. దాంతో త్వరితకాలంలోనే మెయిడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకోవడమే గాక ఎవరీ సాయం లేకుండా నడిచేలా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఇప్పుడామె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడపటం విశేషం.
చివరగా డెంగ్ మాట్లాడుతూ.."ఆమె మమ్మల్ని వదిలివెళ్లడం నాకస్సలు ఇష్టం లేదు. ఎలాగైన బతికించుకోవాలన్న తపన, ఆమెపై ఉన్న అచంచలమైన ప్రేమ తదితరాలతోనే తన భార్యను తిరిగి దక్కించుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు." డెంగ్. అంతేగాదు భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే 'నాతి చరామీ' అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ చైనా భర్త డెంగ్