Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్‌ హెయిర్‌.. పీసీఓఎస్‌ వల్లేనా? పరిష్కారం?

Why Women Get Unwanted Hair on Upper Lip How To Overcome: Gynecologist - Sakshi

డాక్టర్‌ సలహా

నాకు 26 ఏళ్లు.  సడెన్‌గా అన్‌వాంటెడ్‌ హెయిర్‌ ప్రాబ్లమ్‌ మొదలైంది. పీరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి. అయినా ఇలా పై పెదవి మీద, చుబుకం కింద, చెంపలకు డార్క్‌గా హెయిర్‌ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి ప్లీజ్‌! –  మాన్విత, హైదరాబాద్‌

అన్‌వాంటెడ్‌ హెయిర్‌ని హర్సుటిజమ్‌ (Hirsutism)అంటారు. శరీరంలో ఆండ్రోజెన్‌ స్థాయి పెరిగినప్పుడు ఇలా సడెన్‌గా మొహం, ఛాతి, పొత్తి కడుపు మీద, వీపు, తొడల మీద ఇలా డార్క్‌గా హెయిర్‌ వస్తుంది.ఈ సమస్య కనపడగానే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్‌  లేదా స్కిన్‌ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. 

సాధారణంగా పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్లలో ఇలా అన్‌వాంటెడ్‌ హెయిర్‌ ప్రాబ్లమ్‌ను చూస్తాం. అయితే ఈ పీసీఓఎస్‌లో నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం వంటి సమస్యలూ ఉంటాయి. కుషింగ్‌ సిండ్రోమ్‌ అనే కండిషన్‌లో కాటిసాల్‌ (Cartisol) స్థాయి పెరిగి అవాంఛిత రోమాల సమస్య వస్తుంది. స్టెరాయిడ్స్‌ ఎక్కువ రోజులు వాడినా ఈ సమస్య తలెత్తవచ్చు.

క్రీమ్స్‌ వాడుతున్నట్టయితే
కేశ, చర్మ సంరక్షణకు సంబంధించిన మినాక్సిడిల్, డనేజోల్‌ వంటి మందుల వల్లా ఈ సమస్య రావచ్చు. మీరు స్కిన్‌ కోసం ఏవైనా క్రీమ్స్‌ వాడుతున్నట్టయితే ఒకసారి దాని కంపోజిషన్‌ చెక్‌ చేసుకోండి. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మీ హెల్త్‌ హిస్టరీలో పైన వివరించిన కండిషన్స్‌ గురించి తెలుసుకుంటారు. కొన్ని రక్తపరీక్షలు చేసి టెస్టోస్టిరాన్‌ స్థాయి, ఆండ్రోజెన్‌ స్థాయిలను చెక్‌ చేస్తారు. 

అబ్డామిన్‌ స్కాన్‌ చేసి.. అడ్రినల్‌ గ్లాండ్‌లో ఏవైనా గడ్డలున్నాయా అని కూడా చెక్‌ చేస్తారు. కొన్నిసార్లు సీటీ స్కాన్‌ అవసరం కావచ్చు. ఇవన్నీ లేవని తేలి.. నెలసరి క్రమం తప్పకుండా వస్తూంటే.. తాత్కాలిక హెయిర్‌ రిమూవల్‌ సొల్యూషన్స్‌ను సూచిస్తారు. కొంతమందికి గర్భనిరోధక మాత్రలు, స్పైరనోలాక్టోన్‌ వంటి మందులు ఇస్తారు.

శాశ్వత చికిత్స అవసరం లేదు
ఎండోక్రైన్‌ అంటే హార్మోన్‌ సమస్య లేకపోతే అవాంఛిత రోమాలకు శాశ్వత చికిత్స అవసరం లేదు. ఉన్న కండిషన్, సమస్యకు తగ్గట్టుగా చికిత్సను అందించాలి. ట్రీట్‌మెంట్‌ ప్రభావం కనిపించడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల టైమ్‌ పడుతుంది.

ప్రెగ్నెన్సీతో ఉన్నా.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నా ఈ ట్రీట్‌మెంట్‌ను తీసుకోకూడదు. అవాయిడ్‌ చేయాలి. చాలామందిలో ఏ ఆరోగ్యసమస్య లేకుండా కూడా ఈ అన్‌వాంటెడ్‌ హెయిర్‌ రావచ్చు. అలాంటివారు లేజర్, ఎలక్ట్రాలిసిస్‌ వంటి హెయిర్‌ రిమూవల్‌ ఆప్షన్స్‌ గురించి ఆలోచించవచ్చు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌   
చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top