
ప్రకృతిని కొలువు తీర్చి, పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయేలా చేసే ఉత్సవం గణేశ్ చతుర్థి. ఇంట్లోనూ.. వీథుల్లోనూ గణేశ్ మూర్తుల నుంచి అలంకరణ వరకు ప్రతిదీ గ్రాండ్ గా తీర్చిదిద్దుతారు. అయితే, గణేశుడు అంటేనే ప్రకృతి కాబట్టి పండగలోని ఆంతర్యం తెలుసుకొని, పర్యావరణానికి ప్రాముఖ్యం ఇచ్చేలా అలంకరణ చేద్దాం.
ఆకర్షణీయమైన మండపం అవసరమైనవి
పాలవెల్లి తయారీకి వెదురు బద్దలు, బ్యాక్‌డ్రాప్ కోసం జ్యూట్ ఫాబ్రిక్ లేదా పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్, మామిడి, అరటి ఆకులు, స్టేజ్ చుట్టూ వెలిగించడానికి మట్టి ప్రమిదలు, తాజా పువ్వులు ప్రధానంగా కావాల్సినవి.
ఇంట్లో కూడా వేదిక అవసరం కాబట్టి వెదురు బద్దలతో మండపాన్ని ఏర్పాటు చేయవచ్చు. సెంటర్ టేబుల్ లేదా టేబుల్ లేదా పీట వంటిది ఒకటి తీసుకొని, నాలుగు వైపుల వెదురు బద్దలను ఏర్పాటు చేసి, వేదిక సిద్ధం చేసుకోవాలి.
బ్యాక్‌డ్రాప్‌గా జ్యూట్ లేదా పెయింట్ చేసిన ఫాబ్రిక్ కట్టి, ఇరువైపులా పూలమాలలను, మామిడాకులను వేలాడదీయాలి.
వేదిక చుట్టూ మట్టి ప్రమిదలు వెలిగించి, లోపల మట్టి గణేశుని ఉంచాలి.
ఫెయిరీ లైట్స్ తోరణాన్ని వెదురు బద్దలకు అమర్చాలి. రాత్రిళ్ళు ఈ దీపాలు వెలిగితే చాలా క్లాసీగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది.
ఇల్లంతా వెలుగు
ఇంటి ప్రవేశ ద్వారం, ద్వారాలు, గోడలతో పాటు గణేశుడి ప్రధాన మండపాన్ని అందమైన పూలు, తీగలతో అలంకరింవచ్చు. ఎరుపు, పసుపు, పచ్చ రంగు కాంబినేషన్‌లో ఫ్యాబ్రిక్ తోరణాలు మరింత ప్రత్యేకతను ఇస్తాయి.
రంగోలీలో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూల రేకలు, వివిధ మోడల్స్‌లో ఉన్న ప్రమిదలను వెలిగించవచ్చు.
పేపర్ లాంతర్లను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. వీటికి అందమైన మోటిఫ్‌లను అతికించి, తమదైన సృజనాత్మకతను జోడించవచ్చు.
(చదవండి: గణపయ్యకు టెక్నో హారం!)