న్యూస్‌ మేకర్‌: గగనాన్ని జయించింది

Indian Army first woman soldier skydiver Lance Naik Manju - Sakshi

‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ (పారాచూటింగ్‌) చేసిన లాన్స్‌నాయక్‌ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది.

ఆర్మీలో మిలటరీ పోలీస్‌ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్‌ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్‌ వింగ్‌ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్‌.హెచ్‌.ధ్రువ్‌’ (అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్‌ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్‌ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు.

రెండో ప్రపంచ యుద్ధం నుంచి
మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్‌ రెజిమెంట్‌ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్‌ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్‌ వ్యక్తులు పారాచూటింగ్‌ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్‌ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్‌ థామస్‌ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్‌ పోల్‌లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్‌ నేర్చుకుని జంప్‌ చేస్తున్నారు.

మహిళల ముందంజ
ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్‌ అభిలాష బరాక్‌ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్‌ మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా బాధ్యత పొందింది. ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ హినా జైస్వాల్‌ మొదటి మహిళా ఫ్లయిట్‌ ఇంజనీర్‌గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది.

గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్‌ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్‌ హోస్టెస్‌గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే.
 
ఆర్మీకి చెందిన లాన్స్‌నాయక్‌ మంజు స్కై డైవింగ్‌ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top