ఈవారం కథ- అశ్వతి: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్‌.. చివరికి ఏమైంది?

Sakshi Funday Magazine: Telugu Story Ashwathi By Sadda Subbareddy

‘అశ్వతి హియర్‌’ 
అశ్వతి గొంతు వినటం అదే తొలిసారి నాకు. వెన్నెల కురిసినట్టు, మల్లెలు విరిసినట్టు, కోయిల కూసినట్టు.. అని కథల్లో రచయితలు ఏదేదో రాస్తుంటారు కానీ నాకేం అలా అనిపించలేదు. మామూలుగానే వినిపించింది. ఐతే నిదానంగా అర్థమవసాగింది ఆ గొంతులోని మాధుర్యం. జ్ఞానితో మాట్లాడేటప్పుడు మన జ్ఞానచక్షువులు ఎలా తెరుచుకుంటాయో, అశ్వతితో మాట్లాడేటప్పుడు నాలోని భావతరంగాలు అలానే ప్రకటితమయ్యేవి. అశ్వతిది కేరళ. ఓ రోజు అడిగాను.

‘అశ్వతి.. పేరు చాలా కొత్తగా వుంది. ఇంతకీ ఏమిటీ ఆ పేరుకర్థం?’
‘తెలీదు సర్‌. ఇక్కడ ఆ పేరు చాలా కామన్‌’ అంది. తర్వాత నేనాలోచించాను. ‘అశ్వ’ అనేది సంస్కృత పదం. అది తెలుగైనా, మళయాళమైనా, హిందీ అయినా! ‘అశ్వతి’ అంటే గుర్రాలకు సంబంధించిందేదో అయ్యుంటుంది’ అన్నాను. తను చిన్నబుచ్చుకుంది. 

నేనన్నాను ‘పేరుకి అర్థం తెలీకుండా ఏదేదో పెట్టుకుంటే ఇలా చిన్నబుచ్చుకోవడాల్లాంటివే ఉంటాయి. అందుకే అర్థం తెలుసుకో. అశ్వతి అంటే మనిషిలో వుండే ఒకరమైన గ్రేస్‌ ఫుల్‌నెస్‌!’ 

తను ‘నిజమా’ అని ఆశ్చర్యపోయింది కానీ తేలిగ్గా తీసుకుంది.
అశ్వతి చాలా మంచి పిల్ల. మాట్లాడేటప్పుడు మాటల్లోని నిజాయితీ, ఆ లాలిత్యము, మధ్య మధ్యలో సన్నగా, చిన్నగా నవ్వు.. ఒకమ్మాయితో ప్రేమలో పడటానికి ఒక అబ్బాయికి ఇంతకంటే మత్తు మందు అక్కరలేదనుకుంటా.

ఐతే అశ్వతితో నాకున్నది ప్రేమ అంటే  నే ఒప్పుకోను. అసలు అశ్వతితో నా పరిచయమే విచిత్రంగా జరిగింది. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు. వేసవి విడిది కోసం కేరళ వెళదామని నిశ్చయించుకుని, అక్కడ ఏయే ప్రదేశాలు చూడాలి, వాటి ప్రత్యేకతలు, తినటానికి ఉండటానికి సౌకర్యం.. వగైరాల గురించి ఆన్‌లైన్లో వెతుకుతుంటే వేరే నాలుగైదు ట్రావెల్‌ ఏజన్సీలతో పాటు ‘ప్యారడైజ్‌ హాలిడే’ కనపడింది. అన్నిటికీ ఫోన్‌ చేశాను విషయం కనుక్కుందామని. చివరగా ప్యారడైజ్‌ హాలిడేకి కూడా చేశాను.

అప్పుడే నాకు వినిపించింది ‘అశ్వతి హియర్‌’ అని.
విషయం తనకి చెప్పాక ఎన్ని రోజులు, ఎంత మంది, ఎంత బడ్జెట్‌.. లాంటి సాధారణ ప్రశ్నలయ్యాక నేనన్నాను ‘అశ్వతీ.. కేరళ గురించీ, అక్కడేం బాగుంటాయో, ఎలా ప్లాన్‌ చేసుకోవాలో నాకేమీ తెలీదు. ఏమేం బాగుంటాయో, ఎలా ప్లాన్‌ చేసుకోవాలో నువ్వే చెప్పు’

తను నవ్వింది. వెన్నెల కురిసినట్టు, మల్లెలు విరిసినట్టు, కోయిల కూసినట్టు. అప్పుడే నా మది గదిలో గాయం అవ్వటం ప్రారంభమైంది. అంతకు ముందు ఆమెవరో నాకు తెలీదు. కానీ ఎంతో కాలం నించీ పరిచయమున్న దానిలా అనిపించింది. దానికి రీజనింగ్‌ ఉండకపోవచ్చు.

కొంత మందితో మాట్లాడితే అలానే ఉంటుందేమో. కొంచెం సేపటి లెక్కల తర్వాత తను చెప్పింది ‘మీరు చెప్పే విషయాల్ని బట్టి, మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలను బట్టి మీ కుటుంబంతో కలిపి ఒక ఐదారు రోజులు ఉండాలంటే మొత్తం కలిపి యాభై వేలవుతుంది’ అని.
‘ఇంకేమి తగ్గదా?’

‘మీకు తెలీనిదేముంది సర్‌! అన్నీ ఫైవ్‌ స్టార్‌ లేదా త్రీ స్టార్‌ హోటళ్లే. కారు, దానికి డీజిల్, డ్రైవర్‌ సర్వీస్‌ చార్జెస్‌.. అయినా ఒకసారి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి మీకు ఫోన్‌ చేస్తాను సర్‌!’
అన్నట్టుగానే ఫోన్‌ చేసింది. ‘సర్, ఒక రెండు వేలు తగ్గించుకోండి. అదే ఫైనల్‌ అని చెప్పమన్నారు డైరెక్టర్‌.’ 

‘ఐదువేలు తగ్గించుకో అశ్వతీ’ అన్నాను.  తను నవ్వింది మళ్ళీ. ‘ఐదువేలు తగ్గిస్తే మా శాలరీలోంచి అంతే తగ్గిస్తారు సర్‌.’ ఆ మాటకు నా మనసు చివుక్కుమంది. కస్టమర్‌కి రేటు తగ్గించటం అంటే ఎంప్లాయీ శాలరీ తగ్గించటం కాదుగా. అయినా ‘నీ శాలరీ ఎంత అశ్వతీ’అడిగాను.

‘ఇరవై వేలు సర్‌’ అంది. అందులో మొహమాటమేమీ లేనట్టుగా.
నాకాశ్చర్యం వేసింది.. అశ్వతి మనస్తత్వం గురించి. సాధారణంగా ఒక మనిషి తన వయసు గురించి గానీ, జీతం గురించి గానీ, ఇష్టాయిష్టాల గురించి గానీ పరిచయం లేని అవతలి వ్యక్తికి చెప్పటానికి అంతగా ఇష్టపడరు. అధవా పడినా అబద్ధం చెబుతారు. లేదంటే ఇష్టంలేనప్పుడు చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ అశ్వతి అలాకాక వున్నదున్నట్టుగా చెప్పటం ఆమె మీద నాకు గౌరావాన్ని రెట్టింపు చేసింది.

అదేమాట అడిగాను ‘అదేంటి.. ఎవరైనా ఇలాంటి విషయాలు దాచిపెట్టటానికో, అబద్ధం చెప్పటానికో ట్రై చేస్తారు. నువ్వేమిటి ఇంత ఫ్రాంక్‌గా ఏమీ దాచుకోకుండా చెప్పేస్తున్నావ్‌?’
తను నవ్వింది మళ్ళీ. గుండెను ఎవరో పట్టకారుతో మెలితిప్పినట్టు అనిపించింది.

‘నిజమే. చాలామంది.. అంతెందుకు నా స్నేహితురాళ్ళు కొంతమంది జీతం విషయంలో అబద్ధం చెప్పటం నేను చాలాసార్లు గమనించాను. అందులో అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి సర్‌? ఐనా  నాకొచ్చే జీతం కంటే ఎక్కువ చెప్పుకోవటం వల్ల నాకేమైనా ఉపయోగం వుందా? మీరెవరో నాకు తెలీదు. మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమిటి?

అదీగాక ఒకసారి అబద్ధం చెబితే నాకు అదే అలవాటైపోతుంది. నేనేమిటో నాకు తెలుసు. నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అబద్ధపు పునాదుల మీద వ్యక్తిత్వాన్ని నిర్మించు కోవలసిన అవసరం నాకు లేదు’ దృఢంగా చెప్పింది. 

ఒక మనిషి పుట్టిపెరిగిన వాతావరణం, చుట్టూ పరిస్థితులు, మనుషుల మనస్తత్వాలు.. ఇవన్నీ కలిపి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పడేట్లు చేస్తాయేమో. అశ్వతి అంత దృఢంగా, కాన్ఫిడెంట్‌గా, నిర్భయంగా అలా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమాటే ఆమెతో అంటే మళ్ళీ నవ్వింది. బహుశా నవ్వు ఆమెకు దేవుడిచ్చిన వరమేమో! అదే నాపాలిట శాపం అయ్యేలా వుంది. 

‘అది సరే అశ్వతీ. ఇంతకు ముందు నువ్వు ఏమి చేసేదానివి?’ 
‘ఇండిగో ఎయిర్‌ లైన్స్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేసేదాన్ని సర్‌.’

నిర్ఘాంత పోవటం నా వంతయింది. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అశ్వతి.. జీవితం మీద అంత కమాండింగ్‌గా ఎలా ఉండగలుగుతుందో, అంత కాన్ఫిడెన్స్‌ ఆమెలో ఎలా ప్రారంభం అయిందో ఆమె చెబుతుంటే నేను వింటూనే వున్నా. ఐతే– అశ్వతి నేను అనుకున్నంత అమాయకపు పిల్లేమీ కాదు. తనేమిటో, బలాలేమిటో, బలహీనతలేమిటో  తెలిసిన పిల్ల.

ఇంకో మాటలో చెప్పాలంటే– అశ్వతి గడుసుపిల్ల. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన అమ్మాయి. విరి వికసించిన రోజే వాసన రాదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ పూవు తావి తెలుస్తుంటుంది. అశ్వతి పరిచయంలో రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె మనసు, మాట తీరు, ఆమె లక్షణాలు, లక్ష్యాలు..  అన్నీ వివరించసాగింది. బహుశా అది నామీద నమ్మకమేమో!

అనుకున్నట్టే ఆ సంవత్సరం ఎండాకాలం సెలవులకి మేమంతా కేరళ వెళ్ళొచ్చాం. నిజం చెప్పాలంటే అదో అద్భుతమైన ప్రాంతం.  మనసు ప్రతిచోటా ఉప్పొంగిపోగల వాతావరణం దాని సొంతం. పచ్చని చెట్లు, ఎవరో చిత్రకారుడు గీసిన గీతల మల్లె టీ ఎస్టేట్లు, జారే జలపాతాలు, ఎటు చూసినా కొండలు, వాటి అంచుల చివర్లో కట్టుకున్న ఇళ్ళు, నిద్రలేవగానే వినపడే సుప్రభాతాలు.. ప్రకృతి.. మనిషికి ఎంత విలువైన సంపద ఇచ్చిందో అక్కడికెళ్ళాక నాకర్థమైంది.

సాధారణంగా ఎవరైనా టూర్‌కి వెళ్లి వచ్చాక దాదాపు పది పదిహేను లేదా నెలరోజులు తాము చూసిన ప్రదేశాలు, చెందిన అనుభూతులు, ఆస్వాదించిన క్షణాలు గుర్తుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అవన్నీ జ్ఞాపకాలుగా మారతాయి. నా కేరళ జ్ఞాపకాలు మాత్రం ఇంకా  లేతగా ఇంకా చెప్పాలంటే  నేను ఇంకా కేరళలోనే వున్నట్టే వున్నాయి. దానికి కారణం అశ్వతి. ఆ తర్వాత కూడా అశ్వతితో నా  పరిచయం కొనసాగింది. నాతో మాట్లాడటం తను కంఫర్ట్‌గా ఫీలయిందేమో!

ఆ పరంపరలో ఓ రోజు నేనడిగాను ‘అశ్వతీ! మీది ఏ వూరు? మీరెంతమంది? మీ పేరెంట్స్‌ ఎక్కడుంటారు?’
‘కాలికట్‌ సర్‌. నాకు ఓ చెల్లి వుంది. నాన్న దుబాయ్‌లో ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. అమ్మ మిగిలిన బంధువులతో కలసి కాలికట్‌లోనే ఉంటోంది. నేను

డిగ్రీ పూర్తయ్యాక ఏవియేషన్‌ మీద ఇంటరెస్ట్‌తో కోర్స్‌లో చేరి ట్రైనింగ్‌ తీసుకుని ఇండిగోలో జాయిన్‌ అయ్యా. ఆ లైఫ్‌ చాలా బాగుండేది సర్‌!’ 
‘మరి ఈ వైపు ఎందుకొచ్చావు?’
‘కరోనా టైమ్‌లో ఫ్లైట్లు లేవు కదా సర్‌! ఆ కాంట్రాక్ట్‌ వుద్యోగం పోయింది. అవసరానికి ఈ ట్రావెల్‌ ఏజెన్సీలో చేరాల్సివచ్చింది.’
‘మీ చెల్లి ఏం చేస్తోంది?’

‘డిగ్రీ చేస్తోంది. బాధ్యత అంతా నాదే. చెల్లికి నెలనెలా నేనే అమౌంట్‌ పంపిస్తుంటాను. అమ్మ కూడా నా జీతంలోంచి నెలనెలా కొంత ఇంట్లో ఇవ్వమంటుంది. అన్నీ అడ్జస్ట్‌ చేసుకుంటున్నాను.’

నా మనసు ఒక్కసారిగా చివుక్కుమన్నది. చాలీ చాలని సంపాదన, మధ్యతరగతి కష్టాలు, బరువులు బాధ్యతలు ఎలా వుంటాయో నాకు తెలుసు. దానిగురించి నేనిక రెట్టించదలచుకోలేదు. కానీ, అశ్వతి అంటే నాకు నిజాయితీతో కూడిన అభిప్రాయం ఏర్పడింది. వయసులో తను చిన్నది కావచ్చు కానీ తనమీద గౌరవం రెట్టింపయింది. నాకు నచ్చిన మనిషి.. మనసుకు దగ్గరైన మనిషి. 

ఆమె కోసం, ఆమె సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చేయాలనిపిస్తోంది. ఏం చేయాలి? అసలెందుకు చేయాలి? నిజానికి ప్రతిమనిషికీ వుండే కష్టాలే ఆమెకూ వున్నాయి. అవన్నీ దాటిన తర్వాతే కదా మనిషి విజయం సాధించినట్టు. అసలు నేనెందుకు అశ్వతి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడటం సాధారణం. కానీ ఈ వయసులో కూడానా? అది నా బలహీనతా? లేక ఆమెలో అంత ఆకర్షణ ఉందా?

ఎన్నో జీవితాలు చూసి, అనుభవాలు ఎదుర్కొని, జీవితపు ఒక్కో స్టేజ్‌ని దాటుకుంటూ ఇంత దూరం వచ్చికూడా ఇంకా ఎందుకీ బాధ! ప్రేమంటే బాధే కదా! ఎవరో వస్తారు. నాల్రోజులుండి వెళతారు. రాకముందు రాలేదనే బాధ. వచ్చాక వెళతారనే బాధ. ఇంత బాధను మనసు ఎందుకు పదేపదే కోరుకుంటుంది?

తలకింద రెండుచేతులూ పెట్టుకుని ఆకాశం కేసి కన్నార్పకుండా పున్నమి చంద్రుడి వైపు చూస్తే ప్రేమించినవారు అక్కడ కనపడతారట. ఆ చంద్రబింబంలో ఒక ఆకారం క్రమక్రమంగా రూపుదిద్దుకోవటం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరిదీ ఆ రూపం?
నాదా? మా అమ్మదా? నా భార్యాదా? పిల్లలదా? అశ్వతిదా?
∙∙ 
అశ్వతికి ఎయిర్‌ పోర్టులో మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేరాలనేది కోరిక. తీరాలంటే చాలా పరిమితులు ఉంటాయి. దానికి నోటిఫికేషన్‌ పడాలి.. పరీక్షలో పాసై ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ కావాలి.. అనుకున్నంత జీతం ఇవ్వాలి.. కోరుకున్నచోట వుద్యోగం పడాలి.. ఇవన్నీ ఒకవైపు. అప్లికేషన్‌ ఫీజు వేలల్లో కట్టాలి.

ఇంటర్వ్యూ ఏ ముంబైలోనో, ఢిల్లీలోనో ఐతే అక్కడికి వెళ్ళాలి. ఖర్చులు తడిసిమోపెడు. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అశ్వతి ఇన్ని బంధాలు, బంధుత్వాలు, బరువుల మధ్య ఎంత సంపాదించగలదు? ఎంతని మిగల్చగలదు? 

ప్రతిమనిషీ తన సమస్యలన్నిటికీ కారణం కేవలం డబ్బులేకపోవటమేనని భావిస్తాడు. అశ్వతి సమస్యలు అశ్వతికి ఉంటే నా సమస్యలు నాకున్నాయి. కాకపోతే తేడా అల్లా సమస్య గాఢత, సాంద్రతల్లోనే. 

అయినా ఏ సంబంధమూ లేని అశ్వతికి కష్టం వస్తే నాకే వచ్చినట్టు ఎందుకనిపిస్తోంది? ఆమెను ఆదుకోవాలన్న తపన, ఆమె లక్ష్యంలో భాగం కావాలన్న కోరిక నాకెందుకు? అసలు ఆమె అంటే నాకెందుకింత ప్రత్యేకమైన అభిమానం? ఒకవేళ, అశ్వతి కాక అబ్బాయి ఎవరైనా ఇలా అడిగుంటే నేను ఆలోచించేవాడినా? అశ్వతిని ప్రేమిస్తున్నానా?

కాబట్టే ఇంత చేస్తున్నానా? ఇన్నేళ్ల నా జీవితంలో నేను ఎక్కని శిఖరం లేదు. చూడని పాతాళం లేదు.  పుట్టుక–చావు, తీపి–చేదు, సుఖం–దుఃఖం, భయం–నిర్భయం, వివాహాత్పూర్వ ప్రేమలు, వివాహానంతర పరిచయాలు.. అన్నీ అనుభవైకవేద్యమే కదా? మరి అశ్వతి ప్రేమలో ఇప్పుడు నేను కొత్తగా పొందబోయేదేమిటి?

జీవితం అంటే.. జరిగే సంఘటనల సమాహారమే ఐతే అశ్వతితో ప్రేమ తర్వాత నా జీవితంలో జరగబోయే కొత్త సంఘటనలేముంటాయి? అశ్వతిలో నేను నా కూతుర్ని చూసుకుంటున్నానా? అందుకే ఆమె మీద ఇంత ప్రేమ కనబరుస్తున్నానా? ఈ ఆలోచన వచ్చేటప్పటికి మనసు కాస్త స్థిమిత పడింది. కానీ కొద్దిసేపే. 

మనసు ఒప్పుకోమంటున్నా, ప్రాక్టికల్‌గా ఆలోచించే బుద్ధి అందుకు నిరాకరిస్తోంది. సంధిగ్ధాసంధిగ్ధాల్లో పడి మనసు కొట్టుమిట్టాడుతోంది. ఏదైతే అదవుతుందని నేనామెకు ఫోన్‌ చేసి తనకు ఎంత కావాలో అడిగి అంత డబ్బూ తన అకౌంట్‌లో వేశాను.
∙∙ 
ఓ రోజు ఉదయాన్నే ఫోన్‌ మోగింది. చూస్తే అశ్వతి. ‘గుడ్‌ మార్నింగ్‌ సర్, నేను మళ్ళీ ఎయిర్‌ పోర్ట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా జాయిన్‌ అయ్యాను. థాంక్‌ యు వెరీ మచ్‌ ఫర్‌ యువర్‌ హెల్ప్‌. నా జీవితమంతా మీకు రుణపడి వుంటాను’ ఆమె గొంతులో నిజాయితీ, కృతజ్ఞత నాకు స్పష్టంగా వినిపించింది. అశ్వతి అంటే అంతే! ఏదయినా కమిట్‌మెంట్‌తో చేస్తుంది.. చెప్పే మాటైనా చేసే చేతైనా!

నేను నవ్వాను.. ‘అదంతా నీ కృషి, పట్టుదలే అశ్వతీ. నేను చేసింది ఏమీలేదిందులో. కేవలం నీకు కాస్త చేయూతనివ్వడం తప్ప. దేవుడు నీకు మంచే చేశాడు!’
‘ఆ దేవుడి సంగతేమోగానీ.. నా దేవుడు మాత్రం మీరే సర్‌!’

తను నవ్వింది. అదే.. వెన్నెల కురిసినట్టు.. మల్లెల్లు విరిసినట్టు.. కోయిల కూసినట్టు..
‘ఏదేమైనా నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కింది. గాడ్‌ బ్లెస్‌ యు అశ్వతీ’ అన్నాను.

‘థాంక్‌ యు సర్‌! జీవితంలో ఎపుడో ఒకప్పుడు ఎక్కడో ఓచోట ఏదొక సమయంలో దేవుడు మనిద్దరినీ కలుపుతాడనుకుంటున్నా. వుంటాను సర్‌.’
‘మంచిది’ నేను ఫోన్‌ పెట్టేశాను.

సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత..  నా వాట్సాప్‌కి తన సెక్యూరిటీ ఆఫీసర్‌ డ్రెస్‌లో రెండు ఫొటోలు పంపింది.
అదే మొట్టమొదటిసారి నేను అశ్వతిని చూడటం. దిగంతాల మందహాస మల్లీ నవలతాంతాల మాలికలల్లి, దయాశిశిర సుధాభరిత కటాక్షేక్షణముల జల్లి.. నారు పోసిన ముంగిట్లో.. గన్నేరు పూసిన వాకిట్లో.. పన్నీరు చల్లిన లోగిట్లో ఇంపై కృష్ణశాస్త్రి కలంలో ఇంకై.. సొంపై.. పులకరింపై.. ఆ పులకరింపు జలదరింపై.. ఒళ్ళంతా పాకింది.

ఇన్ని రోజుల, నెలల మా పరిచయంలో మేం ఎదురుపడిందీ లేదు.. ఒకర్నొకరు చూసుకున్నదీ లేదు. కేవలం ఫోన్‌లో సంభాషణలే. కానీ మనసులు కలిశాయి. మదిలోని బాసలు తెలిశాయి. ఊహలు కలిశాయి. ఊసులూ కలిశాయి. బంధం బలపడింది.. అంతే. ఫొటోలోని అశ్వతి నా ఊహకు సరిగ్గా సరిపోయింది. 

అప్రయత్నంగా నా పెదాల మీద దిగులు చిరునవ్వు తొంగిచూసింది. కానీ మనసులో గాయం మాత్రం అలానే ఉండిపోయింది. 
‘నీవు రావు. శీతల సమీరం కోసం శరన్మేఘం ఎదురు చూస్తూనే ఉంటుంది. దిగులు సాయంత్రాలు ఎర్రజీరలై కళ్ళలో నిలుస్తాయి. కనురెప్పల వాలిన వేదన నిద్రని దూరం చేస్తుంది. గ్రీష్మం నవ్వుతుంది.

హేమంతం హేళన చేస్తుంది. ఆమని ఆగిపోతుంది. కనురెప్పల సందుల్లోంచి కాలం నీటి చుక్కలా రాలిపోతుంది. ఆకాశం మీద సముద్రం వర్షమై ఏడుస్తుంది. శరీరాన్ని వీడకుండా పరలోకాన్ని చేరటం సాధ్యమేమో కానీ, ప్రేమానుభవపు విషాద స్మృతి జీవితంలో ఒకటైనా లేకుండా మనిషి బతుకు కడతేరటం సాధ్యమా?

ఎన్ని అనుభవాల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్‌బాక్స్‌ లాంటి మనసు, గతం నేర్పే అనుభవాలని ఎప్పటికి నేర్చుకుంటుంది? వాస్తవమనే భూమిని, అస్తిత్వం లేని ఆకాశం తాకే వృథా ప్రయాసే ‘ప్రేమ’ అన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుంది? ఎంత తొందరగా నా జీవితంలోకి వచ్చావో.. అంతే తొందరగా వెళ్లి పోయావు.. అశ్వతీ.. ఓ అశ్వతీ..!’
-సడ్డా సుబ్బారెడ్డి 
చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్‌ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా!
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top