మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్‌లో స్కాల్ప్‌ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్‌లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్‌కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...
మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...
మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.
చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి...
1. పొడి చర్మం (డ్రై స్కిన్)
2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)
3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)
పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.
జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...
‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా...
మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్‌కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.
ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...
జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.
తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.
జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.
మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...
మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్‌లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.
ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.
మాడు విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలంటే...
ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...
మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటం
ఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడం
మాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడం
మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్‌లో పెచ్చులు వస్తున్నప్పుడు
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.
అపోహలూ... వాస్తవాలు
మంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.
ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?
ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్‌గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.
ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు...
ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి.
ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...
ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...
మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్‌గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్‌గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.
స్కాల్ప్‌పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.
చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్‌మెంట్‌లాగా వాడుకోవచ్చు.
జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.
ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.
హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా?
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్‌తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.
హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన...
అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్‌గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్‌తో తయారైన మృదువైన కర్చిఫ్‌లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్‌నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్‌ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.
చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్
నిర్వహణ : యాసీన్


