కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు | Interesting and The untold story of Udupi in Karnataka | Sakshi
Sakshi News home page

Udupi కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు

Jul 11 2025 3:15 PM | Updated on Jul 11 2025 3:55 PM

Interesting and The untold story of Udupi in Karnataka


ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే  ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్‌ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్‌ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి,  పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి  ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్‌లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...

కృష్ణ దేవాలయం..
ఇక్కడి  శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ  శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.

తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్‌ బంగారు ఇసుక  అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్‌  లేదా పారాసెయిలింగ్‌ జెట్‌ స్కీయింగ్‌ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్‌ ప్లేస్‌. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్‌ రాతి నిర్మాణాలు  మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్‌ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్‌హౌజ్‌లో నుంచి చూడాలంటే ఇక్కడి  కౌప్‌ బీచ్‌ కి  వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్‌హౌజ్‌ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్‌కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా  నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్‌ ఫాల్స్‌ ప్రకృతి ప్రేమికులకు కనువిందే.  దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్‌ నిర్మించిన కాయిన్‌ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో  పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement