కాశీ తర్వాత కందూరే! | kandur ramalingeswara swamy temple history and significance | Sakshi
Sakshi News home page

దక్షిణకాశీగా వెలుగొందుతున్న రామలింగేశ్వరాలయం

Jun 13 2025 7:03 PM | Updated on Jun 13 2025 7:03 PM

kandur ramalingeswara swamy temple history and significance

క్షేత్రంలోని ఆలయాలు

ఇక్కడ కొలువైన 27 కల్పవృక్షాలే ప్రత్యేకం

11వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం

హోలీ పౌర్ణమి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు

కందూరు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కల్ప వృక్షాలు ఉండటమే ఇందుకు ప్రత్యేక కారణం. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు సమీపంలోని రామలింగేశ్వరాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉంది. వృక్షాల కింద వంటలు చేసి, అందులో కొంత ఇతరులకు దానం చేసి కల్పవృక్షాల కిందే భోజనాలు చేసి నిద్రిస్తే కోరిన కోర్కెలు, గృహబాధలు, రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత 
కల్పవృక్షాలు (కబంధ) కాశీ తర్వాత కందూరులోనే కొలువయ్యాయని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ విశిష్టత ఉంది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత. 

ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. చాలామంది ఆలయం వద్ద ఉన్న కల్పవృక్షాల వేర్లను తీసుకెళ్లి నాటినా అవి పెరగలేదు. ఆలయం వెలిసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్పవృక్షాలే ఉండటం అరుదైన విశేషంగా భక్తులు భావిస్తారు. అందుకే కందూరుకు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రచారకర్తగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వ్యవహరిస్తున్నారు.

తంబళి వంశ మహిళతో.. 
కందూరు సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన మహిళ రోజూ గుట్టపైకి ఎక్కి దర్శించుకునేది. కాలక్రమేణా ఆమె గర్భిణి కావడంతో రోజూ గుట్ట ఎక్కడం ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నావల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొరపెట్టుకుంది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీవెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్ట దిగి వెళ్లు అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ మహిళ గుట్ట దిగడం ఆరంభించింది.

రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్దాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడి పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికీ గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడమే ఈ క్షేత్ర మహిమ.

చ‌ద‌వండి: అడ‌వే ఆధారం.. బ‌తుకు భారం 

Advertisement
 
Advertisement
Advertisement