వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్‌ఈడీ ఫేస్ మాస్క్‌లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.
ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్‌తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
బొగ్గుపొడితో దంతాలు ధగధగ
కొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.

దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.
సాంబ్రాణితో సహజ మెరుపు!
తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.

ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి.


