కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు

Funday: Rachaputi Ramesh Translated Telugu Story Chivari Prayanam - Sakshi

నేను నాకిచ్చిన అడ్రస్‌కు చేరుకొని హారన్‌ మోగించాను. కాసేపు ఆగి మళ్లీ హారన్‌ వేశాను. నా షిఫ్టులో ఇది ఆఖరి బేరం కాబట్టి కాసేపు వేచి చూసి, ఇంటికి వెళ్లి పోవాలనుకున్నాను. కారును ఇంటి ముందు పార్క్‌ చేసి, ఆ ఇంటి వద్దకు వెళ్లి, తలుపు తట్టాను.

‘ఒక్క నిమిషం’ అంటూ లోపల నుండి పీలగా వున్న ఒక ముసలావిడ గొంతు వినిపించింది. ఇంటిలోపల ఏదో వస్తువును నేలపై తోసుకు వస్తున్న శబ్దం వినిపించింది. 
చాలాసేపటి తరువాత తలుపు తెరుచుకుంది. తొంభై ఏళ్లు పైబడ్డ ఒక పొట్టి వృద్ధురాలు నా ముందు నిలుచుంది. పాత మోడల్‌లో వున్న ఒక ప్రింటెడ్‌ గౌను, నర్సులు వేసుకొనే చిన్న టోపీతో వున్న ఆమె.. నాకు 1940ల బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో దర్శనమిచ్చే నటీమణులను జ్ఞప్తికి తెచ్చింది.

ఆమె పక్కనే ఒక చిన్న నైలాన్‌ సూట్‌ కేసు వుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఏళ్ల తరబడి మనుషులు నివసిస్తున్నట్లు లేదు. కుర్చీలు, సోఫాలన్నింటిపై గుడ్డ కవర్లున్నాయి.
గోడలపై గడియారాలు కానీ, టేబుళ్లపై పాత్రలు కానీ లేవు. ఒక మూలనున్న అట్టపెట్టెలో ఫొటోలు, గాజు సామాగ్రి వుంది.
‘నా పెట్టెను కారు వరకు తీసుకురాగలరా?’ అని నెమ్మదిగా అభ్యర్థించిందామె.

నేను సూట్‌కేసును కారులో పెట్టి, తిరిగి ఆమె దగ్గరకు చేరాను. ఆమెను నడిపించుకొని చిన్నగా నా టాక్సీ దగ్గరకు వచ్చాను.
ఆమె నా దయాహృదయాన్ని మెచ్చుకోసాగింది. 
‘అదేమీ లేదు. మహిళా ప్రయాణికులందరినీ నా తల్లిలాగే చూస్తాను’ అన్నాను.

‘నువ్వు చాలా మంచివాడివి’ అని నాకు ఒక చిరునామా రాసి వున్న కాగితం ఇచ్చిందావిడ.
‘మెయిన్‌ బజార్ల ద్వారా నువ్వక్కడికి చేరుకోగలవా?’ అందామె సీట్లో కూర్చుంటూ.
‘అలా వెళ్తే చాలా దూరమవుతుంది’ అన్నాను నేను.

‘ఏమీ ఫర్వాలేదు, నాకేమీ తొందరలేదు. నేను ఒక విందుకు వెళ్తున్నానంతే’ అందావిడ.
మిర్రర్‌లోంచి ఆమె కళ్లు చెమర్చడం నాకు కనిపించింది.

‘నా కుటుంబ సభ్యులెవరూ లేరు. చనిపోయారు. నేనూ ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు’ సన్నని గొంతుతో చెప్పిందావిడ.
నేను టాక్సీ మీటర్‌ను చిన్నగా బంద్‌ చేశాను.
‘మీరు నన్ను ఏ రూట్‌లో వెళ్లమంటారో చెప్పండి’ అడిగాను.

తరువాత రెండు గంటల పాటు, పట్టణంలో చాలా రోడ్లు తిరిగాం మేం. ఆమె ఒకప్పుడు లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేసిన భవంతిని నాకు చూపించింది.
పెళ్లయిన కొత్తలో, ఆమె భర్తతో కలసి జీవించిన ప్రాంతం గుండా ప్రయాణించాం. ఆమె నన్ను ఒక ఫర్నిచర్‌ దుకాణం ముందు ఆపమని చెప్పి, దానిని తేరిపార చూసి, ఒకప్పుడు అది ఒక బాల్‌రూమ్‌ అనీ, అక్కడ తాను చిన్నతనంలో డాన్స్‌ చేసేదాన్నని అనందంగా చెప్పింది. కొన్నిసార్లు ఆమె నన్ను ఒకానొక భవంతి ముందో, కూడలిలోనో ఆపమని చెప్పి, చీకటిలోకి చూస్తూ కూర్చునేది.

పొద్దుగుంకే సమయంలో ఆమె హఠాత్తుగా ‘నేను అలసిపోయాను, డిన్నర్‌ జరిగే ప్రదేశానికి వెళ్దామిక’ అంది.
నిశబ్దంగా, ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లాం. హాస్పిటల్లా వున్న ఒక చిన్న భవంతి చేరుకొని, ఆ ఇంటి ముందు కారు ఆపాను.

కారు దిగగానే ఇంట్లో నుండి ఇద్దరు పనివాళ్లు వచ్చి, వృద్ధురాలి వంక గౌరవంగా చూశారు. వారు ఆమె రాక కోసం వేచి వున్నట్లుగా వుంది.
నేను కారులోంచి సూట్‌కేసును ఆ ఇంటి గుమ్మం వైపు తీసుకెళ్లాను. అప్పటికే పనివారు వృద్ధురాలిని కారు నుండి దించి, ఒక వీల్‌ చెయిర్లో కూర్చోబెట్టారు.

‘నీకు ఎంత ఇవ్వాలి?’ సూట్‌ కేసును ఇంటిలోపల పెట్టి వచ్చిన నన్ను అడిగిందావిడ.
‘ఏమీ ఇవ్వనవసరం లేదు’ అన్నాను  వినమ్రంగా.

‘నువ్వూ బతకాలి కదా! టాక్సీకి అయిన డబ్బులు నేను ఇవ్వాల్సిందే’ అంది పెద్దావిడ.
‘వేరే ప్రయాణికులున్నారు కదా, ఫర్వాలేదు’ అన్నాను. అనాలోచితంగా, కిందికి వంగి, ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆమె సంతోషంగా నా శిరస్సు తడిమింది.

‘నువ్వు ఒక వృద్ధురాలిని కాసేపు ఆనందంగా గడిపేలా చేశావ్‌. థాంక్‌ యూ, భగవంతుడు నిన్ను తప్పక దీవిస్తాడు’ అందామె ఆప్యాయంగా.
నేను ఆమె చేయి ప్రేమగా నొక్కి, ఇంటి బయటకు నడిచాను. నా వెనుక ఒక తలుపు మూసుకొంది. ఒక జీవితం ముగిసినట్లు నాకనిపించింది.

‘ఒక వేళ ఆమెకు  ఇంటికి వెళ్లే హడావిడిలో వున్న కోపిష్ఠి డ్రైవరు దొరికివుంటే ఏమయ్యేది? తప్పక తన సహనాన్ని కోల్పోయేవాడు’ అనుకున్నాను.
‘నేను మాత్రం, మొదట ఆమె ఇంటి ముందు కారు ఆపినపుడు, రెండు సార్లు హారన్‌ కొట్టి వెళ్లిపోయివుంటే..’  అని కూడా అనుకున్నాను.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు .. ఈ రోజు నేను చేసిన ఈ మంచిపని కన్నా జీవితంలో మరింకే మంచి పని చేయలేదు అనిపించింది.
మనం ఘనకార్యాలు సాధించడం జీవిత పరమార్థమని అనుకుంటాం. మన పెంపకం అటువంటిది. కానీ గొప్ప క్షణాలు జీవితంలో అనుకోకుండా వస్తాయి. ఇతరులు వాటికి ఏమీ విలువ ఇవ్వకపోవచ్చు.

ప్రజలు మనం ఏమి చేశామని కానీ, వారితో ఏం మాట్లాడమని కానీ గుర్తుంచుకోరు. మనం వారిని ఎలా ఫీల్‌ అయ్యేలా చేశామని మాత్రం గుర్తుంచుకుంటారు.
మీరు ఈ కథను చదివి పది మందికీ చెప్తారు కదూ, థాంక్‌ యూ.
జీవితం రంగుల మయమైనది కాదు. కానీ వున్న జీవితాన్ని ఆనందంగా గడపడం మన చేతిలోనే వుంది.
-మూలం : అజ్ఞాత రచయిత
అనువాదం : రాచపూటి రమేశ్‌ 
చదవండి: ఈవారం కథ- అశ్వతి: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్‌.. చివరికి ఏమైంది?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top