ఈ కొత్తరకం స్నాక్స్‌ వంట​కాలు.. ట్రై చేయండిలా..! | Sakshi
Sakshi News home page

ఈ కొత్తరకం స్నాక్స్‌ వంట​కాలు.. ట్రై చేయండిలా..!

Published Sun, May 26 2024 1:38 PM

How To Cook Snacks Recipes Sunday Special

ఈ కొత్తరకం స్నాక్స్‌ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్‌ మరెంతో స్పెషల్‌.., సోయా అంజీరా హల్వాలు  నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!

కోకోనట్‌ ఆమ్లెట్‌..
కావలసినవి..
గుడ్లు – 5
కొబ్బరి కోరు – పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)
కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)
హెవీ క్రీమ్‌ – అర టేబుల్‌ స్పూన్‌ 
(మార్కెట్‌లో లభిస్తుంది)
పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లు
బటర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు 
(కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)
ఉప్పు – కొద్దిగా

తయారీ..
– ముందుగా ఒక బౌల్‌లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్‌ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అనంతరం పాన్‌ లో బటర్‌ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్‌ చేసుకుని.. ఈ ఎగ్‌ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్‌ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్‌.

బాదం క్రిస్పీ చికెన్‌..
కావలసినవి..
బోన్‌ లెస్‌ చికెన్‌ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్‌ చేసిన ముక్కలు తీసుకోవాలి)
మొక్కజొన్న పిండి – 6 టేబుల్‌ స్పూన్లు
గోధుమ పిండి – 1 టేబుల్‌ స్పూన్‌
బాదం  – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్‌ పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)
గుడ్లు  – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లు
మిరియాల పొడి – కొద్దిగా
ఉప్పు  –  తగినంత
నూనె  –  సరిపడా

తయారీ..
– ముందుగా ఒక బౌల్‌లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
– మరో బౌల్‌లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్‌ ముక్కను తీసుకుని..  దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.
– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్‌ చేసుకోవాలి.

సోయా అంజీరా హల్వా..
కావలసినవి..
డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)
కిస్మిస్‌ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)
సోయా పాలు – అర కప్పు
ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (అభిరుచిని బట్టి)
జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)
నెయ్యి, పంచదార  – సరిపడా
గసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్‌కి

తయారీ..
– ముందుగా అంజీరా, కిస్మిస్‌ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.
– ఈలోపు కళాయిలో 5 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.
– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.
– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్‌ కలర్‌ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్‌ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.
– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్‌ ఆఫ్‌ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.
– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్‌ చేసుకోవాలి.

ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్‌ సమస్యలకు చెక్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement