
ఇందులో పిల్లలకు కావాల్సిన వస్తువులు
అవరసమైన వారు నిర్ణయించిన ధరతో కొనాలి
చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో నిజాయితీ
పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్‌బుక్స్ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి.
నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి
ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.
టీచర్ విన్నూత్న ఆలోచనతో సాకారం
ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.
పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది
మా స్కూల్‌లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్‌కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది. – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థిని
మొక్కై వంగనిది మానై వంగునా..
చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా.. – తులసీనాథం నాయుడు, టీచర్