అందమైన ప్యాకింగ్‌తో ఆదాయం.. తొమ్మిదేళ్లుగా..

Kritika Sabharwal The Smart Wrap Successful Inspiring Journey - Sakshi

వేడుకల సందర్భాలలో బంధుమిత్రులకు ఏదైనా కానుక తీసుకెళుతుంటాం. ఎంపిక చేసే కానుక ప్రత్యేకంగా ఉండాలనుకోవడమే కాదు, దానిని అంతే ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించి, మన అభిమానాన్ని చాటుకుంటాం. ఈ విషయాన్ని గమనించిన కృతిక సబర్వాల్‌ ‘ది స్మార్ట్‌ ర్యాప్‌’ పేరుతో వ్యాపారవేత్తగా మారింది.

వర్క్‌షాప్స్, వెబినార్‌ ద్వారా టీచర్‌ ప్రెన్యూర్‌గానూ తన సత్తా చాటుతోంది. న్యూ ఢిల్లీలో ఉండే కృతిక ఇప్పటివరకు 5000 మంది విద్యార్థులకు గిఫ్ట్‌ ప్యాకింగ్‌ తయారీలో శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ఉచితంగా గిఫ్ట్‌ ర్యాపింగ్‌ క్రాఫ్ట్‌ నేర్పించి, తన అందమైన మనస్తత్వాన్నీ చాటుకుంటుంది. 

తొమ్మిదేళ్లుగా చేస్తున్న ఈ కృషిలో మహిళలు గిఫ్ట్‌ ర్యాపింగ్‌లో ప్రతిరోజూ ఇంటి నుంచే మూడు గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. వెబినార్‌ ద్వారా ఉచితంగా గిఫ్ట్‌ ర్యాప్‌ తయారీతో పాటు ఇంటి నుంచే సొంత సంపాదన ఎలా సృష్టించుకోవచ్చో అవగాహన కల్పిస్తోంది కృతిక సబర్వాల్‌. వీటికి సంబంధించిన వివరాలను ఎంతో ఆనందంగా పంచుకుంటుంది.

‘‘జీవితం అనేది ఒక వేడుక. ఇక్కడ మనం ఆనందం, ప్రేమతో ఎంపిక చేసుకున్న బహుమతులను ఆప్తులకు బహుకరిస్తూ ఉంటాం. మన ప్రియమైనవారికి మన విలువైన సమయాన్ని వెచ్చించి, ఖరీదైన వస్తువులను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చినప్పుడు ఆటోమ్యాటిగ్గా వాటిపైన ఉన్న అందమైన ప్యాక్‌పైన దృష్టి వెళుతుంది.

ఆ బహుమతిని అందుకునేవారి మనసును ఆకట్టుకునేలా ప్యాకింగ్‌ సేవలను అందించాలనుకున్నాను. వెంటనే ‘మీ బహుమతులను మరింత ఆహ్లాదకరమైన రీతిలో అందించండి’ అనే థీమ్‌తో  2013లో ది స్మార్ట్‌ ర్యాప్‌ బిజినెస్‌లోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2016లో ఇంటి నుంచే చిన్న గిఫ్ట్‌ ర్యాపింగ్‌ వర్క్‌షాప్‌ చేయాలనే ఆలోచన నన్ను టీచర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. దీంతో కోర్సులు, వర్క్‌షాప్‌లను రూపొందించడం ప్రారంభించాను.

చాలా మంది గిఫ్ట్‌ ప్యాకేజింగ్‌ డిజైనర్లుగా మారడానికి సహాయం చేశాను. నాకే కాదు, ఎంతోమంది మహిళలకు ఉపాధికి అందమైన మార్గం దొరికింది అనిపించింది. గత పదేళ్లుగా 200కు పైగా వర్క్‌షాప్స్, 600కు పైగా వర్చువల్‌ క్లాసులు నిర్వహించాను. ప్రపంచంలో ఎవరైనా గిఫ్ట్‌ ప్యాకింగ్‌ నేర్చుకోవాలనుకుంటే వారికి మొదట గుర్తుకు వచ్చే పేరు ‘ది స్మార్ట్‌ ర్యాప్‌’ అనేది ఉండేలా సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. 

ఇంటినుంచే వ్యాపారం
ఎప్పటికప్పుడు మార్కెట్‌లోని తాజా ట్రెండ్‌లను అప్‌గ్రేడ్‌ చేయడం నా బిజినెస్‌ లక్ష్యం. గిఫ్ట్‌ ర్యాప్‌ వ్యాపారం ద్వారా ఇంటి నుంచే సంవత్సరానికి సుమారు తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ల ద్వారా ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు. ఈవెంట్‌ నిర్వాహకులు, బేకర్లు, స్వీట్లు, గిఫ్టింగ్‌ కంపెనీలు, గృహాలంకరణ బ్రాండ్లు ఈ కళ పట్ల మొగ్గు చూపడానికి చాలా అవకాశాలున్నాయి.

సందర్భానికి సరిపోయేలా గిఫ్ట్‌ ప్యాక్‌ ఎలా రూపొందించాలో తెలిసుండాలి. వాటిని నేను పరిచయం చేస్తాను. మంచి మాటలే కాదు మనం అందించే కానుక ప్యాకింగ్‌ కూడా చాలా కాలంపాటు అందుకున్నవారి మదిలో గుర్తుండిపోయేలా మనం చేయాలి. 

నిపుణులనూ తయారు చేయచ్చు
ర్యాపింగ్‌ టెక్నిక్‌లను పంచుకోవడం,  వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నది నా లక్ష్యం. ఈ గిఫ్ట్‌ ర్యాప్‌ ప్యాక్‌ క్రాఫ్ట్‌ నుంచి మీ తోటివారితో వినూత్న ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రొఫెషనల్‌ వెడ్డింగ్‌ ప్యాకర్‌గా మారడంలోనూ ఇది మీకు సహాయపడుతుంది.

మీలాగే మరికొందరిని ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. జట్టుగానూ విజయాలను సాధించవచ్చు. కార్పొరేట్‌ హ్యాంపర్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, బేబీ బర్త్‌ ప్యాక్స్, కృత్రిమ పూలు, కలపతో తయారుచేసిన బాస్కెట్స్‌ అలంకరణలు దీనికి జోడించవచ్చు. అంతేకాదు, ఈ ర్యాప్స్‌ నుంచి ఈవెంట్‌ డెకరేటివ్‌ ఆలోచనలకు కావల్సిన సలహాలనూ ఇస్తుంటాను.

ఇన్నేళ్లలో ఇది ఎంతోమంది మహిళలకు ఉపయుక్తంగా మారిపోవడం ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్న కృతికను చూస్తుంటే, స్మార్ట్‌గా మెలకువలను అమలు చేయడం ఎంత అవసరమో అర్థం అవుతుంది.    

చదవండి:  నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్‌’ అని చెప్పుకోవాలి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top