Gaurav Rai: ఆక్సిజన్‌ మ్యాన్‌

Gaurav Rai gives oxygen for free to Corona patients - Sakshi

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌.. మరో కోణంలో సమాజంలో అడుగంటిన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరోనా కారణంగా ఎదురవుతోన్న సమస్యలకు ఒకరికొకరు సాయమందించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్‌ రాయ్‌ కరోనా పేషంట్లకు ఆక్సిజన్‌  అందిస్తూ వందలమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. ‘‘కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆక్సిజన్‌  లెవల్స్‌ పడిపోతాయి. దీంతో ఆక్సిజన్‌ సిలిండర్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’. ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించిన గౌరవ్‌.. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అని భావించి ఆక్సిజన్‌  సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ‘ఆక్సిజన్‌  మ్యాన్‌ ’గా అందరి మన్ననలను పొందుతున్నారు.

గతేడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌  కొనసాగుతున్న సమయంలో గౌరవ్‌ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అతనికి ఆసుపత్రిలో అడ్మిట్‌ అవ్వడానికి బెడ్‌ దొరకలేదు. దీంతో గౌవర్‌ కరోనా పేషంట్లు ఉన్న వార్డులో మెట్ల పక్కన పడుకున్నాడు. పడుకోవడానికి కాస్త స్థలం దొరికినప్పటికీ.. కరోనాతో అతని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. వెంటనే ఆక్సిజన్‌  సిలిండర్‌ పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క సిలిండర్‌ కూడా దొరకలేదు. ఓ ఐదుగంటల తర్వాత గౌరవ్‌ భార్య నానా తంటాలు పడి ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గౌరవ్‌ నెమ్మదిగా కోలుకుని బయటపడ్డారు. సిలిండర్‌ దొరకక తాను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్న గౌరవ్‌ ఆక్సిజన్‌  సిలిండర్లు సరఫరా చేయాలనుకున్నారు.

ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తున్న గౌరవ్‌ రాయ్‌

అనుకున్న వెంటనే గౌరవ్‌ దంపతులు తమ సొంత డబ్బులతో వాళ్ల ఇంటి బేస్‌ మెంట్‌ లో చిన్న ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రోజు ఆక్సిజన్‌  సిలిండర్లు అవసరమైన వారికి గౌరవ్‌ తన వ్యాగ్నర్‌ కారులో తీసుకెళ్లి ఇవ్వడం ప్రారంభించారు. ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఉన్న గౌరవ్‌ స్నేహితులు ఆక్సిజన్‌ బ్యాంక్‌ గురించి ప్రచారం చేయడంతో అవసరమైన వారందరూ గౌరవ్‌కు కాల్‌ చేసేవారు. వారికి సిలిండర్లను ఉచితంగా ఇచ్చి, ఆ పేషెంట్‌ కోలుకున్నాక మళ్లీ వెళ్లి సిలిండర్‌ను వెనక్కు తీసుకొచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోక పోవడం విశేషం. ప్రారంభంలో ఆక్సిజన్‌  బ్యాంక్‌ పది సిలిండర్లతో ప్రారంభమై నేడు 200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు విరాళాల రూపంలో గౌరవ్‌కు సాయం చేస్తున్నారు.

తెల్లవారుజామున ఐదుగంటలకే లేచి..
ప్రారంభంలో గౌరవ్‌ తనుండే అపార్టుమెంటు లో అవసరమైన వారికి ఆక్సిజన్‌  సిలిండర్లు ఇచ్చేవారు. సిలిండర్‌ కావాలని కాల్స్‌ పెరగడంతో తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అర్ధరాత్రి వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఇప్పటిదాక దాదాపు వేయ్యిమందికి సిలిండర్లను సరఫరా చేశారు. క్రమంగా సిలిండర్ల సంఖ్య పెంచుతూ బిహార్‌లోని 18 జిల్లాల్లోని కరోనా పేషంట్లకు సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top