
ఆకట్టుకునేలా బుట్టబోమ్మ పాటకు స్టెప్పులు
రీల్స్, ఫన్ యాక్టివిటీస్‌తో సందడి చేసిన తారలు
విశ్రాంతి సమయాల్లోనూ వినోదం
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్ యాక్టివిటీస్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్ డెన్మార్క్, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్ మీడియా యాప్స్ కోసం సెల్ఫీ మోడ్‌లో రీల్స్ చేస్తూ సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్‌లను ఎప్పటికప్పుడు వారి ఇన్‌స్టా, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే మిస్ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్‌లోని స్విమ్మింగ్ ఫూల్ పరిసరాల్లో చేసిన క్యాట్ వాక్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్ సెల్వడోర్ వంటి దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్‌లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు.