breaking news
Kandur
-
కాశీ తర్వాత కందూరే!
కందూరు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కల్ప వృక్షాలు ఉండటమే ఇందుకు ప్రత్యేక కారణం. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు సమీపంలోని రామలింగేశ్వరాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉంది. వృక్షాల కింద వంటలు చేసి, అందులో కొంత ఇతరులకు దానం చేసి కల్పవృక్షాల కిందే భోజనాలు చేసి నిద్రిస్తే కోరిన కోర్కెలు, గృహబాధలు, రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత కల్పవృక్షాలు (కబంధ) కాశీ తర్వాత కందూరులోనే కొలువయ్యాయని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ విశిష్టత ఉంది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. చాలామంది ఆలయం వద్ద ఉన్న కల్పవృక్షాల వేర్లను తీసుకెళ్లి నాటినా అవి పెరగలేదు. ఆలయం వెలిసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్పవృక్షాలే ఉండటం అరుదైన విశేషంగా భక్తులు భావిస్తారు. అందుకే కందూరుకు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రచారకర్తగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వ్యవహరిస్తున్నారు.తంబళి వంశ మహిళతో.. కందూరు సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన మహిళ రోజూ గుట్టపైకి ఎక్కి దర్శించుకునేది. కాలక్రమేణా ఆమె గర్భిణి కావడంతో రోజూ గుట్ట ఎక్కడం ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నావల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొరపెట్టుకుంది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీవెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్ట దిగి వెళ్లు అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ మహిళ గుట్ట దిగడం ఆరంభించింది.రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్దాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడి పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికీ గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడమే ఈ క్షేత్ర మహిమ.చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం -
ఒకప్పుడు మన రాజధాని కందూరు.. తాజాగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: కందూరు.. ఇది మహబూబ్‌నగర్ జడ్చర్ల సమీపంలో ఉంది. ఇప్పుడు ఓ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీస్తుశకం 1025-1248 మధ్య కాలంలో కల్యాణి చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు స్వతంత్ర పాలన నిర్వహించారు. ఆనాటì ఈ ప్రాంత వైభవం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. తరచుగా వెలుగు చూస్తున్న అలనాటి గుర్తులు అప్పటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. తాజాగా విశ్రాంత పురావస్తు అధికారి, చరిత్ర పరిశోధకుడు, విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి నాటి వివరాలు మరికొన్ని వెలుగులోకి తెచ్చారు. ఇనుప యుగం నాటి అరుదైన మానవ సమాధులు, కందూరు చోళుల పాలన కాలం నాటి శిల్పాలు, మందిర ఆనవాళ్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. నాటి జ్ఞాపకాలు చెదిరిపోకుండా కాపాడాలని స్థానిక సర్పంచ్ మున్నూరు శ్రీకాంత్‌కు సూచించారు. శివనాగిరెడ్డి వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు తదితరులున్నారు. అరుదైన రాక్షస గుళ్లు ఇది క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి ఇనుప యుగం నాటి మానవ సమాధి. సమాధి పైభాగంలో భారీ రాళ్లను వృత్తాకారంలో పేర్చి ఉండే ఈ నిర్మాణాలను రాక్షస గుళ్లుగా పేర్కొంటారు. కానీ వృత్తాకారంలో రాళ్లు రెండు వరసలుగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన రాకాసి గుళ్ల సమాధి ఇది. రెండో వరస రాళ్ల పైభాగపు మొనలు మాత్రమే ఉపరితలంలో కనిపిస్తున్నాయి. వ్యవసాయం విస్తరణ కోసం అవగాహన లేక రైతులు తొలగించగా కేవలం నాలుగు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా మాయమైతే స్థానిక భావితరాలకు వీటిని చూసే అవకాశం ఉండదు. అద్భుత శిల్పకళా చాతుర్యం అద్భుత అలంకరణతో చిన్నచిన్న వివరాలను కూడా ఇట్టే గుర్తించగలిగే శిల్పకళా చాతుర్యం.. వెరసి ఇదో కమనీయ శిల్పం. 12వ శతాబ్దపు కల్యాణిచాళుక్యుల కాలం నాటి శిల్పుల నేర్పరితనానికి నిలువుటద్దం ఈ చెన్నకేశవస్వామి విగ్రహం. ఇటీవల అభివృద్ధి పనులు చేస్తుండగా ఇలా భూగర్భం నుంచి బయటపడింది. స్థానిక దేవాలయంలో పూజలందుకునే వేళ ముష్కరుల దాడిలో కొంత ధ్వంసమైంది. చేతి భాగాలు విరిగి ఉన్నాయి. మిగతా విగ్రహం అపురూపంగా కనిపిస్తోంది. గుండుపై వీరగల్లు ఇది ఓ వీరగల్లు. యుద్ధంలో వందమందిని మట్టి కరిపించిన స్థానిక వీరుడి స్మారకం. సాధారణంగా వీరగల్లులు విడిగా శిల్పాలుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా గుండుపై చెక్కినవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓ యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడి వీరమరణం పొందిన వీరుడిని నిరంతరం తలుచుకునేలా ఇలా గుండుపై చెక్కి సగర్వంగా నిలిపారు. -
మృత్యుకుహరమైన కోనేరు
అడ్డాకుల (దేవరకద్ర): రాష్ట్రంలోని శైవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరు మృత్యుకుహరంగా మారుతోంది. దైవ దర్శనానికి ముందు పవిత్రమైన కోనేరులో స్నానం చేసి దేవుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల్లో ఏటా ఒకరిద్దరు అందులో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ వేడుకల నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు, జాతర ఉగాది పండగతో ముగుస్తుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రతీసారి కోనేరులో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దేవాదాయ శాఖాధికారులు కోనేరు వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మెట్లు తొలగించి.. ఏడాదిన్నర నుంచి ఆలయం వద్ద పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమం లో గతేడాది కోనేరులో ఉన్న మెట్లను తొలగించారు. కొత్తగా మెట్లను ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పటి వరకు పని మొదలు కాలేదు. మెట్లను తొలగించే క్రమంలో కోనేరులో పూడికను కూడా తీశారు. దీంతో మెట్లు ఉన్న చోట నే ఎక్కువ లోతు ఉంది. రెండేళ్ల నుంచి కోనేరులో జాతర సందర్భంగా ఇనుప రక్షణ కంచె ఏర్పాటు చేస్తు న్నారు. అయితే ఈసారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. కోనేరులో దిగితే లోతుకు వెళ్లిపోతారని కనీసం మైకులో హెచ్చరికలు చేయలేదు. ఈ క్రమంలోనే గురువారం స్నానానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు వదిలారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జాతరకు వచ్చే భక్తులు కోనేరులో స్నానం చేయడానికి జంకే పరిస్థితికి తీసుకురావడం ఆందోళనకు దారితీస్తోంది. 2001లో నలుగురు.. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించాలని ఆలయం ముందు నిర్మించిన ట్యాంకు వద్ద 2001లో ప్రమాదం జరిగింది. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో ట్యాంకు కూలీ భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు భక్తుల కుటుంబ సభ్యులు కోర్టుకు వెళితే ఒక్కొక్కరికి రూ.1.35 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. దేవాలయం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో మన్యంకొండ, ఊర్కొండపేట ఆలయాల నుంచి అప్పు తెచ్చి పరిహారం చెల్లించారు. ఆ తర్వాత ఏటా కొంత నగదు చెల్లించి బాకీ మొత్తం తీర్చేశారు. ఏటా ఒకరిద్దరి బలి కోనేరులో ప్రతి ఏటా ఒకరిద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన ఐదేళ్లలో 2017 మార్చిలో మినహా ప్రతిసారి ఒకరిద్దరు భక్తులు కోనేరులో పడి ప్రాణాలు వదులుతున్నారు. కోనేరులో ఉండే గుర్రపు డెక్కలో చిక్కుకుని కొందరు.. ఈత రాక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అయినా ఆలయ అధికారులు మేల్కోవడం లేదు. రెండేళ్ల నుంచి రక్షణ కంచె ఏర్పాటు చేయడంతోపాటు కోనేరు ఒడ్డుపైనే షవర్ బాత్ చేసేలా ఏర్పాట్లు చేశారు. 2016లో రక్షణ కంచె ఏర్పాటు చేసినా గుర్రపు డెక్కలో చిక్కి ఓ భక్తుడు నీటిలో మునిగాడు. -
తెలంగాణ శ్రీశైలంగా కందూర్
రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి: ఎంపీ కవిత అడ్డాకుల: తెలంగాణలోని అన్ని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కందూర్ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని తెలంగాణ శ్రీశైలంగా మారుస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ సాధించినందున ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కందూర్ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. మహిళలు బతుకమ్మతో, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని శివలింగానికి ఎంపీ కవిత అభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి మంజుల ఎంపీ కవితకు పట్టుచీర, గాజులను అందజేశారు. కోనేరు ఆవరణలో ఉన్న కల్పవృక్షాల కింద మీడియాతో మాట్లాడారు. కాశీకి వెళ్లలేని వారు ఇక్కడికొస్తే పుణ్యఫలం లభిస్తుందన్నారు. దక్షిణకాశీగా పేరొందుతున్న రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని రెండో శ్రీశైలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. నటుడు తనికెళ్లభరణి మాట్లాడుతూ వేములవాడ తర్వాత అంతటి పవిత్రమైన దేవాలయం ఇదేనన్నారు. కార్తీకమాసంలో 100 మందితో కలిసి ఇక్కడే శివమాల ధరిస్తానని, ఆలయ విశిష్టతపై ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జేపీఎన్సీఈ అధినేత కేఎస్.రవికుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.