పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...

Health: Causes For Hair Loss In Children How To Prevent By Dermatologist - Sakshi

చిన్నపిల్లల్లో అంటే ఐదేళ్లు మొదలుకొని... ఎనిమిది, తొమ్మిదేళ్ల పిల్లల్లో జుట్టు రాలిపోవడం కాస్తంత తక్కువే అయినా మరీ అంత అరుదేమీ కాదు. నిజానికి ఆ వయసులో క్రమంగా జుట్టు దట్టమమవుతూ ఉంటుంది. అలాంటి వయసులోనూ పిల్లల్లో జుట్టు రాలుతుండటానికి కారణాలు, వాటి నివారణ మార్గాలు తెలిపే కథనమిది. 

జుట్టు రాలడం అనే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘టీలోజెన్‌ ఎఫ్లువియమ్‌’ అంటారు. పిల్లల్లో ఇలా జుట్టు రాలడం అనేది నిర్దిష్టంగా ఒక భాగంలో (లోకల్‌గా) జరగవచ్చు దీన్ని ‘అలోపేషియా ఏరేటా’ అంటారు. నిజానికి వెంట్రుకలు పాటించే సైకిల్‌ కారణంగా జుట్టులో కాస్త భాగం నిద్రాణంలోకి వెళ్లడం, మరికొంత రాలిపోవడం రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియే.

ఇలా పిల్లల్లో రోజూ 30 నుంచి 40 వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటే... దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించి అంటే 80 – 100 వరకు వెంట్రుకలు రాలుతుంటే మాత్రం దాన్ని కాస్త సీరియస్‌గా జుట్టురాలడం (సిగ్నిఫికెంట్‌ హెయిర్‌ లాస్‌)లాగే పరిగణించాలి. 

సాధారణ కారణాలు :  
►అన్నిటికంటే పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టిక ఆహార  (ప్రోటిన్‌ మాల్‌న్యూట్రిషన్, ఐరన్, జింక్‌తో పాటు ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) లోపాల వల్ల కావచ్చు. ఇదే కారణమైతే పిల్లలకు ఐరన్, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారంతో పరిస్థితి చక్కబడుతుంది.

►అలా కాకుండా కొన్ని మెకానికల్‌ సమస్యల  (అంటే... జడలు బిగుతుగా వేయడం, బిగుతైన క్లిప్పులు పెట్టడం)వంటి కారణాలతోనూ జుట్టు రాలవచ్చు. ఆ వయసు పిల్లల్లో మరీ బిగుతుగా కాకుండా కాస్త తేలిగ్గా ఉండేలా జడలల్లడం వల్ల ఈ సమస్యని చాలా తేలిగ్గా నివారించవచ్చు. 

►కొంతమంది పిల్లల్లో జ్వరాలు (డెంగీ, మలేరియా, కోవిడ్‌ వంటివి) వచ్చి తగ్గాక కూడా మూడు నుంచి నాలుగు నెలల తర్వాత జుట్టు రాలడం కూడా జరగవచ్చు. దీన్ని పోస్ట్‌ వైరల్‌ ఫీవర్‌ ఎఫెక్ట్‌గా పరిగణించాలి. 

కొన్ని నిర్దిష్ట కారణాలు
►పైన పేర్కొన్న సాధారణ కారణాలు మినహాయిస్తే... చిన్న వయసు పిల్లల్లో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు పుట్టుకతోనే వచ్చే కారణాలు (కంజెనిటల్‌ కాజెస్‌), ఇన్ఫెక్షన్లు (అంటే... కొన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, పయోడెర్మా లాంటివి), తలలో పేలు పడటం, ఇతర అనారోగ్యల కారణంగా మందులు వాడుతున్నప్పుడు అవి వారికి సరిపడక కూడా జుట్టు రాలిపోవచ్చు. 

►ఇక మరికొందరు పిల్లల్లో హార్మోన్ల అసమతౌల్యత (హైపోథైరాయిడ్, పారాథైరాయిడ్, చైల్డ్‌ డయాబెటిస్‌) లాంటి సమస్య వల్ల కూడా జుట్టు రాలవచ్చు. వీటిని పక్కన పెడితే పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. ఇలా పిల్లల్లో మానసిక ఒత్తిడి వల్ల కూడా జట్టు రాలిపోవచ్చు. 

ఏం చేయాలి?
►మంచి పౌష్టికాహారం ఇవ్వడం,  పిల్లలు బాగా ఆడుకునేలా చూస్తూ... మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండేలా చేయడం వంటి సాధారణ చర్యలతోనూ సమస్య చక్కబడకపోతే,  అప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. 
-డాక్టర్‌ స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌

చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్‌ హెయిర్‌.. పీసీఓఎస్‌ వల్లేనా? పరిష్కారం? 
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్‌ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top