Mount Abu: దిల్‌వాడా

Interesting Facts About Dilwara Mount Abu - Sakshi

శిల్పకారుడి గుండెచప్పుడు

శిల శిల్పం కావాలంటే... ఉలిదెబ్బలు తినాలి. పాలరాయిలో కలువలు పూయాలంటే... కరకుదేలిన ఉలితో ఎంత హింస పెట్టి ఉండాలి? పాలరాతిలో రూపుదిద్దుకున్న... సింహాలు... ఏనుగులు... సాలభంజికలు. ఒక ఆదినాథుడు... మరో నేమినాథుడు. ఇది ఊహకే అందని శిల్పనైపుణ్యం. చూసి తీరాల్సిన ఉలి చక్కదనం.

మౌంట్‌ అబూ... ఎడారి ఇసుక తిన్నెకు ప్రకృతి అద్దిన ఆకుపచ్చ బుగ్గచుక్క. రాజస్థాన్‌లో విస్తరించిన ఆరావళి పర్వతశ్రేణులు రాష్ట్రానికి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఈ ఆరావళి శ్రేణులలో ఎత్తైన శిఖరం మౌంట్‌ అబూ. ఈ కొండ పాదాల దగ్గర విస్తరించిన పట్టణాన్ని అబూరోడ్‌ అంటారు. రైల్వేస్టేషన్‌కు కూడా ఇదే పేరు. ఈ కొండ మీద అర్బుదాదేవి ఆలయం ఉండడంతో అబూ కొండ అని అనే పేరు వాడుకలోకి వచ్చింది. అబూ పట్టణం 1,200 మీటర్ల ఎత్తులో ఉంది. మన తిరుమల గిరుల కంటే ఎత్తన్నమాట. అబూకి మూడు కి.మీల దూరంలో దిల్‌వారా టెంపుల్స్‌ ఉన్నాయి.

ఏనుగుల బొమ్మలు
మొదటి ఆలయం పేరు దిల్‌వాడా. చాళుక్య వంశపు రాజు మొదటి భీమదేవుడు నిర్మించాలనుకున్న అసలు ఆలయాలు ఆదినాథ, నేమినాథ, పార్శ్వ నాథ, మహావీర మందిరాలు లోపలున్నాయి. పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు కొనసాగింది వీటి నిర్మాణం. మొత్తం పాలరాతి నిర్మాణాలే. పాలరాయిని ఏనుగుల మీద కొండమీదకు తరలించారు. అందుకు గౌరవపూర్వకంగా హస్తిశాలను నిర్మించారు. ఇక ప్రధాన ఆలయాల్లో శిల్పచాతుర్యాన్ని వర్ణించడం కష్టం.

దిల్‌వారా ఆలయాల స్తంభాలు, గోడలు, లోపలి విగ్రహాల కంటే పై కప్పు గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. అందమైన, లాలిత్యమైన పనితనం చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసారేమో అనిపిస్తుంది. తామర పూల రెక్కలు నిజమైన పూలరెక్కల్లాగే కోమలంగా కనిపిస్తాయి. విచ్చుకున్న పద్మాలు, తామరతూడులోని సన్నని ఈనెలు కూడా రాతిలో కనిపిస్తాయి. స్తంభాల మీదున్న రూపాలన్నీ ఒకేరకంగా ఉన్నట్లనిపిస్తాయి. కానీ గైడ్‌ చెప్పిన తర్వాత పరిశీలనగా చూస్తే ఏ ఒక్కటీ మరొక దానితో పోలి ఉండదు.

కృష్ణుడు కూడా ఉన్నాడు
ఈ జైనమందిరాల్లో గోడలు, పై కప్పు మీద హిందూ, జైన ధార్మిక సాహిత్యంలోని సన్నివేశాలు ఉంటాయి. సింహాలు, సంగీతకారులు, నాట్యకత్తెలు, యక్షిణులు, సాలభంజికలు, కాళీయమర్దన కృష్ణుడు, గోపికలతో కృష్ణుడు, నరసింహ స్వామి, హిరణ్య కశ్యపుడు, 360 మంది జైన సన్యాసుల విగ్రహాలున్నాయి. ఇక్కడ ఫొటోగ్రఫీ నిషేధం. మన కెమెరాలను బయటే వదిలి వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌ను కూడా అనుమతించడం లేదు. 

ఐదు ఆలయాల సమూహం
దిల్‌వాడా టెంపుల్స్‌ మొత్తం ఐదు. నాలుగు ఆలయాల నిర్మాణం తర్వాత మిగిలిపోయిన పాలరాయి, శిల్పాలు చెక్కినప్పుడు రాలిన పొడితో మరొక ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయాల సమూహంలో మొదట కనిపించేది అదే. శిల్పకారులు ఈ ఆలయ నిర్మాణానికి వేతనం తీసుకోలేదట. ప్రేమకొద్దీ చేసిన నిర్మాణం కాబట్టి దిల్‌వాడా అనే పేరు వచ్చింది. క్రమంగా దిల్‌వారాగా వ్యవహారంలోకి వచ్చింది. ఐదు జైన మందిరాల సమూహానికి అదే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయాలలోకి పర్యాటకులను మధ్యాహ్నం పన్నెండు నుంచి అనుమతిస్తారు. పూజలు క్రతువులు జరిగే అంతర మందిరంలోకి జైనులకు మాత్రమే ప్రవేశం.  

వనంలో విరిసిన చందమామ
మూడవ మందిరం కారిడార్‌ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తే పచ్చటి దట్టమైన కొండల మధ్య తెల్లటి చందమామలాగ కనిపిస్తుంది టెంపుల్‌ కాంప్లెక్స్‌. ఎండాకాలం కూడా వేడి తీవ్రత ఉండదు. ఇక్కడ గైడ్‌లు విడిగా ఉండరు. పిల్లలు కంఠతాపట్టిన పాఠాన్ని చదివినట్లు, రెండవ ఎక్కం అప్పచెప్పినట్లు ఆలయ అర్చకులే గుక్కతిప్పుకోకుండా వివరిస్తారు.  

- వాకా మంజులరెడ్డి                          

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top