
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది.
మహాలక్ష్మికి స్వామి బుజ్జగింపు
రథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమరి్పంచడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం.
అద్వితీయంగా అంతిమ ఘట్టం
పర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది.