ఖులానామాకు ధ్రువీకరణ అక్కరలేదు! | The Khulanama Does Not Require Verification Legal Advice Srikanth Chinthala Judge | Sakshi
Sakshi News home page

ఖులానామాకు ధ్రువీకరణ అక్కరలేదు!

Jun 3 2026 7:14 AM | Updated on Jun 3 2026 7:14 AM

The Khulanama Does Not Require Verification Legal Advice Srikanth Chinthala Judge

లీగల్‌

నా మాజీ భార్య రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా ఖులానామా పంపింది. ఆమె గుజరాత్‌లో, నేను అనంతపూర్‌లో ఉంటున్నాం. ఈ ఖులానామాలో దారుల్‌ ఖజా, జమాత్‌ లేదా నమోదైన ఖాజీ వంటి స్థానిక మతపెద్దల ప్రమేయం లేదు కానీ ఇరుపక్షాల తరఫున సాక్షులు సంతకం చేశారు. నాన్‌–జ్యుడీషియల్‌ స్టాంప్‌పేపర్‌పై గానీ, నోటరీ ద్వారా గానీ ధ్రువీకరించలేదు. భవిష్యత్తులో ఈ ఖులానామాను కోర్టులో సవాలు చేసే వీలుంటుందా? దయచేసి సలహా ఇవ్వండి. – షేక్‌ పాషా

ముస్లిం చట్టం ప్రకారం ఖులానామాను దారుల్‌ ఖజా లేదా జమాత్‌ ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు మంజూరు చేసే చట్టబద్ధ అధికారం వారికి లేదు. తప్పనిసరి కాకపోయినా అందరూ ఇలా చేస్తుంటారు. అందులో తప్పు లేదు కానీ ఖులానామా పత్రం చట్టపరంగా బలంగా ఉండేందుకు, దాని చెల్లుబాటును నిర్ధారించేందుకు ఒక అధికారిక ధ్రువీకరణ ప్రక్రియ అనుసరించడం మంచిది. ఖాజీలు ఇందుకు తగినవారు. దీనివల్ల రెండు పక్షాలు షరతులు, నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్నాయని నిర్ధారించవచ్చు.

ఖులానామా లేదా తలాక్‌ ఎవరైనా సాక్షుల సమక్షంలో జరిగితే సరిపోతుంది. నోటరీ లేదా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదు. అయితే, అలా చేయడం వల్ల పత్రం ్రపామాణికంగా ఉంటుంది. మీవిషయంలో ఇరుపక్షాల సాక్షులు ఉన్నారు కాబట్టి ఎవరూ సవాలు చేయకపోతే సరిపోతుంది. సవాలు చేసే వీలుందా అంటే – ఏదైనా పక్షం ఈ ఖులా బలవంతంగా తీసుకున్నదని లేదా ఒత్తిడిలో జరిగిందని వాదిస్తే, ఖాజీ లేకపోవడం లేదా అధికారిక రిజిస్ట్రేషన్‌ లేకపోవడం కారణంగా కోర్టు దీనిని పరిశీలించవచ్చు.

అలాంటి పరిస్థితిలో సాక్షులపాత్ర, పత్రంపై సంతకాలను కోర్టు సమీక్షిస్తుంది. మీకు అలాంటి సందేహం ఉంటే మీ వివాహం ఖులానామా ద్వారా రద్దయిందని సివిల్‌ కోర్టులో/ఫ్యామిలీ కోర్టులో ఒక డిక్లరేషన్‌ దావా దాఖలు చేయవచ్చు. తప్పనిసరి కాకపోయినా స్థానిక ఖాజీ లేదా దారుల్‌ ఖజాను సంప్రదించి ఖులాను అధికారికంగా నమోదు చేయించటం మంచిది. అయితే ఇందుకోసం, ఖాజీ సమక్షంలో పత్రంపై మళ్లీ సంతకాలు చేయవలసి రావచ్చు. – శ్రీకాంత్‌ చింతల హైకోర్టు న్యాయవాది

Advertisement
 
Advertisement
Advertisement