Health: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్‌ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో.. | Sakshi
Sakshi News home page

Health Tips: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్‌ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో..

Published Wed, Nov 16 2022 12:13 PM

Health Tips: Mammogram Can Be Used To Diagnosis Heart Disease - Sakshi

Health Tips- Mammogram- Heart Disease: నలభై ఏళ్లు దాటాక మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పును ముందే తెలుసుకునేందుకు మామోగ్రామ్‌ చేయించుకొమ్మని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టి రిస్క్‌ ఉన్న చాలామంది ఇటీవల డాక్టర్ల సిఫార్సుతో ఏడాదికో లేదా రెండేళ్లకో ఈ పరీక్ష చేయించుకోవడం పరిపాటి అయ్యింది.

ఇక కొద్దిరోజుల్లోనే మామోగ్రామ్‌ చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ ముప్పుతో పాటు... గుండెజబ్బుల ముప్పు అందునా ప్రత్యేకంగా గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు బిరుసుగా మారే అథెరో స్క్లిరోసిస్‌ కార్డియో వాస్క్యులార్‌ డిసీజ్‌  గురించి కూడా తెలిసిపోయే అవకాశం రానుంది. ఫలితంగా కేవలం ఒకే పరీక్షతో రెండు మూడు రకాల సమస్యల గుట్టుమట్లు  తెలిసిపోనున్నాయి. ఆ వివరాలివి... 

మన దేశంలో ప్రతి వేయి మంది మహిళల్లో ఇద్దరికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రతి వందమందిలో 11 మందికి రొమ్ముల్లోని రక్తనాళాలు సైతం గట్టిగా బిరుసుబారిపోయి బ్రెస్ట్‌ ఆర్టీరియల్‌ క్యాల్సిఫికేషన్‌ జరిగే అవకాశముంది. అలాగే రొమ్ముల్లోని రక్తనాళాలతో పాటు ఇతర రక్తనాళాల్లోనూ క్యాల్షియమ్‌ చేరడంవల్ల, అవి ఫ్లెక్సిబుల్‌గా కాకుండా గట్టిగా, బిరుసుగా మారే అవకాశాలుంటాయి.

ఇలా జరగడం వల్ల ‘కార్డియో వాస్క్యులార్‌ డిసీజ్‌’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ఆర్టరీల్లో ఈ పరిణామం చోటు చేసుకుంటే అవి బిరుసెక్కిపోయి గుండెకు సరిగా రక్తం అందనందున ‘గుండెపోటు’ వచ్చే రిస్క్‌ ఉంటుంది. ఇలా రక్తనాళాలు బిరుసుబారడాన్ని ‘అథెరోస్లి్కరోటిక్‌ కార్డియో వాస్కులార్‌ డిసీజ్‌’ అని కూడా అంటారు. 

రెండు జబ్బుల గురించి తెలిసేది ఇందుకే/ఇలాగే...  
మామోగ్రామ్‌తో రొమ్ముక్యాన్సర్‌ ఎలాగూ తెలుస్తుంది. దాంతోపాటు గుండెజబ్బుల ముప్పు ఎలా తెలుస్తుందో తెలియాలంటే రక్తనాళాల గురించి కాస్త అవగాహన అవసరం. రక్తనాళం ఎటుపడితే అటు ఒంగిపోయేలా చాలా మృదువుగా, సరళంగా ఉంటుంది. రక్తప్రవాహానికి వీలుగా రక్తనాళం అలలు అలలుగా కదులుతుంటుంది.

మణికట్టు దగ్గర నాడి పట్టుకుని చూసినప్పుడు తెలిసే విషయం నిజానికి అలలు అలలుగా కదిలే రక్తనాళమే. దీన్నే ‘పల్స్‌’గా మనం చెప్పుకుంటాం. రక్తనాళం ఇలా మృదువుగా ఉండితీరాలి. అప్పుడే రక్తప్రవాహంలోని ఒడిదుడుకులకు తట్టుకోవడం, ఒక్కోసారి రక్తప్రవాహ వేగం పెరిగినా చాలావరకు తట్టుకోవడం జరుగుతుంది.

ఈ రక్తనాళం మూడు పొరలతో నిర్మితమై ఉంటుంది. రక్తం ప్రవహించే లోపలి పొరను ‘ఇంటిమా’ అనీ, మధ్యపొరను ‘మీడియా’ అనీ, బయటి పొరను ‘అడ్వంటీషియా’ అని అంటారు. రక్తం ప్రవహించే సమయంలో జరిగే ప్రమాదాల వల్ల అప్పుడప్పుడూ ‘ఇంటిమా’ దెబ్బతింటుంది. కానీ మన శరీరంలో ఏ భాగమైనా దెబ్బతింటే దాన్ని రిపేరు చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది. 

ఈ క్రమంలో ఇలా రిపేర్‌ జరిగే సమయంలో ఒకవేళ ఇంటిమాలోని దెబ్బతిన్న భాగం కొవ్వులతో (లైపిడ్స్‌తో) రిపేర్‌ అయితే అక్కడ క్రమంగా కొవ్వు పాచిలా పేరుకుపోయి, ఉండలాగా మారి రక్తప్రవాహానికి అడ్డుపడవచ్చు. ఒకవేళ పీచు కణాలతో రిపేర్‌ జరిగితే, అక్కడ సన్నబారి పోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని ‘స్టెనోసిస్‌’ అంటారు.

ఒకవేళ రిపేర్‌ సమయంలో ఆ భాగంలో క్యాల్షియమ్‌ పేరుకుపోతే... మృదువుగా ఉండాల్సిన రక్తనాళం గట్టిగా బిరుసెక్కి ఎటూ వంగని గట్టి పైప్‌లా మారుతుంది.  వీటిల్లో ఏది జరిగినా రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలా వచ్చే రక్తనాళాల సమస్యనే అథెరోస్కి›్లరోసిన్‌ అంటారు. ఒకవేళ ఇవి గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ఆర్టరీలో జరిగితే... గుండెకండరానికి పోషకాలు, ఆక్సిజన్‌ అందక గుండెపోటు వస్తుంది. 

మామోగ్రామ్‌తోనే గుండె, రక్తనాళాల పరీక్షలిలా... 
మామోగ్రామ్‌ సహాయంతో రొమ్ములోని రక్తనాళాల్లో క్యాల్షియమ్‌ చేరడాన్ని (బ్రెస్ట్‌ ఆర్టీరియల్‌ క్యాల్సిఫికేషన్‌) కూడా గుర్తించవచ్చు. నిజానికి... రొమ్ము కండరాల్లోని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగే క్యాల్సిఫికేషన్‌ను అంచనా వేసేందుకు అవకాశముందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరిగాయి.

దానివల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండటంతో పాటు, కేవలం ఒక పరీక్షకు అయ్యే ఖర్చుతోనే రెండుమూడు అంశాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ  వైద్యశాస్త్రవేత్తలు, అధ్యయనవేత్తలు ఈ ప్రయత్నాలు చేశారు. మామోగ్రామ్‌ నిర్వహించినప్పుడు ఆ పరీక్ష తాలూకు స్కోర్స్‌తోనే... రాబోయే ముప్పు ఏదీ లేదు అనీ, హానికరం కాని గడ్డలు రావచ్చనీ, క్యాన్సర్‌ ముప్పు ఉందనీ.. ఇలా అంచనా వేస్తుంటారు.  

అయితే అదే పరీక్షతో వచ్చే క్యాల్షియం స్కోర్‌ ఆధారంగా కొన్ని దేశాల్లో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని క్యాల్సిఫికేషన్‌ను సైతం తెలుసు కున్నారు. రక్తనాళాలు గట్టిబారడం వల్ల వచ్చే కార్డియోవాస్క్యులార్‌ డిసీజ్, అథెరో స్క్లిరోటిక్‌ కార్డియోవాస్క్యులార్‌ డిసీజ్‌తో పాటు గుండెపోటుకు గల అవకాశాలనూ లెక్కగట్టారు. ఈ లెక్కల ద్వారా ఇప్పటికే స్వీడన్‌లో ఒక్క మామోగ్రామ్‌ పరీక్షతోనే ఇటు రొమ్ముక్యాన్సర్‌ ముప్పునూ, అటు కార్డియో వాస్క్యులార్‌ జబ్బు / గుండెపోటు ముప్పునూ తెలుసుకోగలుగుతున్నారు. 

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యక్తులూ, మరెన్నో దేశాల ప్రజల్లో అందరికీ సరిపోయేలాంటి ప్రామాణికత ఇంకా సాధించనందున ఈ పరీక్షలు అన్ని దేశాల్లోనూ జరగడం లేదు. కానీ ప్రామాణికతలు రూపొందించడం కోసం విరివిగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇవి నేడో, రేపో సాకారం కానున్నాయి కూడా. ఇదే జరిగితే... కేవలం మరికొద్ది రోజుల్లోనే మన దేశంలోనూ కేవలం మామోగ్రామ్‌ అనే ఒక్క పరీక్షతోనే రొమ్ముక్యాన్సర్‌ ముప్పులూ, రక్తనాళాల ఆరోగ్య పరిస్థితి, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల ఆరోగ్యం, గుండెపోటుకు గల రిస్క్‌... ఇవన్నీ తెలిసిపోనున్నాయి.                                           

రక్తనాళం ఆరోగ్యాన్ని తెలుసుకునే పరీక్షలివి... 
కెరోటిడ్‌ డాప్లర్‌ అనే పరీక్షతో దేహంలోని రక్తనాళాల పరిస్థితిని, ఇంటిమా తాలూకు ఆరోగ్యాన్ని పరోక్షంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. మూత్రపిండాల వంటి అతి సున్నితమైన, దేహంలో చాలా లోపలికి ఉండే కీలక అవయవాల రక్తనాళాల కండిషన్‌ను నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉండదు.

అందుకే మెడకు ఇరువైపులా ఉండే ‘కెరోటిడ్‌’ రక్తనాళాలను పరీక్షించడం ద్వారా లోపలి కీలక అవయవాల్లోని రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. అలాగే ఇక గుండెకు రక్తాన్ని అందించే నాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు యాంజియోగ్రామ్‌... ఇందులోనూ రేడియేషన్‌ వల్ల తెలుసుకునే సీటీ యాంజియో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

అటు కెరోటిడ్‌ డాప్లర్‌గానీ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలను తరచూ చేయించడానికి అంతగా అవకాశం ఉండదు. కానీ మహిళల విషయానికి వస్తే వారిలో మామోగ్రామ్‌ పరీక్ష మాత్రం తరచూ చేయించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది.

క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్‌ ఫ్యాక్టర్లు... 
కొన్ని ఒకేలాంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఇటు క్యాన్సర్‌కూ, అటు గుండెజబ్బులకూ కారణమవుతాయి.
ఉదా: పెరిగే వయసు, స్థూలకాయం, హైబీపీ, అదుపులో లేని డయాబెటిస్‌ లాంటివి... ఇటు క్యాన్సర్‌నూ, అటు గుండెజబ్బులనూ తెచ్చిపెట్టవచ్చు. పెరిగే వయసు లాంటి మన ప్రమేయం లేని వాటిని మినహాయించి, మిగతా అంశాలను నివారించడం లేదా అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్‌నూ, గుండెపోటునూ, రక్తనాళాల సమస్యలనూ నివారించుకోవచ్చు.

మిగతా సమస్యలెలా ఉన్నా రెండో దశ దాటిపోతే క్యాన్సర్‌ ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఒకవేళ అది రొమ్ముక్యాన్సర్‌ అయితే దాన్ని మొదటి లేదా రెండో దశలో తెలుసుకుంటే దాన్ని సమూలంగా నయం చేసుకునే వైద్యపరిజ్ఞానం ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది.

అందుకే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ చరిత్ర ఉండటం, అందునా తల్లి లేదా తల్లిగారి అక్కచెల్లెళ్లలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉండటం, బీఆర్‌సీఏ వంటి జన్యుపరీక్షల్లో క్యాన్సర్‌ ముప్పు ఉన్నట్లు తేలడం వంటివి జరిగితే... నిర్దిష్ట సమయాల్లో మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకొమ్మంటూ డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు మహిళలు తరచూ ఆ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. 
-డాక్టర్‌ సురేశ్‌ ఏవీఎస్‌, సీనియర్‌ మెడికల్‌ , ఆంకాలజిస్ట్

చదవండి: What Is Varicose Veins: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే
దుర్వాసన లేకుండా బాత్‌రూమ్‌ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్‌ అంటూ పారిపోతారు మరి..

Advertisement
 
Advertisement
 
Advertisement