మనసు క(వ్య)థలు
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...
హాస్పిటల్స్‌లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్‌లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్‌లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.
వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.
మానసిక ఒత్తిడి
ఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్‌గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.
సామాజిక ఒత్తిడి
ఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్‌గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్‌ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు.
డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్
సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్‌మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.
ఒంటరితనం సృష్టించిన వలయం
ఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
నియంత్రణ తప్పనిసరి
→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.
→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.
→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి.
→ నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.
చర్చించే స్వేచ్ఛ ఉండాలి
మానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్‌కేర్ సిస్టమ్ అవసరం.
– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


