బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక! | Funday Story On Journalist Mandalaparthy kishore | Sakshi
Sakshi News home page

బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!

Apr 26 2026 1:56 AM | Updated on Apr 26 2026 1:56 AM

Funday Story On Journalist Mandalaparthy kishore

హంగేరియన్‌ భాషలో ‘కెర్తేజ్‌’ అంటే తోటమాలి అని అర్థం. 2002లో నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని పొందిన హంగేరియన్‌ రచయిత ఇమ్రా కెర్తేజ్‌ పేరులోని ఆ మాటకూ అదే అర్థం! యూరప్‌లోని హరిత దేశాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న హంగరీ అక్షర ఉద్యానంలో తొలి నోబెల్‌ పురస్కారాన్ని పూయించిన తోటమాలి ఇమ్రా కెర్తేజ్‌. అతని సాహిత్యం బొమ్మజెముడు పొద మీద నెత్తురు ముద్ద! తన సాహిత్యమంతటా, కెర్తేజ్‌ అనుభవించి పలవరించింది ఒకేఒక్క పీడకల. దాన్నే ‘హోలోకాస్ట్‌ నైట్‌మేర్‌’ అన్నారు తర్వాతి తరాలవారు. ఇది యూదులకూ, లౌకికవాదులకూ, ప్రగతిశీల రాజకీయపక్షాలకూ మరపురాని పీడకల. ఆ పీడకలలో కనిపించేవన్నీ తెగిన గాలిపటాలే! సంసార వృక్షం తాలూకు విరిగిపడిన కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయవి. గాలివాటుగా కొట్టుకుపోయే ఆ గాలిపటాలు తరచు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతుంటాయి. 

ఒకరో యిద్దరో ఈ స్థితి నుంచి బతికి బయటపడుతుంటారు. వారిలో ఒకరో యిద్దరో మాత్రమే ఎలాంటి ఉద్వేగం లేకుండా తమ కలతలూ కలవరాలను మనతో పంచుకుంటారు. కెర్తేజ్‌ అలాంటి ఒకరిద్దర్లో ఒకరు. అందుకే ఆయన రచనలు తేనుపొచ్చిన సలపరింతల్లా సాగుతుంటాయి! అలాంటి రచనలతో సామాన్య పాఠకులు తాదాత్మ్యం చెందలేరు. పరిణతి చెందిన కొద్దిమంది పాఠకులు మాత్రమే వాటితో అభేదావస్థ అనుభవించగలరు. అలాంటివాళ్ళలో కొందరు ‘నోబెల్‌ సాహిత్యపురస్కారం ఎంపిక సంఘం’లో సభ్యులుగా వున్నందువల్లనే కెర్తేజ్‌కు, 2002లో ఆ పురస్కారం దక్కింది!

రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా చరిత్రను పరిశీలిస్తే, భయంకరమైన వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. వలసవాదం కాడిబరువు వదిలించుకుని ఎన్నో దేశాలు– మన దేశంతో సహా– విముక్త వాయువులు పీల్చుకున్న సందర్భమది. వైజ్ఞానిక, తాత్త్విక, కళాత్మక రంగాలన్నింటా సౌమ్య, సౌహార్ద వీచికలు ప్రసరించిన యుగమది. మానవాళి చిరకాలంగా కంటూవచ్చిన జంటకలలు–స్వేచ్ఛా సమానత్వాలుగా– విశ్వకేదారంలో మొలకలెత్తిన ఘడియలవి. అయితే, ఆ యుద్ధ నేపథ్యంలోనే, ‘పుట్టుక ప్రాతిపదికగా జాతిమత వివక్ష’ పడగవిప్పి బుసకొట్టిన దుర్ముహూర్తమూ అదే! ఈ అమానుష వికారం తాలూకు అత్యంత వికృతరూపాన్ని ప్రదర్శించినవారిగా నాజీలు చరిత్రలో పాతుకుపోయారు. 

నాజీలు ఎదురులేకుండా పాలించిన జర్మనీకి పొరుగుదేశం కావడమనే ఏకైక పాపానికి గానూ, హంగరీకి కూడా వివక్ష జ్వాలలు పాకిపోయాయి. అప్పట్లో నాజీల చేతికి చిక్కిన పద్నాలుగేళ్ళ కుర్రాడు ఇమ్రా కెర్తేజ్‌. పుట్టుకతో యూదు మతస్థుడు కావడమే అతని నేరం. దానికే అతన్ని ఆష్విట్జ్, బుషెన్వాల్ట్‌›్జ నిర్బంధ శిబిరాల్లోకి తోసి చిదిమి పారేయాలనుకున్నారు నాజీలు. కానీ, అంతలోనే ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం– దానితోనే నాజీజం సహగమనం చెయ్యడం చకచకా జరిగిపోయాయి! అలా మృత్యువు నీడల్లోంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు కెర్తేజ్‌. అయితే బతికి బయటపడినందుకు అతను సంతసించిన దాఖలాలు ఆయన సాహిత్యంలో ఎక్కడా కానరావు! 
∙∙ 
నాజీ నిర్బంధ శిబిరాలన్నింట్లోకీ పెద్దది ఆష్విట్జ్‌. ఇది దక్షిణ పోలెండ్‌లో వుంది. పదకొండు లక్షల మంది అమాయకులైన పెద్దలూ పిన్నల ప్రాణాలను బలితీసుకున్న నరకకూపమిది. ప్రపంచ యుద్ధం ముగిసిన రెండేళ్ళకు, 1947లో ఆష్విట్జ్‌ను మ్యూజియంగా మార్చారు.నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత ఇమ్రా కెర్తేజ్, ఆష్విట్జ్‌ గురించి ఓ చోట ఇలా రాశారు:‘ఆష్విట్జ్‌ నిర్బంధ శిబిరంలో నేను అనుభవించిన నరకయాతనల గురించి తల్చుకున్నప్పుడల్లా, దాన్నుంచి బతికి బయటపడిన వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించిన ఆలోచనల్లో మునిగిపోతాను. ఆష్విట్జ్‌ గురించి ఆలోచన తలెత్తినప్పుడల్లా నేను గతం గురించి కన్నా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆందోళన చెందుతాను!‘  

పద్నాలుగేళ్ళ వయసులో తన పాలబడిన నిర్బంధ శిబిరాల జీవితానుభవాన్ని ‘దిక్కుమాలినతనం‘ (ఫేట్‌లెస్‌నెస్‌) అనే నవలగా రాయడానికి మరో పద్నాలుగేళ్ళు తీసుకున్నాడు కెర్తేజ్‌. అయితే, 1975లో గానీ ఆ నవల అచ్చుకాలేదు. అందులోని ప్రధాన పాత్ర గ్యోర్గియ్‌–‘గ్యూరీ‘– కోవ్స్‌ కూడా పద్నాలుగేళ్ళ యూదు బాలుడే. రచయిత ఆ కుర్రాడి పేరు మార్చాడంతే– మిగతా కథ అంతా, అటూయిటూగా, ఒక్కటే! ఈ నవల వెలువడిన పదమూడేళ్ళకు ‘వైఫల్యం‘ (ఫియాస్కో) అనే మరో నవల వెలువరించాడు కెర్తేజ్‌. ఇది జరిగిన పుష్కరానికి ‘పుట్టని బిడ్డ కోసం ప్రార్థన’ (కాదిష్‌ ఫర్‌ యాన్‌ అన్‌ బోర్న్‌ చైల్డ్‌) అనే ఇంకో నవల రాశాడు. ఈ మూడు నవలలనూ కలిపి ‘హొలోకాస్ట్‌ ట్రైలజీ‘ అంటారు. ముఖ్యంగా, మూడో నవల రచనా సంవిధానం, విశిష్టంగా వుందని విమర్శకులు అంటారు.
వాస్తవానికి కెర్తేజ్‌ ఆలోచనావరణం అంతటా నాజీ విలయమే ఆవరించుకుని ఉందని ఆయనకూ తెలుసు– పాఠకులకూ తెలుసు– విమర్శకులకు మరింత బాగా తెలుసు!

‘నేను ఓ కొత్త నవలకు ఇతివృత్తం గురించి– ఆ మాటకొస్తే, ఏది రాసే విషయం పైనైనా– ఆలోచించడం మొదలుపెట్టగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నిర్బంధ శిబిరాల జీవితానుభవమే! దానితో సంబంధం లేని విషయం గురించి మాటాడాలనుకున్నా, నాకు తెలియకుండానే ఆ విషయం గురించే మాటాడతా! ఆష్విట్జ్‌ ప్రేతాత్మ నా మీద సవారీ చేస్తోంది– అదే నా మాటల్లో పలుకుతోంది. దానితో పోలిస్తే మిగతా విషయాలన్నీ అర్థం లేనివని అనిపిస్తుంది నాకు!’ అన్నాడందుకే కెర్తేజ్‌ తన రచన ‘గ్యాలీ డయరీ’లో. 1961–91 మధ్యకాలంలో తాను రాసిన సర్వరచనల సంకలనంగా ‘గ్యాలీ డయరీ’ని 1993లో వెలువరించారాయన. ఆ తర్వాత పదేళ్ళకు విడుదలైన ‘ముగింపు’ (లిక్విడేషన్‌) ఇతివృత్తం సైతం హొలోకాస్ట్‌ పీడకలే కావడంలో వింతేముంది?      

  • మందలపర్తి కిషోర్‌      

Advertisement
 
Advertisement
Advertisement