Tips For Diabetes Patients: పండగ తీపిని చంపుకోనక్కరలేదు

Health Tips For Diabetes Patients During Sankranti Festival - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఉన్నారు. మరోవైపు ఇంకా కోవిడ్‌ ప్రమాదం ఒమిక్రాన్‌ రూపంలో విజృంభిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధి ఉన్న వారు మరింత భయంతో జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక, అలాగని మిఠాయిలు తింటే ఏమవుతుందో ఏమో అనే భయంతో తినలేక భయపడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్‌ ఉన్న వారు కూడా పండుగ తీపిని ఆస్వాదించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.పండగ మాధుర్యాన్ని మూట కట్టుకుందాం... 

పండుగల సీజన్‌ వచ్చిందంటే జీవితంలో జిహ్వకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలిసొస్తుంది. అంతేనా... దాని ప్రభావం ఏమిటో అర్థం అయ్యేది అప్పుడే. రకరకాల వంటకాల ఘమఘమలు ఇల్లంతా పరుచుకోకపోతే పండుగ పరిపూర్ణం కాదని భావించని వారు ఉండరు. మరిప్పుడు తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రకరకాల పిండివంటలు వండుకోవడం, అరిసెలు, బూరెలు వంటి వాటిని పెద్ద ఎత్తున చేసుకుని పరస్పరం పంచుకోవడం సర్వసాధారణం. అయితే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాధి నిరోధక సామర్ధ్యాన్ని కాపాడుకోవడం ఇంకా అవసరం. 

మక్కువైనా తక్కువగా...
అరిసెలు, బూరెలు, గారెలు, సకినాలు, కజ్జికాయలు...ఇంకా మరెన్నో ఇష్టమైన వంటకాలను చేస్తే నియంత్రించుకోవడం కష్టం. కాబట్టి వీలున్నంత వరకు తక్కువ పరిమాణంలో వండుకోవడం మంచిది.  పిండి వంటల్ని పండుగకు ఒక్కసారే చేసుకుని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచడం సహజంగా చేస్తుంటారు. అలా ఉంచే సమయంలో వాటిని సరైన చోట, సరైన విధంగా నిల్వ చేయాలి. అలాగే కొన్ని రోజుల పాటు పాడవకుండా ఉండాలన్నా, కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా అనారోగ్యం కలుగకుండా ఉండాలన్నా.. వండేటప్పుడు నాణ్యమైన ముడిదినుసులు, ముఖ్యంగా దాదాపుగా అన్నీ ఆయిల్‌ వంటకాలే కాబట్టి, సరైన నూనెలు ఉపయోగించడం తప్పనిసరి. 

పిల్లల ముందు రకరకాల చాకెట్లు ఉంచి, తినవద్దంటే ఎంత ఇబ్బంది పడతారో, మధుమేహం ఉన్నవారికి కూడా ఇంట్లో స్వీట్లు చేసినప్పుడు జిహ్వను చంపుకోవడం అంతే మరి! ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే.. అందరిలా స్వీట్లను ప్లేటులో పెట్టుకోకూడదు. ఒక స్వీట్‌ను ఆస్వాదిస్తూ కొద్ది కొద్దిగా తీసుకోవాలి. స్వీటు తిన్నప్పుడు దానికి తగ్గ శారీరక శ్రమ చేయడమో లేదంటే ఆ మేరకు అన్నం తక్కువ తినడం ఉత్తమం. అలా కాకుండా అన్నం మామూలుగానే తినేసి, దానికితోడు స్వీట్లు కూడా లాగించేస్తే కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే! పంచదార కన్న బెల్లంతో చేసినవి, బెల్లం పాకంతో కాకుండా ఆర్గానిక్‌ బెల్లం పొడితో తయారు చేసినవి బెటర్‌. 

డ్రై ఫ్రూట్స్‌తో భర్తీ చేసుకోవాలి: తీపి తక్కువగా తినవలసిన అవసరం ఉన్నవారు ఖర్జూర పండు, తేనెతో, డ్రైఫ్రూట్స్‌తో లడ్డూ తయారు చేసుకుని తినవచ్చు. బీపీ ఉన్న వారు సాధారణ టేబుల్‌ సాల్ట్‌ బదులు రాక్‌సాల్ట్‌ లేదా సైంధవలవణం వాడటం కొంత మెరుగు. 

ఇంటిలోనే పిండివంటలు చేసుకునే ఓపిక లేనివారు షాప్స్‌లో కొనుగోలు చేసే సమయంలో ఎక్కడ పడితే అక్కడ, ఏవి పడితే అవి కొని తెచ్చుకోకూడదు. మొహమాట పడకుండా ఆయా పదార్థాల తయారీకి వాళ్లు వినియోగించిన నూనెల గురించి అడిగి తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్స్‌ వాళ్లూ ఆరోగ్య అవగాహనను దృష్టిలో పెట్టుకుని నాణ్యతాపరంగా తాము పాటిస్తున్న ప్రమాణాలను వెల్లడిస్తున్నారు.  

బీపీ ఉన్నవారు ఆహార పదార్థాలలో పులుపు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పులుపు పెరిగిన కొద్దీ ఆ మేరకు ఉప్పు, కారం వేసే పాళ్లు కూడా పెరుగుతాయని గుర్తుంచుకుని మరీ చప్పిడివి తినడం కన్నా కొద్దిగా మెరుగ్గా తింటున్నామని సంతోషించాలి. 

జాగ్రత్తలు పాటిస్తూ పిండివంటలు పరిమితంగా ఆస్వాదిస్తూ తగినంత వ్యాయామం కూడా చేయాలి. శరీరానికి ఒక్కసారిగా అధికంగా అందిన కేలరీలు ఖర్చయేందుకు శారీరక శ్రమ తప్పనిసరి. పండుగలు ఏటేటా వస్తాయి... ఆరోగ్యం కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం అంత సులభం కాదని గుర్తుంచుకోవాలి.                                                                          

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top