తెలంగాణలోని అన్ని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కందూర్ రామలింగేశ్వరస్వామి
రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి: ఎంపీ కవిత
అడ్డాకుల: తెలంగాణలోని అన్ని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కందూర్ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని తెలంగాణ శ్రీశైలంగా మారుస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ సాధించినందున ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కందూర్ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. మహిళలు బతుకమ్మతో, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని శివలింగానికి ఎంపీ కవిత అభిషేకం చేశారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి మంజుల ఎంపీ కవితకు పట్టుచీర, గాజులను అందజేశారు. కోనేరు ఆవరణలో ఉన్న కల్పవృక్షాల కింద మీడియాతో మాట్లాడారు. కాశీకి వెళ్లలేని వారు ఇక్కడికొస్తే పుణ్యఫలం లభిస్తుందన్నారు. దక్షిణకాశీగా పేరొందుతున్న రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని రెండో శ్రీశైలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. నటుడు తనికెళ్లభరణి మాట్లాడుతూ వేములవాడ తర్వాత అంతటి పవిత్రమైన దేవాలయం ఇదేనన్నారు. కార్తీకమాసంలో 100 మందితో కలిసి ఇక్కడే శివమాల ధరిస్తానని, ఆలయ విశిష్టతపై ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జేపీఎన్‌సీఈ అధినేత కేఎస్.రవికుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.