రైవతుడి జననం | How was Lord Shiva born? | Sakshi
Sakshi News home page

రైవతుడి జననం

Apr 26 2026 1:32 AM | Updated on Apr 26 2026 1:32 AM

How was Lord Shiva born?

పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. 

మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. 

ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.

కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. 

నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. 

నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.

∙సాంఖ్యాయన 

Advertisement
 
Advertisement
Advertisement