
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్‌లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్‌కి కారణమవుతోంది.
‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్‌లైన్.
ఆ పాపం వీకెండ్ దే...
వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్‌కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్‌ని సృష్టిస్తోంది.
సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది.
ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్...
వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం..
ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది.
మానసికమే కాదు, అంతకు మించి...
కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.
పరిష్కారం..సైకాలజిస్ట్‌ల కొన్ని సూచనలు..
ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి.
వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు.
శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్‌ను దూరం చేస్తుంది.
ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్‌లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది.
మరోవైపు..
సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు.
ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం.