డివోర్సీ క్యాంప్స్‌ | Kerala Divorce Camp offering mental strength to women | Sakshi
Sakshi News home page

డివోర్సీ క్యాంప్స్‌

Jun 12 2025 1:26 AM | Updated on Jun 12 2025 4:39 AM

Kerala Divorce Camp offering mental strength to women

విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్‌’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్‌ లక్ష్యం. మొదటిది సక్సెస్‌ కావడంతో రాబోయే రెండు నెలల్లో  మరో నాలుగు క్యాంప్స్‌ నిర్వహించనుంది రాఫియా.

‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్‌ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్‌’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు  పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. 

మాకంటూ స్పేస్‌ కావాలి
‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్‌ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్‌ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్‌ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.

బ్రేక్‌ ఫ్రీ స్టోరీస్‌
రాఫియాకు ఇన్‌స్టాలో ‘కుక్‌ ఈట్‌ బర్న్‌’ అనే అకౌంట్‌ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్‌స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్‌ను బట్టి అర్థమైంది. 

కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్‌ ఫ్రీ స్టోరీస్‌’ పేరుతో ఒక వాట్సప్‌ గ్రూప్‌ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్‌ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్‌కు ఒక స పోర్ట్‌ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్‌ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్‌ లో రెండురోజుల క్యాంప్‌ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.

క్షణాల్లో ఆత్మబంధువులు
డివోర్సీ క్యాంప్‌కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్‌ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. 

‘‘ఈ క్యాంప్‌లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్‌ అడ్వయిజ్, ఫైనాన్షియల్‌ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్‌పర్ట్‌లతో కౌన్సిలింగ్స్‌ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్‌ అయిన వెంటనే రాఫియా ఫోన్‌ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్‌లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్‌లను ΄్లాన్‌ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.

కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్‌ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. 

Advertisement
 
Advertisement
Advertisement