
నగర జీవనం అత్యాధునికం, సంకేతికం అవుతోంది.. రోజు రోజుకూ అందుబాటులోకొస్తున్న టెక్నాలజీ పుణ్యమాని కొత్త కొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందంటే అది బాత్‌రూమ్ ట్రెండ్స్.. సగటు మానవుని జీవితం మూడేళ్లపాటు బాత్‌రూమ్స్‌లోనే గడుపుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అంతేకాదు.. ‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్‌రూమ్స్’ పేరిట నగరంలో ఓ సెమినార్ కూడా నిర్వహించారట.. దీన్ని బట్టి స్నానాల గదికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక హంగులను అద్దుతున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లోనూ కీలకపాత్ర పోషిస్తోందనడంలో సందేహం లేదు..
ఇటీవల కాలంలో మొబైల్స్ పుణ్యమాని మానవులు, మరీ ముఖ్యంగా నగరవాసులు సగటున మూడేళ్ల పాటు సమయాన్ని బాత్‌రూమ్స్‌లోనే గడుపుతున్నారని ఓ అధ్యయంనలో తేలింది. అంతేకాదు ఏడాదికి 70 లక్షల మంది తమ మొబైల్స్‌ను పోగొట్టుకుంటున్నారని మరో అధ్యయనం తేలి్చంది. అదీ ఎక్కడో కాదు.. బాత్‌రూమ్స్‌లోనే.. మన జీవితంలో ఏడాదికి 2500 సార్లు రెస్ట్‌రూమ్స్ వినియోగిస్తామని మరో స్టరీ పేర్కొంటోంది..
ఇక దేశంలో దంపతుల మధ్య గొడవలకుగల కారణాల్లో బాత్‌రూమ్‌దే ప్రధాన పాత్ర అని మరో స్టడీ చెబుతోంది.. ఇలా చూస్తే.. డ్రాయింగ్ రూమ్స్, జిమ్స్ వంటి వాటికన్నా బాత్‌రూమ్ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారట. స్నానాలగది గురించి ఇంతకు మించిన ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి..
బాత్ చుట్టూ బాతాఖానీ..
‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్‌రూమ్స్’ పేరిట నగరంలో జరిగిన ఓ సెమినార్‌లో ఇలాంటి విషయాలెన్నో చర్చకు వచ్చాయి. ‘బాత్‌రూమ్‌లు మన జీవనశైలిలో అత్యంత ప్రధానమైన భాగంగా మారాయి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, నిర్మించుకునేటప్పుడు సిటిజనులు బాత్‌రూమ్‌లకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.
బిల్డర్స్ కూడా అత్యధికంగా వ్యయం చేసి వినూత్నంగా తీర్చిదిద్దిన, బాత్‌రూమ్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు’ అని చెప్పారు నగరంలోని ఓ భవన నిర్మాణ సంస్థకు చెందిన చైతన్య. వీటిని ఇప్పుడు డిజైనర్ బాత్ రూమ్ స్పేసెస్ అని వ్యవహరిస్తున్నారు అని అన్నారాయన.
ఒత్తిడి చిత్తు.. రీచార్జ్ ఎత్తు..
‘బాత్‌రూమ్స్ అంటే కొత్త ఐడియాలకు పుట్టినిల్లు’ అని చెప్పారు ఓ స్టార్టప్ కంపెనీ యజమాని సందీప్. అంతేకాదు ఇవి ఐ కెన్ డూ అనిపిస్తాయి. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అని వెన్ను తడతాయి. నెగెటివ్ ఆలోచనల్ని నురగతో పాటు కొట్టుకుపోయేలా చేస్తాయి. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్‌డ్ మైండ్‌ని అందిస్తాయని, మెదడులో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. స్విమ్మింగ్, జాగింగ్ వంటివాటితో వచ్చే లాభాలతో సమానంగా బాత్‌రూమ్ పనిచేస్తుంది.
గతంలో బాత్‌రూమ్స్ నిర్లక్ష్యానికి గురి అయిన ప్లేసులు. అయితే ప్రస్తుతం వీటికి బాగా ప్రాధాన్యం పెరిగింది. విశాలంగా అవసరమైన అన్ని సౌకర్యాలు, ఫిట్‌మెంట్స్ ఏర్పరచుకుంటున్నాయి. ఇందులో భాగంగా తడి, పొడి ప్రదేశాలుగా బాత్ రూమ్‌ని రెండు భాగాలుగా విభజిస్తారు. వెట్ ప్లేస్‌లో షవర్, టబ్‌లు ఉంటాయి. గ్లాస్‌తో విభజించి మరో భాగంలో శానిటరీ, వాష్ బేసిన్, మిర్రర్.. ఉంటాయి.
హైలెట్ టైల్స్ : బాత్‌రూమ్‌లో ఒక ప్లేస్‌లో పెడితే బాత్‌రూమ్ మొత్తాన్ని హైలెట్ చేసే హైలైటర్స్‌లో వాల్ పేపర్స్/టైల్స్/మిర్రర్స్ ఉన్నాయి. ఇవి రూ.50 వేల నుంచి ధరల్లో అందుబాటులో ఉన్నాయి. బాత్‌రూమ్ ప్లేస్‌ని బట్టి ఖరీదు ఉంటుంది. కింద ఫ్లోరింగ్ చూస్తే అచ్చం వాటర్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓషన్ థీమ్‌లా లేదా మరే థీమ్ అయినా తీసుకోవచ్చు.
ప్లాంట్స్ : బాత్‌రూమ్‌లో వాల్‌కి పక్కన, లేదా బాత్‌టబ్ పక్కన ప్లాంట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. మంచి పరిమళాలు పంచే బోన్‌సాయ్ మొక్కలైన హైపర్ బోల్స్, సిల్క్ ఫ్లవర్, టైడ్ రిబ్బన్స్‌తో పాటు అలోవీరా, స్పైడర్ ప్లాంట్ వంటివి పాపులర్ అయ్యాయి. ఇవి రూ.10వేల నుంచి లభిస్తున్నాయి. బోన్సాయి అయితే రూ.25వేల నుంచి ప్రారంభమవుతాయి. గ్రీనరీ లుక్ కోసం విండో ప్లేస్‌లో ఐరన్ బదులు బ్యాంబూ పెడతారు. చిన్న చిన్న లైట్స్ దీనికి అమరుస్తారు.
వానిటీ : టవల్స్, షేవింగ్ కిట్స్, అవసరమైతే బుక్స్ పెట్టుకోడానికి బాత్‌రూమ్‌లోనే వార్డ్‌రోబ్స్ పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు హోటల్స్‌కి పరిమితమైనవి.. ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చేశాయి.
జెట్ మసాజెస్ : ఇవి అమర్చుకుంటే మన మీద పడే నీళ్లతోనే మనకు మసాజ్ అనుభూతి కలుగుతుంది. నీళ్ల వేగానికి శరీరం రిలాక్స్ అవుతుంది. షవర్ ప్యానెల్‌లో లేదా టబ్‌లో అయితే అడుగున లేదా ఇరుపక్కల అమరుస్తారు. వాటర్ ప్రెజర్‌ని మనం తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. రూ.15వేల నుంచి వీటి ధర మొదలవుతుంది. అయితే నిర్మాణ సమయంలో ముందస్తు ప్లాన్స్ చేసుకుని గోడలో ఉండే పైప్‌లోనే ప్రెషర్ వాల్ ఉండేలా చూడాలి.
ఇ–టబ్స్ : బాత్‌రూమ్ టబ్స్‌లో రేడియో, ఎఫ్‌ఎం, బ్లూటూత్, మొబైల్ కాలింగ్ కూడా ఉంటాయి. టబ్‌కి రైట్‌సైడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. నీళ్లలో తడిచినా ఆ టచ్‌స్క్రీన్‌కు ఏమీ కాదు. ఇది టబ్‌తో పాటు కలిపి వస్తుంది. దీన్ని తర్వాత ఫిట్ చేసుకోవడం కుదరదు. ఇవి రూ.2లక్షల నుంచి మొదలువుతాయి.
స్ట్రిప్ లైట్స్ : సీలింగ్‌లో లైటింగ్ కోసం మిర్రర్ కానీ స్ట్రిప్ లైట్స్ కానీ ఎక్కువగా వినియోగిస్తారు. దీని వల్ల కొంచెం ఎక్కువ వెలుగు వస్తుంది. సీలింగ్ కోసం 3డీ వాల్‌పేపర్స్ కూడా వాడుతున్నారు. చూడడానికి టేకు చెక్కతో చేసినవిలా అనిపించే డబ్ల్యూపీవీసీ సీలింగ్ ప్యానెల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకరకమైన ప్లాస్టిక్ తరహాలో ఉండే ఇవి రిమూవబుల్ కూడా.
సిరి ఉంటే ఆవిరి : మరింత రిలాక్సేషన్
కోసం. స్టీమ్‌బాత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. స్టీమ్ ఉంటే ఫాల్స్ సీలింగ్ చేయించకూడదు. త్రీడీ వాల్ పేపర్స్, టైల్స్ మాత్రమే వాడతారు. వీటినే జకోజీ బాత్‌రూమ్స్‌గా పిలుస్తున్నారు. వీటి విలువ కనీసం రూ.5లక్షల నుంచి మొదలవుతుంది. స్టీమ్ బాత్, షవర్ ఏరియా, జెట్స్ మసాజ్ అన్నీ కలిపి షవర్ యూనిట్ అంటారని చెప్పారు నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ కాత్యాయని..